శోభన్‌బాబు ఉచితంగా సినిమా చేస్తానన్నారు!

ఎంత దూరం వెళ్లినా సరే.... ఆ ప్రయాణం తొలి అడుగు నుంచే మొదలవుతుంది. ప్రతి ప్రయాణంలోనూ తొలి అడుగు మాత్రం తప్పనిసరిగా గుర్తుండిపోతుంది. రచయితలుగా లబ్ద ప్రతిష్టులైన పరుచూరి బ్రదర్స్‌ కూడా సినిమా రంగంలో వేసిన తమ తొలి అడుగు గురించి పదే పదే గుర్తు చేసుకొంటుంటారు. పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణలుగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆ ఇద్దరికీ పరుచూరి బ్రదర్స్‌గా నామకరణం చేశారు ఎన్టీఆర్‌. అప్పట్నుంచి ఆ ద్వయం అదే పేరుతో ప్రాచుర్యం పొందింది. పరుచూరి సోదరుల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ తన జీవితంలో డిసెంబరు 23వ తేదీ అస్సలు మరిచిపోలేనిది అంటారు. దాని గురించి ఓ సందర్భంలో చెబుతూ ‘‘తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న రోజులవి. నిర్మాత కుమార్‌... శోభన్‌బాబుతో ‘మానవుడు మహనీయుడు’ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘నువ్వు క్లాసులో పాఠాలు చెబుతుంటే స్టూడెంట్స్‌ డెస్క్‌లపై తమ చేతులతో బాదుతూ ఆనందం వ్యక్తం చేయడం చూశా. నీవు సినిమాలకి మాటలు రాస్తే... విన్న ప్రేక్షకులూ అలా చప్పట్లు కొడతారు. నాకు ఆ నమ్మకం ఉంది. మా అబ్బాయికి నేను చెబుతా, పద...హైదరాబాద్‌కి’ అని కుమార్‌ తండ్రి నాతో అన్నారు. అంతటితో ఆగకుండా తన కారులోనే నన్ను కూర్చోబెట్టుకుని 1975 డిసెంబర్‌ 23న హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. నేను రచయితగా హైదరాబాద్‌లో తొలిసారి కాలుమోపింది ఆ రోజే. ఇలా, డిసెంబర్‌ 23 తేదీ నాకు గుర్తుండే రోజు’’ అని తెలిపారు. తర్వాత శోభన్‌బాబుతో తమకి వున్న అనుబంధం గురించి చెప్పుకొస్తూ ‘‘ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్‌గా అన్నదమ్ములిద్దరం శోభన్‌బాబుతో కలిసి 13 సినిమాల దాకా పనిచేశాం. అవతలివారి మంచిని కోరే మనిషి శోభన్‌బాబు. మా దర్శకత్వంలో రూపొందిన ‘సర్పయాగం’లో శోభన్‌బాబు కథానాయకుడు. మాకెన్నో మంచివిషయాలు చెప్పారాయన. నమ్మిన మనుషులెవరికైనా మంచి సలహాలు చెప్పేవారు. ఆయన సలహాలను ఆచరిస్తే జీవితంలో ఎదుగుతాం. పారితోషికం తీసుకోకుండా ఉచితంగా సినిమా చేస్తానని శోభన్‌బాబు మాకు మాటిచ్చారు. ఇదాయన మంచితనానికికో మచ్చుతునక. కానీ ఆ మంచితనాన్ని క్యాష్‌ చేసుకోవడం ఇష్టం లేక ఆయనతో సినిమా చేయలేదు’’ అని వివరించారు పరుచూరి గోపాలకృష్ణ.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.