‘సీతారామరాజు’కి 21 ఏళ్లు
తమ్ముడూ నమస్కారం భగవంతుడికి చేయాలి. నాకు దండం పెట్టి నన్ను దేవుణ్ని చేయొద్దు.

అన్నయ్య నాకు కనిపించని ఆ దేవుణ్ని నేను నమ్మను. నాకు కనిపించే దేవుడు నువ్వే.

-అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ మధ్య అనుబంధం ఇది.


నాగార్జున- హరికృష్ణ: ఈ రెండు పేర్లు జంటగా వినపడగానే మదిలో మెదిలే చిత్రం ‘సీతారామరాజు’. తెరపై ఒక్కొక్కరని విడిగా చూస్తేనే ప్రేక్షకులు పండగ. అలాంటిది ఈ ఇద్దరి ఒకే ఫ్రేమ్‌లో అన్నదమ్ములుగా చూపించే సాహసం చేసి విజయం అందుకున్నారు దర్శకుడు వై.వి.యస్‌.చౌదరి. సోదరుల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్ని కథలొచ్చినా సీతయ్య(హరికృష్ణ)- రామరాజు(నాగ్‌) కథ ప్రత్యేకంగా నిలుస్తుంది. నాగ్‌ లాంటి తమ్ముడు ఉండాలని ప్రతి అన్నయ్య, హరికృష్ణ లాంటి అన్నయ్య ఉంటే బావుంటుందని ప్రతి తమ్ముడు అనుకున్నారంటే అతిశయోక్తి కాదేమో! అంతలా అన్నదమ్ముల మధ్య బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చేశారు. ఇదంతా జరిగి 21 వసంతాలైనా ఇప్పటికీ అదే అనాలనిపిస్తుంది ఎవరికైనా. ‘సీతారామరాజు’ 1999 ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా..


-ఈ ఇద్దరి సోదరులకు ఓ చెల్లి. ఆమె కోసం ఎంతో అన్యోన్యంగా ఉండే సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఇదే ఈ చిత్రానికి కీలక మలుపుగా నిలుస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో సంగీతం కళ్లను తడిపేస్తుంది. చివరిలో హరికృష్ణ చనిపోవడం రాయిని సైతం కరిగిస్తుంది. కథ,కథనం ఒక ఎత్తైతే.. కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం మరో ఎత్తు. ప్రతి సన్నివేశంలోనూ తన స్వరాలతో మదిని మీటారాయన. ఒక్కో పాట ఒక్కో జోనర్‌లో అందించారు. ముఖ్యంగా ‘చాంగురే చాంగురే’, ‘ఏవండోయ్‌ శ్రీవారు’ పాటలు ప్రతి ఒక్కరితోనూ పాడించాయి. ఇన్నేళ్లవుతున్నా ఏదో ఓ చోట మారుమోగుతూనే ఉంటాయి. సంఘవి, సాక్షి శివానంద్‌ అందం, అభినయం అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాయి. పోసాని కృష్ణ మురళి రాసిన మాటలు ఆణిముత్యాల్లా నిలిచాయి. ఇలాంటి అద్భుత దృశ్యం ఎన్నేü˜్లౖనా చెక్కుచెదరదు.


సాంకేతిక వర్గం:

మాటలు: పోసాని కృష్ణమురళి

పాటలు: సీతారామశాస్త్రి

నృత్యాలు: బృందా, శంకర్‌

పోరాటాలు: రాజు

ఎడిటింగ్‌: శంకర్‌

డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ: కె.రాజేంద్రప్రసాద్‌

సంగీతం: కీరవాణి

నిర్మాతలు: నాగార్జున అక్కినేని, డి. శివప్రసాద రెడ్డి

కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: వై.వి.యస్‌.చౌదరి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.