పవన్‌ నిర్ణయంతోనే.. ఆ పాత్రల్ని మార్చా!!

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినీ కెరీర్‌లోని అపురూపమైన చిత్రాల్లో ‘బద్రి’ది ఓ ప్రత్యేక స్థానం. ఈ చిత్రంతోనే డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తెరపైకి అడుగుపెట్టారు. ఏప్రిల్‌ 20కి ఈ చిత్రం విడుదలై సరిగ్గా 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌.. ఆ చిత్ర కథానాయిక రేణు దేశాయ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రేణు తన వ్యక్తిగత జీవితానికి ‘బద్రి’ రూపంలో ఎన్నో విలువైన జ్ఞాపకాలను అందించిన పూరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పూరి.. రేణుతో మాట్లాడుతూ ఆమె చేసిన వెన్నెల పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్తను బయటపెట్టారు. నిజానికి ఈ చిత్రానికి రేణుని సరయూ అనే పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారట పూరి. అందులోని మరో కీలక పాత్ర అయిన వెన్నెల కోసం అమీషా పటేల్‌ను ఎంపిక చేసుకున్నారు. కానీ, తీరా సెట్స్‌లోకి వెళ్లాక రేణులోని కొంటె తనాన్ని ఆమె వ్యక్తిత్వాన్ని గమనించిన పవన్‌ కల్యాణ్‌.. వెన్నెల పాత్రలోని కొంటెతనాన్ని సరిగ్గా పలికించగల నైపుణ్యం రేణుకు ఉందని, ఆమెతోనే ఆ పాత్రను చేయించమని సూచించారట. అలా చిత్రీకరణ సమయంలోనే పవన్‌ సూచన మేరకు సరయూ పాత్ర చెయ్యాల్సిన రేణుతో వెన్నెల పాత్రను.. ఈ పాత్ర చెయ్యాల్సిన అమీషాతో సరయూ పాత్రను చేయించారట పూరి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.