ఏరువాక సాగించిన రోజులు మారాయి

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక భూసామ్య వ్యవస్థను అణచివేసి సోషలిజాన్ని బలోపేతం చెయ్యాలని కమ్యూనిస్టులు ఉద్యమిస్తున్న రోజులవి. అది గ్రహించిన కాంగ్రెస్‌ పార్టీ తాము కూడా సోషలిజానికి అనుకూలమేనంటూ ప్రకటన చేసింది. అప్పుడే ‘రోజుల మారాయి’ చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేసిన సారథీ ఫిలిమ్స్‌ లిమిటెడ్‌ నిర్మాత సిని రామకృష్ణ ప్రసాద్‌, సోషలిస్ట్‌ సమాజ స్థాపనకు ఈ సినిమా దోహదం చేస్తుందని ఒక ప్రకటన చేసారు. అంతేకాకుండా అప్పుడే జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామిక శక్తులను గెలిపించిన ఆంధ్ర ప్రజానీకానికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నామని కూడా ప్రకటించారు. బంజరు భూములను పేద రైతులకు పంచి పెడితే మేలు జరుగుతుందనే నేపథ్యంలో ‘రోజులు మారాయి’ సినిమాను నిర్మించారు. పెత్తందార్ల వ్యవస్థలో భూస్వాములకు పేద రైతాంగానికి మధ్య జరిగే ఘర్షణ కథాంశంతో సినిమా నిర్మాణం జరిగింది. దీనిని 1950వ దశకంలో వచ్చిన విప్లవాత్మక చిత్రంగా అభివర్ణించవచ్చు. ఈ సినిమా ఏప్రిల్‌ 14, 1955న విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవం జరుపుకుంటున్న ఈ సినిమా విశేషాలు కొన్ని మీకోసం...


సినీ నేపథ్యం

గతంలో రైతు సమస్యల నేపథ్యంలో షావుకారు (1950), పల్లెటూరు (1952), పేదరైతు (1952) వంటి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు విజయవంతమైనా రైతుల సమస్యలను కళాత్మకంగా చిత్రించలేక పోయాయని చెప్పకునేవారు. ఆ లోపాలను అధిగమిస్తూ నిర్మించిన సినిమా ‘రోజలుమారాయి’. కృష్ణా జిల్లా చల్లపల్లి జమీందారు యార్లగడ్డ శివరామప్రసాద్‌, గూడవల్లి రామబ్రహ్మం మంచి స్నేహితులు. రామబ్రహ్మం ప్రేరణతో ప్రసాద్‌ చిత్ర నిర్మాణం వైపు మొగ్గుచూపి సారథి ఫిలిమ్స్‌ (ప్రై) లిమిటెడ్‌ సంస్థను స్థాపించి మొదటి ప్రయత్నంగా 1938లో రామబ్రహ్మం దర్శకత్వంలో కులవ్యవస్థ నేపథ్యంగా ‘మాలపిల్ల’ సినిమా నిర్మించారు. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు జ్ఞాపకార్థం ఈ సినిమాను ఆయనకు అంకితమిచ్చారు. తర్వాత రామబ్రహ్మం దర్శకత్వంలోనే వరసగా రైతుబిడ్డ (1939), పత్ని (1942), పంతులమ్మ (1943) చిత్రాలను తీసారు. రామబ్రహ్మమే దర్శకనిర్మాతగా మాయలోకం (1945), యల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలో గృహప్రవేశం (1946), కోవెలమూడి భాస్కరారావు సమర్పణలో అగ్ని పరీక్ష (1951) సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత సారథి పగ్గాలను యల్వీ ప్రసాద్‌ స్నేహితుడు సి.వి.రామకృష్ణప్రసాద్‌ చేపట్టి 1954లో ‘అంతా మనవాళ్ళే’ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను కొండెపూడి లక్ష్మీనారాయణ కథ, సంభాషణలు సమకూర్చగా బియ్యే సుబ్బారావు వద్ద ‘పల్లెటూరి పిల్ల’ సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేసిన తాపీ చాణక్య తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు, ‘వాలి సుగ్రీవ’కు సంగీత దర్శకత్వం నిర్వహించేందుకు మాస్టర్‌ వేణుకు అవకాశమిచ్చారు. దానితో సారథీ సంస్థకు వేణు ఆస్థాన సంగీత దర్శకుడిగా స్థిరపడిపోయారు. ‘అంతా మనవాళ్ళే’ సినిమా విజయవంతమవడంతో మలి ప్రయత్నంగా సి.వి.ఆర్‌ ప్రసాద్‌ ‘రోజులు మారాయి’ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. ఈ సినిమాకు కూడా కొండేపూడి లక్ష్మీనారాయణ కథ, సంభాషణలు సమకూర్చగా, చాణక్య నిర్మాత ప్రసాద్‌లు సినేరియోకు సహకరించారు. మాస్టర్‌ వేణు ఈ సినిమాతో ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్‌ మేనేజరుగా పని చేసిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి, స్టిల్‌ఫోటోగ్రాఫర్‌ పి.గంగాధర్‌రావు ఇద్దరూ తదనంతరంలో నిర్మాతలుగా ఎదిగి మంచి సినిమాలు తీసారు. ‘రోజులు మారాయి’ అవుట్‌ డోర్‌ సన్నివేశాలకు దండుమిట్ట గ్రామంలో నిర్వహించారు.


చిత్రకథ సాగిందింలా...
కోటయ్య (పెరుమాళ్లు) బతికి చెడ్డ రైతు. అతని భార్య వీరమ్మ (హేమలత), కొడుకు వేణు (నాగేశ్వరరావు) కూతురు భారతి (అమ్మాజి) పల్లెటూర్లో వ్యవసాయం చేసుకుంటూ సామాన్య జీవితం గడుపుతుంటారు. ఆ వూరు కామందు సాగరయ్య (సీయస్సార్‌) పొలాన్ని కోటయ్య కౌలుకు తీసుకుని సాగుచేస్తుంటాడు. వేణు సలహాతో అక్కడే వున్న నాలుగుకరాల బంజరు భూమిని బాగుచేసుకుని అందరూ కలిసి సొంతంగా వ్యవసాయం చేస్తుంటారు. కామందు సాగరయ్య తొత్తులైన కరణం సాంబయ్య (రమణారెడ్డి) రౌడీ పోలయ (రేలంగి)లు కలిసి వేణు చేస్తున్న వ్యవసాయ పనులకు ఆటంకం కలిగిస్తారు. అదే వూరిలో వుండే మాజి సిపాయి రత్నం (సీతారాం), రాధ (జానకీ) అనే అమ్మాయిని చేరదీసి పెంచుతుంటాడు. పోలయ్య ఆమెకు మేనమామ. అతనికి రాధను వివాహమాడాలని ఉంటుంది. కానీ రాధ అందుకు ఒప్పుకోదు. కోటయ్యకు కాబోయే వియ్యంకుడు వెంకటాద్రి తన కుమారుడు గోపాలం (వల్లం నరసింహారావు) పెళ్లి కోసం తొందర పెడితే విధిలేక కోటయ్య సాగరయ్యను అప్పు అడుగుతాడు. సాగరయ్య ఇదే అదునుగా ఎంచి ఇంటిని తాకట్టు పెట్టడమే కాక వేణుని తన వద్ద పాలేరుగా ఉంచాలని షరతు విధిస్తాడు. అందుకు నిరాకరించిన వేణు వూర్లోవారందరినీ కూడగట్టి ఒక మహజరు తయారుచేసి అందరి సంతకాలు సేకరించి కలెక్టరుకు ఫిర్యాదు చేస్తాడు. విచారణకు వచ్చిన కలెక్టరకు సాగరయ్య, సాంబయ్యలు చేస్తున్న కుతంత్రాలను వేణు కళ్లకు కట్టినట్టు వివరిస్తాడు. నిజం గ్రహించిన కలెక్టరు బంజరు భూములన వేణుకు అతని సహచరులకు సహకార పద్ధతిలో వ్యవసాయం చేసుకునే ఏర్పాటు చేసి వెళ్తాడు. తన పన్నాగం బెడిసి కొట్టడంతో భారతి పెళ్లిని చెడగొట్టి వేణును దెబ్బతీయాలని సాగరయ్య ప్రయత్నిస్తాడు. రాధగోపాలానికి జరిగిన విషయాలన్నీ చెప్పి భారతితో పెళ్లికి ఒప్పిస్తుంది. కట్నం లేకుండా భారతిని పెళ్లాడేందుకు గోపాలం తండ్రిని ఒప్పించి వేణుకు సహకరిస్తాడు. ఆగ్రహించిన సాగరయ్య, వేణు చేస్తున్న ఉమ్మడి వ్యవసాయ భూమికి గండి కొట్టించి, పొలాన్ని ముంపునకు గురిచేస్తాడు. స్నేహితుల సాయంతో పోలయ్యకు, సాగరయ్య చేసే కుతంత్రాలు తెలిసి కనువిప్పు కలిగి పట్నం వెళ్లి పోలీసులను తీసుకొచ్చి సాగరయ్యను పట్టిస్తాడు. భారతికి, గోపాలానికి పెళ్లవుతుంది. రాధ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. కోటయ్య వేణుని, రాధను దగ్గరకు చేర్చుకుంటాడు. ఇదీ కథ!


సినిమా విశేషాలు
ఇందులో పెరమాళ్లు, నాగేశ్వరరావుల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పల్లె వాతావరణంలో రైతుల వ్యవహార శైలి, వేషబాషలు ఎలా ఉంటాయో అంతే సహజంగా ఇద్దరూ నటించారు. స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన నాగేశ్వరరావు యువరైతు వేణు పాత్రలో ఒదిగిపోయారు. శంకరమంచి జానకి యన్టీఆర్‌ సరసన ‘షావుకారు’ సినిమాతో తెరంగేట్రం చేసి ‘షావుకారు జానకి’గా గుర్తింపు పొంది, ఈ సినిమాలో నాగేశ్వరరావు సరసన తొలిసారి నాయికగా నటించడం, మెప్పించడం ఆమెకు కలిసి వచ్చిన అంశమే! ఈ సినిమా దాదాపు పూర్తి కావస్తున్న దశలో పల్లెటూరి వాతావరణాన్ని, జీవనశైలి చాటిచెప్పే పాటను డ్యాన్సుగా చిత్రీకరిస్తే బావుంటుందని చాణక్యకు అనిపించి, నిర్మాత దృష్టికి తీసుకెళితే, ప్రసాద్‌ వెంటనే స్పందించి కొసరాజు రాఘవయ్యను పిలిపించి పాటను జొప్పించే సన్నివేశాన్ని గురించి ఆలోచించమని కోరారు. జేష్ఠ మాసంలో వచ్చే తొలకరి జల్లుల ఆగమనంతో అన్నదాతలు పౌర్ణమినాడు అరకలతో దుక్కిదున్ని పొలం పనులు మొదలు పెట్టడం మనకు సాంప్రదాయంగా వస్తున్నదే! ఆ సందర్భగా పాట పెడదామని కొసరాజు సూచించడంతో ‘‘ఏరువాక సాగరోరన్నో చిన్నన్న....నీ కష్టమంతా తీరునురోరన్నో చిన్నన్న..’’ పాట పుట్టుకొచ్చింది. ఈ పాట గురించి ఇంకొంచెం లోతులోకి వెళ్తే మరికొన్ని విశేషాలు తెలుస్తాయి. అంతకు ముందు త్రిపురనేని గోపిచంద్‌ దర్శకత్వంలో ‘పాలేరు’ అనే సినిమా తీయాలని ఒంగోలుకు చెందిన రామయ్య అనే కామందు కొసరాజు రాఘవయ్య చేత కొన్ని పాటలు రాయించి వాటిలో ‘‘ఏరువాక సాగరోరన్నో చిన్నన్న’’ అనే పాటను మాస్టర్‌ వేణు చేత రికార్డు చేయించారు. కమలా లక్ష్మణ్‌ చేత ఆ పాటను చిత్రీకరించాలని ఏర్పాట్లు కూడా జరిగాయి. జగ్గయ్య, జానకి, గోవిందరాజులు సుబ్బారావులతో కాంట్రాక్టు కూడా కుదిరింది. కానీ అనివార్య కారణాలవల్ల ఆ సినిమా ఆగిపోయింది. సంగీత దర్శకుడు కూడా మాస్టర్‌వేణు కావడంతో ఈ ‘‘ఏరువాక’’ పాటను ‘‘రోజులు మారాయి’’ కోసం వాడుకున్నారు. ఎవరైనా కొత్త డ్యాన్సరుతో పాటను చిత్రీకరిస్తే బాగుంటుందని అన్వేషణ మొదలైంది. వేదాంతం జగన్నాధశర్మ అప్పుడు వాహినీ స్టూడియోలో పనిచేస్తూ వుండేవాడు. మద్రాసులో మెచ్కీజిజిస్ట్రేటుగా పనిచేసిన రెహమాన్‌, జగన్నాథశర్మకు స్నేహితుడు. అతని కూతుళ్లు, వహిదా- షహీదాలు మంచి డాన్సరులు. రెహమాన్‌కు రాజమండ్రి బదిలీ కావడంతో అక్కడే కాపురం వుండేవారు. వహీదా చేత ‘‘ఏరువాక’’ పాటకు డ్యాన్సు చేయిస్తే బాగుంటుందని శర్మ ఇచ్చిన సూచనతో ఆ అమ్మాయిని మద్రాసుకు పిలిపించి ఇరవై రోజులకు పైగా వెంపటి సత్యం చేత శిక్షణ ఇప్పించి పాటను చిత్రీకరించారు. ఈ పాటలో వాడిన కనక తప్పెటలను వాయించే వాద్యగాళ్లను గుంటూరు జిల్లా కొలకలూరు నుంచి పిలిపించి మాస్టర్‌ వేణు వారికి శిక్షణ ఇచ్చి పాటను మరలా రికార్డు చేసి చిత్రీకరణ జరిపించారు. పాట ఎంత పాపులర్‌ అయిందంటే, ప్రేక్షకులు ఈ పాట కోసమే సినిమా హాళ్లకు వెళ్లేవారు. తెరమీద ఈ పాట వచ్చినప్పుడు చిల్లర డబ్బులు కూడా విసిరేవారు. ప్రఖ్యాత హిందీ, సంగీత దర్శకుడు సచ్‌దేవ్‌ బర్మన్‌ ‘బొంబాయ్‌ కా బాబు’ సినిమాలో ఈ పాట ట్యూనునే అనుకరిస్తూ ‘‘దేఖ్‌నే మే భోలా హై దిల్‌ కా సలోనా... బొంబై సే ఆయా హై బాబూ చిన్నన్నా’’ పాటను ఆశ భోంస్లే చేత పాడించారు. ఈ ట్యూనును తమిళ సంగీత దర్శకుడు రామనాథన్‌ కూడా ‘మదురై వీరన్‌’లో వాడుకోవడం ఆ పాట గొప్పదనానికి నిదర్శనం. ‘రోజులు మారాయి’ సినిమాను సివిఆర్‌ ప్రసాద్‌ తమిళంలో ‘కాలం మారిపోవచ్చు’ పేరుతో 1956లో పునర్మించారు. అక్కినేని పాత్రను జెమినిగణేష్‌న్‌, జానకి పాత్రను అంజలీదేవి, సీయస్సార్‌ పాత్రను టియ్యస్‌ బాలయ్య, రేలంగి పాత్రను తంగవేలు పోషించగా ‘‘కల్లం కబడం తెరియాదవని...వులగం పోవదు పురియాదవని’’ (ఏరువాక సాగారో) పాటకు వహీదా రెహామానే నృత్యం చేసింది. తమిళంలో కూడా మాస్టర్‌ వేణు సంగీతం సమకూర్చగా, చాణక్య దర్శకత్వం నిర్వహించారు. ఆ రోజుల్లో ‘‘బెజవాడ కనక దుర్గమ్మ ‘రోజులు మారాయి’ సినిమా చూసి రిక్షాలో వెళ్లిందని, రిక్షావాడు తుండు విదిలిస్తే కాసులు రాలాయని’’ పెద్ద వదంతి బయలుదేరింది. చిత్ర విజయం గురించి చెప్పుకోవాలంటే ‘‘రోజులు మారాయి’’ సినిమా ఆంధ్ర, నైజాంలలోని 17 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని ఒక కొత్త రికార్డును సృష్టించింది. ఈ శతదినోత్సవ సంబరాలను 22-07-55 నుండి 09-08-55 తేదీల మధ్య వరుసగా భీమవరం, బందరు గుడివాడ, తెనాలి, గుంటూరు, వరంగల్లు, సికింద్రాబాద్‌, కర్నూలు, కడప, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, చ్కీచీజిరాల, నెల్లూరు పట్టణాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా మద్రాసు శ్రీకృష్ణలో, బెంగుళూరులో కూడా వందరోజులు ఆడడం విశేషం! తమిళ వర్షను ‘కాలం మారిపోచ్చు’ కూడా తమిళనాడు, కేరళ రాష్ట్రల్లో శతదినోత్సవం జరుపుకుంది. హైదరాబాద్‌ రిడ్జి హోటల్లో ఈ సినిమా రజతోత్సవ వేడుక జరిగినప్పుడు బాలీవుడ్‌ నటుడు, నిర్మాత గురుదత్‌ అదిథిగా రావడం, వహీదా రెహమాన్‌ చూసి ‘సిఐడి’ (1956) సినిమాలో వ్యాంప్‌ పాత్రను ధరింపజేయడంతో, వహీదా అక్కడే స్థిరపడి నాయికగా గొప్ప పేరు తెచ్చుకుంది.


పల్లె పాటలు పరవళ్లు
‘రోజులు మారాయి’ సినిమాకు కొసరాజు రాఘవయ్య, తాపీ ధర్మారావు పాటలు రాశారు. అన్ని పాటలు పల్లె పదాలతో కూడుకున్నవే కావడం విశేషం! తొలిపాట ‘‘ఒలియో ఒలీ పొలియో పొలీ - రావేలు గల వాడా రారా పొలీ - వేయిపడగలవాడా పొలీ’’ ఘంటసాల బృందగానంతో మొదలవుతుంది. పొలాలలో పాడే ఈ పాట వింటుంటే 1954లో వచ్చిన వాహినీ వారి ‘పెద్ద మనుషులు’ సినిమాలో ఓగిరాల రామచంద్రరావు సంగీతం సమకూర్చగా ఘంటసాల ఆలపించిన ‘‘నందామయ గురుడ నందామయా’’ పాటతో బాటు, వాద్య వరసలు కూడా గుర్తురాకమానవు. ‘‘ఇదియే హాయి, కలుపుము చేయీ, వేయి మాటలేల నింక’’ అనే సహజమైన పాటను అక్కినేని, జానకిల యుగళగీతంగా మధ్యమావతి రాగంలో ఘంటసాల, జిక్కిపాడారు. ‘‘రండయ్య పోదాము మనము ఇకను కొండలన్నీ పిండికొట్టి పారేద్దాము’’ అక్కినేని బృదం పాడే పాట. అన్యస్వరాల మేళవింపుతో బిళహరి రాగంలో కూర్చిన ఈ పాటలో వచ్చే ‘‘భూదేవి కరుణించి పులకాకురం బెత్తి రత్నాల మత్యాల రాశి గురిపిస్తుంది’’ వంటి వరసలు అసలు సిసలైన పల్లెపదాలను గుర్తు తెస్తాయి. ‘‘చిరునవ్వులు వీచే - అదిగో నా ఆశలు ఫలియంచే’’ పాటను ఘంటసాల, జిక్కితో పాటు బందరుకు చెందిన కృష్ణకుమారి చేత దేశీసారంగ్‌ రాగంలో పాడించారు మాస్టర్‌ వేణు. వల్లం నరసింహారావు మీద చిత్రీకరించిన ‘‘ఎల్లిపోతుం దెల్లీపోతుంది జోడెడ్ల బండి, పెళ్ళోరి బండి’’ పాటను మాధవపెద్ది పాడారు. ‘‘మారాజ వినవయ్య మాగాణి నాటేటి మానవులకుండేటి చింత’’ పాటను జిక్కి బృందం; ‘‘ఇంతేనా ప్రేమలు కోరిన ప్రతిఫలమంతా చింతేనా’’ పాటను జిక్కి; ‘‘ఏరువాక’’ పాటను మధ్యమావతి, శంకరాభారణ రాగాల్లో జిక్కి ఆలపించారు. హైదరాబాదులో శ్రీ సారథి స్టూడియో నిర్మాణానికి పునాది వేసిన చిత్రం ‘‘రోజులు మారాయి’’.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.