హాస్యరత్న పద్శనాభం ‘పొట్టిప్లీడరు’
న్యాయవాది అన్నవాడు ప్రాణం పోయినా సత్యాన్ని, ధర్మాన్ని పరిరక్షించాలి.... మంచిని పెంచాలి. కరుణ, త్యాగగుణం లోంచి పుట్టినప్పుడే ఏ హాస్యరసానికైనా శాశ్వతం లభిస్తుంది. ఈ ఆశయసిద్ధి నేపథ్యంలో నడిచే హాస్యనటుడు పద్మనాభం సొంతంగా రేఖా అండ్‌ మురళీ ఆర్ట్‌ పతాకంపై నిర్మించి విజయం సాధించిన చిత్రం ‘పొట్టిప్లీడరు’. తల్లి కోరిక నేరవేర్చిన తనయునిగా, తను ప్రేమించిన యువతిని ఆమె కోరిక మేరకు మరొక యువకుడికి కట్టబెట్టిన త్యాగధనుడిగా, నిరపరాధికి శిక్ష పడరాదని శ్రమించి రుజువులతో నిరూపించి విడుదల చేయించిన ఆదర్శ ‘పొట్టిప్లీడరు’గా పద్మనాభం నటించి మెప్పించిన సినిమా ఇది. ఈ సినిమా 1966, మే 5న విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలు కొన్ని...


* ఇదీ కథ....
ప్రసాదం (పద్మనాభం) ఒక వకీలుగారి అబ్బాయి. తండ్రి మరణించాక తల్లి (నిర్మల) తన మకాం పల్లెటూరికి మార్చి, కొడుకుని అష్టకష్టాలుపడి చదివించింది. తన భర్తలాగే ప్రసాదాన్ని ప్లీడరు చెయ్యాలని కలలు కన్నది. తల్లి కలలు నిజం చేస్తూ ప్రసాదం యల్‌.యల్‌.బి పరీక్షను ప్రథమ శ్రేణిలో పూర్తి చేశాడు. ఆ సంతోషవార్త విని ఆనందం పట్టలేక కన్నుమూసింది. కలత చెందిన ప్రసాదం ఇల్లు, పొలం అమ్మేసి, చదువు కోసం తల్లి చేసిన అప్పులు తీర్చి పట్నం బయలుదేరాడు. ప్రసాదం మేనమామ ధనరాజు (రమణారెడ్డి) ఇంటికి వెళ్లాడు. ఆస్తిపరుడైన ధనరాజు, ప్రసాదాన్ని చిన్నచూపు చూసినా, అతని కూతురు శాంత (గీతాంజలి) ఎంతో ఆదరించి ఆప్యాయంగా చూసింది. ధనరాజు ఇంట్లోనే రామారావు (శోభన్‌బాబు) అనే కుర్రవాడు అద్దెకు ఉంటూ కాలేజీలో బీఏ చదువుకుంటూ ఉంటాడు. ప్రసాదానికి అతనితో స్నేహం కలిసింది. చిన్నతనం నుంచి ప్రసాదం, శాంత కలిసి ఆడుకునేవాళ్లు. పెద్దయ్యాక ఇద్దరికీ పెళ్లి చేయాలని కూడా ఇరుకుటుంబాల అనుకునేవారు. అందుకే ప్రసాదానికి శాంతి అంటే ప్రాణం. పట్నంలో ధనరాజు ఇంటికి రావడానికి కూడా అది ఒక కారణం. ప్రసాదం ధనరాజుతో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ‘‘ప్లీడరు చేసి డబ్బు సంపాదించు, ఆ తరువాత చూద్దాం’ అంటూ మామయ్య వాయిదా వేశాడు. డబ్బు, పేరు సంపాదించాకే మామయ్య ఇంట్లో అడుగు పెడతానని ప్రసాదం శపథం చేసి బయటకొచ్చేవాడు. అబద్ధాలరావు (రావికొండలరావు) అనే ప్లీడరు వద్ద సహాయకుడిగా చేరాడు. అతని కూతురు విజయ (వాణిశ్రీ), ప్రసాదం నిజాయతీ చూసి అభిమానించింది. అబద్ధాల రావు చేసే తప్పుడు కేసులను ప్రసాదం ప్రతిఘటించాడు. అతడు ప్రసాదాన్ని బయటకు వెళ్లిపొమ్మన్నాడు. అదృష్టం తలుపు తట్టి ప్రసాదానికి లాటరీలో రెండు లక్షల బహుమతి వచ్చింది ఆ డబ్బును చూసిన మామయ్య ధనరాజు ప్రసాదాన్ని పిలిచి శాంతతో వివాహం జరిపించేందుకు అంగీకారం తెలిపాడు. కాని శాంత రామారావును ప్రేమిస్తోందని ప్రసాదం తెలుసుకున్నాడు. శాంత సౌఖ్యమే ముఖ్యమని తలచి తనకు లాటరీలో వచ్చిన డబ్బునంతా మామయ్యకు ఇచ్చి రామారావుతో శాంత పెళ్లి జరిపించాడు. ప్రసాదం న్యాయం కోసం కృషిచేస్తూ అనతికాలంలోనే పేరుమోపిన ప్లీడరయ్యాడు. అన్నెంపున్నెం ఎరుగని రామారావు ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడు. రామారావు నేరస్తుడని నిరూపించే బలమైన సాక్ష్యాలు లభించడంతో అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. శాంత మాంగల్యం కాపాడేందుకు ప్రసాదం అసలైన రుజువులు సేకరించి రామారావు నిర్దోషి అని వాదించి, అతణ్ణి ఉరిశిక్ష నుంచి తప్పించి విడిపించాడు. చివరకు ప్రసాదం విజయను పెళ్లాడాడు. దానితో ‘పొట్టి ప్లీడరు’ సినిమా కథ ముగుస్తుంది. ఈ సినిమాలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఐరావతంగా ముక్కాముల, నౌకరు చవలయ్యగా బాలకృష్ణ, లాటరీ ఏజెంటుగా పేకేటి శివరాం, రామారావు స్నేహితుడు నారాయణారావుగా ప్రభాకర్‌రెడ్డి నటించారు. రామచంద్రరావు, మల్లాది, సీతారాం, ప్రమీల, అన్నపూర్ణ ఇతర పాత్రలు పోషించగా అతిథి పాత్రల్లో నాగయ్య, పెరుమాళ్లు, సురేష్‌ సంస్థ అధిపతి రామానాయుడు నటించారు. వాణీ ఫిలిమ్స్‌ వారు ఈ చిత్రాన్ని పంపిణీ చేసారు. ఈ సినిమాలో పొట్టి ప్లీడరుగా పద్మనాభం నటించాడనే కంటే పొట్టి ప్లీడరే పద్మనాభంగా జీవించాడనడం సమంజసం!!


* కోదండపా(బా)ణీలు
‘పొట్టి ప్లీడరు’ సినిమాకు ఎస్‌.పి.కోదండపాణి సంగీత దర్శకుడు. ఈ సినిమాలో వచ్చే తొలిపాటే నేపథ్యగీతం. కొసరాజు రాయగా ఘంటసాల ఆలపించిన ‘‘చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే. ఎపుడో ఒకసారీ ఏదో ఒక దారీ దొరుకునులే బాటసారీ’’ అనే పల్లవితో ప్రారంభమయ్యే ఈ పాట రిక్తహస్తాలతో పట్నం బయలుదేరిన పద్మనాభానికి ధైర్యం నూరిపోసే పాట. ‘‘అయినవాళ్లు లేరని దిగులు జెందకోయ్‌... ఉన్నవాళ్లె నావాళ్లని అనుకోవలెనోయ్‌.. భయమెందుకు పద ముందుకు ఓయి బాటసారీ’’ అనే చరణంలో హితబోధ నిండివుంది. ‘‘ఆశ తోటి లోకమంత బ్రతుకుతుందిరా, అందులోనే సౌఖ్యానికి లంకెవుందిరా...ఈ కాలచక్రమును ఆపగ ఎవరితరమురా... భయమెందుకు పదముందుకు ఓయి బాటసారీ’’ అనే రెండవ చరణంలో వేదాంతముంది. చేతిలో సంచి పట్టుకొని పద్మనాభం రోడ్డువెంటా, పంటపొలాల వెంట నడుస్తుంటే ఈ పాట సాగుతుంది. మధ్యలో పద్మనాభం కుమారుడు మాస్టర్‌ మురళి వేణువు ఊదుతూ కనిపిస్తాడు. మరొక అద్భుత గీతం మహాకవి శ్రీశ్రీ విరచిత లాలి పాట. సుశీల ఆలపించిన ఈ గీతానికి అభినయం గీతాంజలి. ‘‘నీకెందుకో మురిపాలు కురిపించు చిరునవ్వులూ సిరిమల్లెలూ’’ అంటూ పిల్లవాడిని ఆవేదనతో ప్రశ్నిస్తూ పాడే జోలపాట ఇది. ఈ పాట బాగా హిట్టయింది. శోభన్‌బాబు, గీతాంజలి యుగళగీతం ‘‘ఊగెను మనసూ పొంగెను వయసూ ఎందుకనో అది ఏమో ఏమో’’ కూడా వినదగిన పాటే. ఈ గీతాన్ని సుశీల, పి.బి.శ్రీనివాస్‌ ఆలపించారు. వీరిద్దరికే మరో యుగళ గీతాన్ని వీటూరి రాయగా జయదేవ్, సుమిత్ర పాడారు. ‘‘ఝల్లుమనీ నను సోకెను గాలీ గుండెలలో వింత చలీ’’ అంటూ సాగే ఈ పాట సాధారణమే. ‘‘ఇదిగో తమాషా’’ (రాజశ్రీ రచన; జానకి అలాపన), ‘‘పొట్టిప్లీడరుగారూ లవ్‌లో జాలీ ఏలా చూడరు మీరూ’’ (అప్పలాచార్య రచన - పద్మనాభం, ఎల్‌.ఆర్‌.ఈశ్వరి అలాపన) అతి సాధారణమైన తమాషా పాటలు.* సినిమా విశిష్టతలు....

* రేఖా అండ్‌ మురళీ ఆర్ట్‌ పతాకం మీద హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన రెండవ చిత్రం ‘‘పొట్టిప్లీడరు’’. 1955లో తొలి ప్రయత్నంగా ఎన్‌.టి.ఆర్‌ సావిత్రి కాంబినేషన్లో ‘‘దేవత’’ చిత్రాన్ని నిర్మించి విజయం సాధించిన వెంటనే నిర్మించిన రెండవ చిత్రం ఇది. రెంటికీ కె.హేమాంబరధరరావు దర్శకుడు.


*
పద్మనాభం, వల్లం నరసింహారావు ఇద్దరూ నాటక రంగం నుంచి వచ్చినవారే. వీరిద్దరూ కలిసి ఒక నాటక సంస్థను నెలకొల్పి వడ్లమాని విశ్వనాథం, మోహనదాసు, రామచంద్రరావు, ఆదోని లక్ష్మి మీనాకుమారిలను కలుపుకుని ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ఆ నాటక సంస్థ పేరే ‘‘రేఖా అండ్‌ మురళీ ఆర్ట్స్‌’’. వల్లం నరసింహారావు కూతురు ‘‘రేఖ’’, పద్మనాభం కొడుకు ‘‘మురళీ’’ పేర్లు కలిసి వచ్చేలా బ్యానర్‌ నెలకొల్పారు. ఆ బ్యానర్‌ మీదే పద్మనాభం సినిమాలు నిర్మించాడు. ఆ నాటక రంగ సంస్థకు సంగీత దర్శకుడే కోదండపాణి అతడే పద్మనాభం సినిమాలకు ఆస్థాన సంగీతదర్శకుడు.

*
‘‘దేవత’’ సినిమా 50 రోజుల అభినందన సందర్భంగా రాజమహేంద్రవరంలో ప్రముఖ నాటక రచయిత భమిడిపాటి రాధాకృష్ణ పద్మనాభాన్ని కలిసారు. భమిడిపాటి రచించిన ‘‘ఇదేమిటి’’ నాటకం మద్రాసు వాణిమహాల్లో ప్రదర్శితమైనప్పుడు పద్మనాభం ఆ నాటకానికి హాజరయ్యారు. అదే నాటకాన్ని కొద్ది మార్పులతో సినిమాగా తీయాలనే ఆలోచనకు రాజమండ్రిలోనే బీజం పడింది. ఆ కథే ‘‘పొట్టి ప్లీడరు’’ సినిమా. ఈ సినిమాకు మాటలు రాసింది కూడా భమిడిపాటి రాధాకృష్ణే!


*
‘‘పొట్టిప్లీడరు’’ సినిమాకు ఏకంగా ఐదుగురు నృత్యదర్శకులు పనిచేసారు. వారు పసుమర్తి కృష్ణమూర్తి, తంగప్ప, చిన్ని, సంపత్, కె.ఎస్‌.రెడ్డి. నిర్మాతగా పద్మనాభం తమ్ముడు బి.పురుషోత్తం వ్యవహరించారు.

* ఈ సినిమాకి టైటిల్స్‌ చూపించడంలో దర్శకుడు కొత్త పుంతలు తొక్కారు. ‘‘పొట్టిప్లీడరు’’ సినిమాకి పనిచేసిన సాంకేతిక సిబ్బంది, పంపిణీదారులను స్వయంగా పద్మనాభం పరిచయం చేస్తాడు. ఇదొక వినూత్న ప్రయోగం.


*
అయితే ఈ సినిమాలో కొన్ని ఎబ్బెట్టు సన్నివేశాలు లేకపోలేదు. కోర్టు సీనులో పద్మనాభం, ముక్కాముల వాదించుకుంటూ పోట్లాడుకోవడం, కీచుగొంతుతో అరచుకోవడం ఇబ్బంది కలిగించే అంశాలు. ‘‘పొట్టిప్లీడరు గారూ’’ అంటూ వాణిశ్రీ చేసే నాట్యం. ఆమె ధరించిన దుస్తులు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి.

* ఇందులో రావి కొండలరావు ప్లీడరు పాత్ర అటు హాస్యాన్ని పంచుతూ ఇటు అబద్దాల సాక్ష్యాలతో కేసులను తారుమారు చేసే విధానం ప్రేక్షకులను ఆకర్షించింది. ‘‘అబద్దాలరావు’’ అనే పేరు ఈ పాత్రకు అచ్చుగుద్దినట్లు సరిపోయింది. అప్పుడప్పుడే చిత్రరంగంలో నిలదొక్కుకుంటున్న శోభన్‌బాబు, వాణిశ్రీల నటజీవిత సోపానాలకు సహకరించిన సినిమా ‘‘పొట్టిప్లీడరు’’.
- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.