బొమ్మర్షి తెరబొమ్మ ‘సాక్షి’
అందంగా బొమ్మలు చిత్రించే బాపు, అత్యద్భుతంగా కథ, సంభాషణలు సమకూర్చే ముళ్లపూడి వెంకట రమణలకు బెంగాలీ బాబు సత్యజిత్‌రాయ్‌ పంథాలో తక్కువ బడ్జెట్‌తో ఒక మంచి ప్రయోగాత్మక సినిమా నిర్మించాలనే ఆలోచన వచ్చింది. మిత్రులు సురేష్‌ కుమార్, శేషగిరిరావులతో కలిసి వెంటనే ‘నందనా ఫిలిమ్స్‌’ సంస్థను నెలకొల్పి కొత్త సినిమా నిర్మాణానికి ఉపక్రమించారు. సమాజంలో వేళ్లూనిన అరాచకాలను, అన్యాయాలను అణచివేసే నేపథ్యంలో గ్రామీణ వాతావరణంలో సినిమా నిర్మాణం చేపట్టాలని ‘సాక్షి’ సినిమా కోసం ప్రణాళికా రచన చేసి పాతిక రోజుల్లో తొలి కాపి తీసుకొచ్చి తమ సత్తాను చాటారు. సాక్షి సినిమా జూలై, 1, 1967న విడుదలై సినీ పండితుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా విడుదలై యాభైరెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ ప్రాణ స్నేహితులకు నివాళిగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేస్తున్నాం...


* ‘సాక్షి’ నామ సంవత్సరానికి శ్రీకారం
బాపు రమణలు స్నేహానికి ప్రతీకలు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 1956 ప్రాంతంలో రమణ ఆంధ్రపత్రిక వీక్లీలో సినిమా సెక్షన్లో పనిచేస్తుంటే, బాపు పుస్తకాలకు, కథలకు అందమైన బొమ్మలు వేస్తుండేవారు. 1962లో రమణకు మొదట ‘రక్తసంబంధం’, ఆ తరువాత ‘మూగమనసులు’ వంటి సినిమాలకు మాటలు రాసే అవకాశం రావడంతో ఆంధ్రపత్రిక నుంచి బయటకు వచ్చి సినిమాల్లో బిజీ అయిపోయారు. తరువాత విజయవాడలో అక్కినేని వెలిగించిన ‘జ్యోతి’ ప్రతికకు బాపు, రమణలు అహర్నిశలూ కష్టపడ్డారు. ఆ పత్రిక ఒక వెలుగు వెలిగింది. కానీ, ప్రధాన భాగస్వామి, వి.వి.రాఘవయ్య వ్యాపార పోకడ నచ్చక బయటకు వచ్చేశారు. ఒకవైపు ఇద్దరూ సినిమాలకు పనిచేస్తూనే, సొంతంగా సినిమా తీయాలనే నిర్ణయానికొచ్చారు. 1952లో ‘హై నూన్‌’ అనే ఇంగ్లీష్‌ సినిమా వచ్చింది. గ్యారీ కూపర్, థామస్‌ మిచెల్‌ నటించిన ఆ చిత్రానికి నాలుగు ఆస్కార్‌ బహుమతులు, నాలుగు గోల్డన్‌ గ్లోబ్‌ బహుమతులు లభించాయి. ఆ సినిమా ప్రభావంతో రమణ 1959 ప్రాంతంలో ఆంధ్రపత్రికలో ‘సాక్షి’ అనే కథను రాశారు. ‘హై నూన్‌’ సినిమాలో కౌబాయ్‌ పాత్రను బల్లకట్టు కిష్టప్పగా మార్చి ఆ కథనే మరికొన్ని మార్పులతో సినిమాగా తీస్తే బాగుంటుందని ప్రయత్నాలు మొదలెట్టారు. అంతకుముందే నవయుగ ఫిలిం డిస్టిబ్య్రూషన్‌ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావుతో రమణకు పరిచయం ఉండడంతో అతన్ని కలిసి ఆర్ధిక సహకారం అందించాలని కోరారు. కృష్ణ, విజయనిర్మల, జగ్గారావు విజయలలిత, రాజబాబు, రామన్న పంతులు ప్రధాన తారాగణమని, మహదేవన్‌ సంగీత దర్శకుడని, బాపు దర్శకత్వం వహిస్తారని రెండులక్షలు పెట్టుబడి పెడితే యాభైవేలు తమ వంతుగా వేసుకొని సినిమా తీస్తామని శ్రీనివాసరావుకు చెప్పారు. నవయుగ సంస్థకు అక్కినేని, దగ్గుపాటి బాగా సన్నిహితులు. రమణకు అక్కినేని ప్రియమిత్రులు. అయినా వారి సిఫారుసుతో రాకుండా, కథ మీద నమ్మకంతో రావడం శ్రీనివాసరావుకు నచ్చి పెట్టుబడి పెట్టేందుకు ఒప్పుకున్నారు. కొంచెం పారితోషికం ఎక్కువైనా, శ్రీనివాసరావు సలహా మీద సెల్వరాజ్‌ను ఛాయాగ్రాహకునిగా తీసుకునేందుకు అంగీకారం కుదిరింది.

* పులిదిండి గ్రామమే హీరో
సురేష్‌ కుమార్, శేషగిరిరావులను భాగస్వాములుగా చేర్చుకుని వారి పేర్లను నిర్మాతలుగా వేసి సినిమా నిర్మాణం ప్రారంభించారు. మూడు రోజుల్లో ఆరుద్ర చేత నాలుగు పాటల్ని, దాశరథి చేత ఒక పాటని సన్నివేశానికి అనుగుణంగా రాయించి, మహదేవన్‌ చేత బాణీలు కట్టించారు. విజయా గార్డెన్స్‌లో రికార్డింగ్‌ పనులు నాలుగు రోజుల్లో పూర్తైపోయాయి. వెంçనే సినిమా యూనిట్‌ మొత్తం తూర్పు వెళ్లే రైలెక్కేసింది. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురానికి దగ్గరలో ఉండే పులిదిండి గ్రామంలో షూటింగు మొదలైంది. బాపు రమణల సన్నిహిత మిత్రుడు భావరాజు సీతారాముడు అప్పుడు ధవళేశ్వరంలో ఇంజనీరుగా పనిచేస్తుండేవారు. గోదావరి పడవల మీద ఉద్యోగం కాబట్టి అక్కడి పరిస్థితులన్నీ సీతారాముడికి కొట్టిన పిండే. ఇక సీతారాముడి స్నేహితుడు కనుమూరి వెంకట్రామరాజు ఇంట్లో మకాం పెట్టారు. సెల్వరాజ్‌తో బాటు రెండు జనరేటర్లు, పెద్ద పవర్‌ గల ఆర్క్‌ బ్రూట్‌ లైట్లు వచ్చాయి. వంటవాళ్లు ముందే వచ్చి గాడిపొయ్యలు తవ్వించి వంటలకు సిద్ధం చేశారు. సీతారాముడు తడికలతో యూనిట్‌ సభ్యుల కోసం ఇద్దరు, నలుగురు ఉండేలా డార్మెటరీలు, ఆరు బాత్‌రూములు, టాయిలెట్లు, కట్టించారు. పెద్దపెద్ద తారు డ్రమ్ములతో వేడినీళ్లు కాచి అందించడానికి, ఎప్పటికప్పుడు క్లోరిన్‌ చల్లుతూ మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచడానికి మనుషుల్ని నియమించారు. సెల్వరాజ్‌ కోసం కాలువ మీద తేలే హౌస్‌ బోట్‌ తెప్పించారు. ఎక్కడ చూసినా అంతా పండగ వాతావరణమే. సాక్షి యూనిట్‌తోబాటు గ్రామస్తులంతా ముందే లేచి కల్లాపి చల్లి, ముగ్గులు వేసి ఆ ఊరిని నందనవనంగా ముస్తాబు చేశారు. సాధారణ మెనూతోబాటు పూతరేకులు, పచ్చళ్లు, పొడులతో షడ్రసోపేతమైన భోజనాలు అందరికీ సహపంక్తినే వడ్డించేవారు.


* బాపు చేతికి మెగాఫోన్‌
తొలి షూటింగు జరగడానికి ముందు ఆదుర్తి సుబ్బారావు అసిస్టెంట్‌ కబీరుదాసు బాపుని ఆ గ్రామంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లి క్లోజప్‌ షాట్లు, సజెషన్‌ షాట్లు ఎలా తీయాలో చెప్పారు. ఆ తరువాతే బాపు తొలిసారి మెగాఫోన్‌ పట్టి చిత్రీకరించిన తొలిసన్నివేశం ఒక పాటతో మొదలైంది. స్థానికంగా వున్న ఒక గుడి (మీసాల కృష్ణుడు)లో మధ్యాహ్నం రెండు గంటలకు తొలి షూటింగు మొదలైంది. చావు భయంతో గజగజలాడుతున్న బల్లకట్టు కిష్టప్పకు ధైర్యాన్ని నూరిపోస్తూ చుక్క పాడే పాట ‘అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా’ను కృష్ణ, విజయనిర్మల పెళ్లి పాటగా కేవలం మూడు గంటల్లోనే బాపు చిత్రీకరించి సాయంత్రం ఐదు గంటలకల్లా ప్యాకప్‌ చెప్పేశారు. సీతారాముడు ఆ వూర్లో ఒక గుడిసె సెట్‌ వేశారు. ఆర్క్‌ లైట్లు మోసే లారీ వచ్చేందుకు మట్టిరోడ్డు పట్టకపోతే ఈ సీతారాముడు కొత్తగా దారి వేయించి తన పనితనాన్ని చాటారు. ఇందులో నటించిన నటీనటులెవ్వరికీ విగ్గులు లేవు, మేకప్‌ కూడా పైపైనే. విజయనిర్మల ముఖానికి పసుపు మాత్రమే రాయించి, కాటుక పెట్టించి చిత్రీకరణ జరిపారు. విజయనిర్మలకు ‘సాక్షి’ కేవలం మూడో సినిమా అయితే కృష్ణకు ఐదవది. సన్నివేశాలను విభజిస్తూ స్టోరీ బోర్డు తయారు చేసుకుని, బొమ్మలతో వాటికి రూపునిచ్చి, షూటింగు చేయడం బాపు పద్ధతి. షూటింగు అవుతుండగా మూడు రోజులకొకసారి షూట్‌ చేసిన ఫిలింను మద్రాసు పంపి కడిగించేవారు. తీసిన షాట్లను ఎడిటర్‌ సత్యం క్రమపద్ధతిలో పెట్టి ప్రింటు చేసిన కాపీని పులిదిండికి పంపేవారు. ఆ ప్రింటును పులిదిండికి దగ్గరలో వున్న టూరింగు టాకీసులో వేసి బాపు రమణలు రష్‌ చూసేవారు. అలా పులిదిండిలో పందొమ్మిది రోజులపాటు ఏకబిగిన షూటింగు జరిపి ఇరవై ఐదు రోజల్లో తొలి ప్రింటు తీసుకురాగలిగారు. పూర్తి అవుట్‌డోర్‌లో రూపొందిన ‘సాక్షి’ సినిమా అలా బయటకు వచ్చింది.


* బల్లకట్టు కిష్టప్ప ‘సాక్షి’ కథ
దాచంపాడు గోదావరి లంకలో ఒక గ్రామం. అక్కడ పండే కొబ్బరి పంట రవాణా కోసం ఆ వూరి మునసబు (రామన్న పంతులు) ఒక పాత లారీ కొన్నాడు. ఆ వూరిలో పకీరు (జగ్గారావు)అనే రౌడీ దౌర్జన్యాలు చూస్తూ, చేసిన నేరాలకు అప్పుడప్పుడూ జైలుకు వెళ్లి వస్తూ ఉంటాడు. వాడిమీద ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి ఆస్తిపాస్తులు నాశనం చేస్తుండడంతో, భయపడి ఎవరిమటుకు వారు సర్దుకుపోతుంటారు. ఆ పకీరుకు ఒక చెల్లెలు. పేరు చుక్క (విజయ నిర్మల). పకీరు తన చెప్పుచేతల్లో ఉంటాడని మునసబు వాణ్ని తన లారీకి డ్రైవరుగా చేసుకున్నాడు. అయితే లారీ కిరాయితోబాటు, లారీలోని సరుకు కూడా తెగనమ్మి పకీరు తిని, తాగి, జూదాలకు ఖర్చుపెట్టేసేవాడు. మునసబు వాడి రౌడియిజానికి భయపడి కిక్కురుమనలేదు. ఒకరాత్రి పకీరు సరుకు దొంగిలిస్తుండగా చూసిన తోట కాపలా వాళ్లనీద్దరినీ చంపేశాడు. దానితో గ్రామస్తులంతా ఏకమై ఆ హత్యలు చూసిన బల్లకట్టు కిష్టప్ప (కృష్ణ)ని కోర్టులో సాక్ష్యం చెప్పమని బతిమాలారు. కానీ కోర్టులో కథ అడ్డం తిరిగి, ఆత్మరక్షణ కోసం పకీరు ఆ హత్యలు చేశాడని నిర్థారించి, ఉరిశిక్షకు బదులు కోర్టు వాడికి ఏడేళ్లు జైలు ఖైదు విధించింది. పదిరోజుల్లో వచ్చి సాక్ష్యం చెప్పిన బల్లకట్టు కిష్టప్పను చంపుతానని హెచ్చరించి పకీరు జైలుకు వెళ్లాడు. దానితో గ్రామస్తులెవరూ కిష్టప్పకు ఆశ్రయం ఇవ్వలేదు. అన్నట్లే పకీరు జైలు నుంచి తప్పించుకుని వచ్చాడు. పకీరు వచ్చాడనగానే కిష్టప్పను ఒంటరివాణ్ణి చేసి గ్రామస్తులంతా ఇళ్లలోకి దూరి తలుపులు వేసుకున్నారు. పాపం కిష్టప్పను కాపాడేందుకు పకీరు చెల్లెలు చుక్క అతడి చేత తాళి కట్టించుకుంది. అతడు ఆమె పెనిమిటి అయితే పకీరు కిష్టప్పను ఏమీ చెయ్యడని చుక్క విశ్వాసం. పసుపు పారాణి కూడా ఆరని ఆ కొత్తదంపతులు తమని కాపాడమని గ్రామస్తులను బ్రతిమాలారు. ఊరువూరంతా కళ్లు, చెవులు మూసుకుంది. పాపం అమాయకుడైన కిష్టప్ప భయంతో క్షణాల్ని యుగాలుగా గడిపాడు. గదిలో బంధిస్తే పిల్లి కూడా ఆత్మరక్షణ కోసం పులి అవుతుందనే సామెతను నిజం చూస్తూ కిష్టప్ప పకీరును ఢీకొన్నాడు. అదనుచూసి నరకాసుర వధ కావించాడు. అప్పుడు బైటకు వచ్చారు గ్రామ ప్రజలు. కిష్టప్ప ‘‘మీరెవరూ సాక్ష్యం చెప్పాల్సిన పనిలేదు. నేనే పోలీసులకు లొంగిపోతాను’’ అంటూ పోలీసు ఠాణా వైపు నడిచాడు. టూకీగా ఇదీ ‘సాక్షి’ కథ.

* మామ సందర్భోచిత సంగీతం
‘సాక్షి’ సినిమా కోసం బాపు రమణలు ఎంచుకున్న తొలి వ్యక్తి మహదేవన్‌. తరువాత నవయుగ శ్రీనివాసరావు సూచించిన ఛాయాగ్రాహకుడు సెల్వరాజ్‌. సినిమా మొత్తం మీద అత్యధిక పారితోషకం (16 వేలు) సెల్వరాజ్‌ది కాగా, తరువాతి స్థానం మహదేవన్‌ది (10 వేలు). మిగతావన్నీ పదివేలకు లోపే. ఆరుద్ర ఇందులో నాలుగు పాటలు రాశారు, మరొకపాట దాశరథి రాసింది. విజయనిర్మల కోసం సుశీల పాడిన ‘అటు ఎన్నెల ఇటు ఎన్నెల ఎటు చూస్తే అటు ఎన్నెల ఓరందగాడ బంగారు సామీ’ ఆరుద్ర ఒరవడికి భిన్నమైన పాట. సుశీల ఆలపించిన ‘అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా..బతకరా పచ్చగా... నీకు నేనుంటా వెయ్యేళ్లు తోడుగా నీడగా’ పాటను ఈ సినిమాలోకెల్లా అద్భుతమైన పాటగా చెప్పుకోవచ్చు. గుడిలో వినవచ్చే ఈ పాట కోసం ఆరుద్ర అద్భుత ప్రయోగాలు చేశారు. ‘నా మెడలో తాళిబొట్టు కట్టరా, నా నుదుట నిలువు బొట్టు పెట్టురా... చల్లని అయిరేణికి మొక్కరా, సన్నికల్లు మీద కాలు తొక్కరా... ఏడడుగులు నాతో నడవరా... ఆ యుముడైనా మన మద్దికి రాడురా’ వంటి మాటలు చాలా బాగా అమరాయి. తరువాత కొత్త గాయకుడు కె.బి.కె.మోహనరాజు ఆలపించిన ‘ఎవరికివారే ఈ లోకం రారు ఎవ్వరూ నీకోసం’ అనే నేపథ్య గీతం కూడా గొప్పది. ‘చందమామా నిజం చూడకు, చూసినా సాక్ష్యం చెప్పకు... పరిగెత్తి వస్తోంది రాహువు అయ్యో కరిగిపోతున్నాది ఆయువు’ అంటూ సాగుతుందీ పాట. విజయనిర్మల, కృష్ణ పాడుకునే దాశరథి పాట ‘సిలిపోడా సిన్నోడా సీరదోసుకున్నోడా’లో కృష్ణుడుగా కృష్ణకు కిరీటం, పిల్లనగ్రోవి పెట్టి చిత్రీకరించారు. పి.బి.శ్రీనివాస్, సుశీల బృందం పాడిన రాధాకృష్ణుల రంగస్థల నాటకంలో పాట ‘దయలేదా నీకు దయలేదా’లో ఆరుద్ర అంత్యప్రాసలు వలపు తలపు; తిట్టు బెట్టు; అత్తా కొత్త; నమ్మం గుమ్మం అంటూ చకచకా సాగిపోతాయి. ఈ సినిమా మ్యూజికల్‌ హిట్‌గా పేరు తెచ్చుకుంది.

* మరిన్ని విశేషాలు
* ‘సాక్షి’ సినిమా తొలి సన్నివేశ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు రాజబాబు కల్పించుకొని విజయనిర్మలతో ‘‘ఇది మీసాల కృష్ణుడి గుడి. చాలా శక్తివంతమైనది. ఈ గుడిలో మీకు, కృష్ణకు జరిగే పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. నిజ జీవితంలో కూడా మీరిద్దరూ తప్పక భార్యాభర్తలు అవుతారు’’ అన్నారు. అదే జరగడం విశేషం.
* బాపు స్వయంగా పబ్లిసిటీ డిజైనర్‌ అయివుండి కూడా భూషణ్‌ ప్రమేయంతో ఈశ్వర్‌కు ‘సాక్షి’ సినిమా పబ్లిసిటీ పనులు అప్పగించారు. పబ్లిసిటీ డిజైనర్‌గా అతడిని తొలి పరిచయం చేసిన చిత్రం కూడా ఇదే. ‘సాక్షి’ సినిమాకు వేసిన వాల్‌పోస్టర్లు చూసి విజయా సంస్థ వారు హిందీలో అప్పుడే నిర్మిస్తున్న ‘రామ్‌ అవుర్‌ శ్యామ్‌’ సినిమా పబ్లిసిటీ పనులు ఈశ్వర్‌కు అప్పజెప్పారు. దాంతో ఈశ్వర్‌ పబ్లిసిటీ ఆర్టిస్టుగా చాలా ఎత్తుకెదిగారు.
* నూతన గాయకుడు కె.బి.కె.మోహనరాజును ‘సాక్షి’ సినిమా ద్వారా బాపు రమణలు పరిచయం చేశారు. ఆర్‌.రంగారావు అనే రంగస్థల నటుడు ఈ చిత్రంలో కరణం పాత్రలో రాణించి తదనంతరకాలంలో ‘సాక్షి’ రంగారావుగా చిత్రసీమలో స్థిరపడ్డారు.
* ఎవరి సిఫారసు లేకుండానే ‘సాక్షి’ సినిమా తాష్కెంట్‌ (రష్యా) ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. సబ్‌-టైటిల్స్‌తో అక్కడ ప్రదర్శనకు నోచుకుంది. తరువాత చైనా, మంగోలియా దేశాల్లో కూడా ఏడాదిన్నరపాటు ఈ చిత్రాన్ని వివిధ పట్టణాలలో ప్రదర్శించారు.
* ముళ్ళపూడి రమణ ఈ సినిమా చక్కని ప్రణాళికతో పూర్తిచేశారు. రెండున్నర లక్షల బడ్జెట్‌తో సెట్స్‌కు వెళ్లిన ఈ చిత్ర నిర్మాణం రెండు లక్షల ఇరవై వేలలోపే పూర్తయింది. పెట్టుబడి మొత్తం నాలుగు వారాలలోనే వచ్చేయగా, నవయుగ సంస్థ పెట్టుబడి మొత్తాన్ని వెంటనే చెల్లించి మంచి పేరు సంపాదించారు.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.