ప్ర‌కాష్‌రాజ్ గురించి అప్ప‌ట్లో శోభ‌న్‌బాబు!
వంద‌ల చిత్రాలు చేసిన అనుభ‌వం శోభ‌న్‌బాబు సొంతం. ఎంతోమంది న‌టులు ఆయ‌న సినిమాల‌తోనే ప‌రిచ‌య‌మ‌య్యారు. ఎవ‌రిలో ఎలాంటి ప్ర‌తిభ దాగుందో ఆయ‌న ప‌సిగ‌ట్ట‌కుండా ఎలా ఉంటారు? అనేక భాష‌ల్లో న‌టించి మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప‌్ర‌కాష్‌రాజ్ గురించి అప్ప‌ట్లోనే శోభ‌న్‌బాబు ఓ మాట చెప్పార‌ట‌. ఆ మాటల గురించి ఇటీవ‌ల ఓ వేడుక‌లో చెప్పారు ప్ర‌కాష్‌రాజ్‌. శోభ‌న్‌బాబు చెప్పింది చెప్పిన‌ట్టుగానే నా జీవితంలో జ‌రిగిందంటూ ఆ మాట‌ల్ని గుర్తు చేసుకొన్నారిలా. ``శోభ‌న్‌బాబుతో నేను `దొర‌బాబు` చిత్రంలో న‌టించా. అప్పుడ‌ప్పుడే ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన‌వాణ్ని కాబ‌ట్టి బాగా ఉడుకురక్తంతో ఉత్సాహంగా క‌నిపించేవాణ్ని. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో నా ఆవేశం చూసి `ప్ర‌కాష్... న‌ట‌నే క‌దా, ఎందుకంత తొంద‌ర‌, కాస్త నిదానం` అన్నారు. అలాగే ఒక రోజు ఆయ‌న న‌న్ను ద‌గ్గ‌రికి పిలుచుకుని `ప్ర‌కాష్ నువ్వు రెండేళ్ల త‌ర్వాత న‌న్ను మ‌ళ్లీ క‌లువు` అన్నారు. `రెండేళ్ల త‌ర్వాత క‌ల‌వ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌డ‌మేంటి గురువుగారూ, త‌ప్ప‌కుండా క‌లుస్తా` అని చెప్పా. ఆయ‌నప్పుడు `నువ్వు క‌ల‌వ‌లేవు, ఎందుకంటే అప్పుడు బిజీ ఆర్టిస్టువి అయ్యుంటావు` అని చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ట్టుగానే రెండేళ్ల త‌ర్వాత నేను చాలా బిజీ అయిపోయాను. ఉన్న‌ట్టుండి ఒక రోజు ఆయ‌న ఎదురైన‌ప్పుడు `గురువుగారూ, మీరు చెప్పిందే నిజ‌మైంది, మిమ్మ‌ల్ని క‌ల‌వ‌లేక‌పోయాను. అంత బిజీగా ఉన్నా` అని చెప్పా. `నీలో విద్వ‌త్తుని చూసే ఆ రోజు ఆ మాట చెప్పా. నీకు మ‌రింత భ‌విష్య‌త్తు ఉంది. మ‌రింత ఎత్తుకు ఎదిగావు` అని ఆయ‌న చెప్పి వెళ్లిపోయారు. ఆ ఆశీర్వాదంతోనే ఇంత దూరం వ‌చ్చా`` అంటూ శోభ‌న్‌బాబుతో త‌న‌కున్న అనుబంధాన్నినెమ‌రేసుకొన్నారు ప్ర‌కాష్‌రాజ్‌.

సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.