భయపెట్టించిన శివప్రసాద్‌ ప్రేమకథ
అప్పట్లో తమ ప్రేమ అందరిలోనూ భయం పుట్టించిందని సీనియర్‌ నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివ ప్రసాద్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో స్నేహం ఎలా ఏర్పడిందో తెలిపారు. తన భార్య విజయలక్ష్మితో ప్రేమ, పెళ్లి గురించి ప్రస్తావించారు.


''నారావారిపల్లెకు మూడు కిలోమీటర్ల దూరంలో మా ఊరు. మా నాన్న నాగయ్య రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌. అమ్మ చెంగమ్మ గృహిణి. నేను మా అమ్మలా ఉంటానని అంటుంటారు. 1930 ప్రాంతంలోనే మా నాన్న చదువుకున్నారు. అప్పట్లో మా వర్గంలో చదువుకున్న ఒకే ఒక్క వ్యక్తి మా నాన్న. ఎస్‌ఎల్‌సీ పాస్‌ అయ్యారు. మేం ఏడుగురు సంతానం. నేను మూడోవాడిని. నా కోసం మా అమ్మ ఎన్నో పూజలు చేసింది. అబ్బాయి పుట్టాలని తలకోన గుడి చుట్టూ 40 రోజులపాటు ప్రదక్షిణలు చేశారట. ఆ తర్వాత నేను పుట్టానట. మాది చాలా పెద్ద కుటుంబం. మా ఆవిడ విజయలక్ష్మి డాక్టర్‌. నా ఇద్దరు కుమార్తెలను కూడా డాక్టర్లను చేశాను. నా భార్య వైద్యురాలిగా ఎంతో పేరు తెచ్చుకుంది. మాది ప్రేమ వివాహం. 1972లో మేం కులాంతర వివాహం చేసుకున్నాం. అప్పట్లో మా ఇద్దరి ప్రేమ అందరిలో భయం పుట్టించింది''.


''తిరుపతి సమీపంలోని ఐతేపల్లిలో ఐదో తరగతి వరకు చదువుకున్నా. చంద్రగిరిలో 12వ తరగతి వరకూ చదివా. ఆరో తరగతిలో చంద్రబాబు నా క్లాస్‌మేట్‌. మేమిద్దరం అభిమానంగా ఉండేవాళ్లం, మంచి స్నేహితులం. మా బంధాన్ని మాటల్లో చెప్పలేను. డ్రామాల సమయంలో మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఇంకా పెరిగింది. ఆపై ఆయన ఆర్ట్స్‌లో చేరారు, నేను మెడిసిన్‌ వైపు వెళ్లిపోయా. అప్పుడు నా జీవితంలో మార్పులు జరిగాయి. మొదటి ఏడాది పూర్తయిన తర్వాత ప్రేమ పుట్టింది. నా క్లాస్‌మేట్‌ విజయలక్ష్మిని ఇష్టపడ్డా. మూడో ఏడాది సాహసం చేశాం, పెళ్లి చేసుకున్నాం. జాగ్రత్తగా జీవించడం మొదలుపెట్టాం. డిగ్రీ చేతిలోకి వచ్చే సరికీ భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నా. నా భార్య చాలా తెలివైంది. అప్పట్లో ప్రేమకు నిర్వచనం మేము. మాది నిజమైన ప్రేమ. విద్యార్థిగా ఉన్నప్పుడు నేను చాలా సరదాగా ఉండేవాడిని. అది నా భార్యకు నచ్చింది. అందుకే నేనే ముందు ప్రపోజ్‌ చేశా. ఇప్పటికీ మా మధ్య ప్రేమ అలానే ఉంది. ఫిజిక్‌, డబ్బులు చూసి పుట్టిన ప్రేమ కాదు మాది''

''విజయలక్ష్మి డీఎస్పీ కుమార్తె. ప్రేమిస్తున్న రోజుల్లో వాళ్ల నాన్న ఏం చేస్తాడోనన్న భయంతో గుడికి వెళ్లి ప్రార్థించేవాడిని (నవ్వుతూ). మాది తక్కువ వర్గం కావడంతో 'ఆ అమ్మాయిని మరిచిపో' అని మా వాళ్లు గట్టిగా చెప్పారు. మా నాన్న ఇంటిలో మూడు గంటలపాటు నన్ను కూర్చోబెట్టి మంచి-చెడు చెప్పినా.. చివరికి 'మీరు ఎన్నైనా చెప్పండి.. ఆ అమ్మాయిని వదులుకోలేన'ని చెప్పి వెళ్లిపోయా. ఓ రోజు ఉదయం ఆ అమ్మాయితో కలిసి మా నాన్న దగ్గరికి వెళ్లా. ఆయన భయపడిపోయారు, ఇలాంటి పరిస్థితి తెచ్చావేంటిరా? అన్నాడు. ఆపై రహస్యంగా పెళ్లి చేశారు. ఎనిమిది నెలల తర్వాత మా కుటుంబ సభ్యుల సమక్షంలో మళ్లీ పెళ్లి జరిగింది. కులాంతర వివాహం కావడంతో ఇది జరుగుతుందా? లేదా? అని చూడటానికి వేల మంది వచ్చారు. మనసులు కలిస్తే కారణాలు, అడ్డంకులు కనపడవు. నా భార్య కూడా నన్ను చాలా ఇష్టపడింది. మాది ఆదర్శ వివాహం. మాకు పెళ్లి జరిగి ఇన్నేళ్లు అవుతున్నా చిన్న గొడవ కూడా పడలేదు'' అంటూ చెప్పుకొచ్చారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.