మూడు సార్లు ముచ్చట గొలిపిన ‘శ్రీకృష్ణ తులాభారం’
సినిమా అనేది కళ, వ్యాపారం రెండింటికి సంబంధించిన ప్రక్రియ. అయితే రెండింటినీ సమన్వయ పరచుకోవడంలో కొందరు నిర్మాతలు తప్పుటడుగులు వేస్తూ వచ్చారు. కానీ, శ్రీరాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ అధిపతి కడారు నాగభూషణం మాత్రం ఈ విషయంలో విజయం సాధించారు. అలనాటి అందాల నటి కన్నాంబను ధర్మపత్నిగా స్వీకరించాక స్థాపించిన సినీనిర్మాణ సంస్థ ద్వారా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు నిర్మించే పద్ధతికి శ్రీకారం చుట్టిన ప్రథమ నిర్మాత నాగభూషణం. ‘‘దర్శకబ్రహ్మ’’ చిత్తజల్లు పుల్లయ్య కుమారుడు సి.యస్‌.రావును తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దర్శకునిగా పరిచయం చేసిన ఘనత కూడా నాగభూషణానిదే! ఆ తొలి చిత్రమే డిశంబరు 3, 1955న విడుదలై విజయశంఖం పూరించిన పౌరాణిక చిత్రం ‘శ్రీకృష్ణ తులాభారం’. ఈ సినిమా శత దినోత్సవం చేసుకోవడమేకాదు, సి.యస్‌.రావుని ఈ సంస్థకు ఇంటి అల్లుణ్ణి కూడా చేసింది. కన్నాంబ, నాగభూషణంల దత్తపుత్రిక రాజేశ్వరిని సి.యస్‌.రావు పెళ్లి చేసుకున్నారు. ఈలపాట (కళ్యాణం) రఘురామయ్య కృషుడుగా అలరించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఆ సినిమా పూర్వాపరాలు గుర్తుచేసుకుందాం.


* నాటకం సినిమాగా మలుపు
1930 దశకంలో జనరంజకమైనవిగా పేరొందిన నాటకాలను తెలుగులో సినిమాలుగా నిర్మించారు. ఆయా నాటకాలలో రాణించిన నటీనటవర్గమే సినిమాలలో కూడా నటించేది. టాకీలు ప్రారంభమైన తొలి రోజుల్లో వచ్చిన పౌరాణిక సినిమాలలో ఏప్రిల్‌ 22, 1935న విడుదలైన కలకత్తా కాళీ ఫిలింకంపెనీ వారి ‘శ్రీ కృష్ణ తులాభారం’ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకు ముత్తరాజు సుబ్బారావు సినేరియా సమకూర్చారు. ఇందులో మైనవరం కంపెనీకి నటించే జయసింగ్‌ కృష్ణుడుగా, ‘రంగమార్తాండ’ కపిలవాయి రామనాథశాస్త్రి నారదుడుగా ‘రంగమార్తాండ చాప్లిన్‌’గా మన్ననలందుకున్న హాస్యనట చక్రవర్తి కాకినాడ జోగినాధం వసంతకడుగా, ఋష్యేంద్రమణి సత్యభామగా కాంచనమాల మిత్రవిందగా, గుంటూరు సభారంజని రుక్మిణిగా, లక్ష్మీరాజ్యం నళినిగా నటించారు నటించారు. ఋష్యేంద్రమణి, కాంచనమాల, లక్ష్మీరాజ్యం, రేలంగిలు ఈ సినిమా ద్వారానే వెండితెరకు తొలిసారి పరిచమయ్యారు. ఆ నాటికే రంగస్థలం నటిగా ఋష్యేంద్రమణి అగ్ర స్థానంలో వుండేది. ఈ సినిమాలో నటనకు వెయ్యిరూపాయల పారితోషికం ఆమెకు లభించింది. అలాగే కపిలవాయికి కూడా అంతే మొత్తంలో పారితోషికం అందింది. ఆ రోజుల్లో ఆ పారితోషికం చాలా పెద్ద మొత్తం కింద లెక్క. రేలంగికి దక్కింది 75 రూపాయలు. కపిలవాయి రామనాథ శాస్త్రి బక్కపలుచగా ఉండడంతో ఆయనకు ఇందులో మందపాటి చొక్కా తొడిగారు ఈ చిత్రానికి ముఖర్జీ, రాజారాంలు ఇద్దరూ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రేక్షకులను సినిమాకి రప్పించేందుకు ప్రదర్శనకు ముందు కాశీ క్షేత్రంలోని స్నానఘట్టాలను పవిత్ర క్షేత్రాలైన కాళీఘట్టం, దక్షిణశ్వర దేవాలయం బేలూరు రామకృష్ణ మఠం, కలకత్తా కాళీ దేవాలయం, హుగ్లీ నది మొదలైన వాటిని ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శించారు. ఈ సినిమాకు ప్రజలు తండోపతండాలుగా వచ్చి వీక్షించారని ఆంధ్ర ప్రతిక స్వకీయవిలేఖరి మద్రాసులోని పంపిణీదారుకి టెలిగ్రాం పంపడం విశేషం. సత్యభామ పాత్రధారణి ఋష్యేంద్రమణి నారదుని మాటలు విని మోసపోయినట్లు గ్రహించినప్పుడు నారదునిపై ఆమె చూపిన హావభావాలకు ప్రేక్షకులు కరతాల ధ్వనులు చేసేవారు. నాటక ప్రదర్శనలలో ప్రాచుర్యం పొందిన పద్యాలను పాటలుగా ఇందులో వాడుకున్నారు. ముఖ్యంగా ముత్తరాజు సుబ్బారావు రాసిన ‘‘ఎన్నడు వేడరాని వనేక్షన రుక్మిణి వచ్చి, మెట్టిన దినమని సత్యము’’ మొదలగు పద్యాలను యధాతధంగా వాడుకోగా, చందాల కేశవదాసు రచించిన ‘‘బలే మంచి చౌక బేరము’’, ‘‘మునివరా తుదకిట్లు ననున్‌ మోసగించతువా’’, ‘‘కొట్టు కొట్టండి బుర్ర పగలకొట్టండి’’ వంటి పాటలను చక్కగా వినియోగించుకున్నారు. ‘‘బలే మంచి చౌక బేరము’’ పాటకు పాపట్ల కాంతయ్య నాటక దశలో బాణీ కట్టగా, సినిమాలలోకి వచ్చేసరికి అటు సాహిత్యంలోను, ఇటు రాగంలోనూ మార్పులకు నోచుకుంది. అలాగే స్థానం నరసింహారావు చేత తను వేసే సత్యభామ పాత్ర కోసం స్వయంగా రాసుకొని ఆలపించే ‘‘మీరజాల గలడా నాయానతి వ్రతవి ధాన మహిమన్‌ సత్యావతి’’ అనే అద్భుత గీతం జయజయధ్వానాలనందుకుంది. ఈ పాటలను, పద్యాలను కూడా తరువాత వచ్చిన శ్రీరాజరాజశ్వేరి ఫిలిం కంపెనీ వారి సినిమా (1955)లోనూ, సురేస్‌ ప్రొడక్షన్స్‌ వారి సినిమా (1966)లో కూడా యధాతధంగా వాడుకున్నారు.


* కన్నాంబ - నాగభూషణం
బందరు ‘‘బాలమిత్ర నాటక సమాజం’’లో పనిచేస్తున్నప్పుడు కె.బి.నాగభూషణానికి కన్నాంబతో పరిచయం కలిగింది. పరిచయం పెరిగి ప్రణయంగా మారి ఇద్దరూ దంపతులయ్యారు. అప్పుడే ‘‘శ్రీరాజరాజేశ్వరీ నాట్య మండలి’’ నెలకొల్పి ‘కనకతార’, ‘హరిశ్చంద్ర’ వంటి పలు నాటకాలను ప్రదర్శించారు. తరువాత మద్రాసు చేరుకొని ‘శ్రీరాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ’ స్థాపించి సినిమా ‘తల్లిప్రేమ’ నిర్మించారు. దానికి జ్యోతిసిన్హా దర్శకతం వహించారు. ‘తల్లిప్రేమ’తో మొదలుపెట్టి వరుసగా ‘పేదరైతు’, ‘లక్ష్మి సతీ సక్కుబాయి’ వంటి సినిమాలు వరుసగా నిర్మించి మంచి పేరు సంపాదించారు. కన్నాంబ ఈ సినిమాలలో నటిస్తూవుంటే, నాగభూషణం దర్శకత్వ బాధ్యతలు చేపట్టేవారు. తరువాత ‘శ్రీ వరలక్ష్మి ఫిలిమ్స్‌’ అనే అనుబంధ సంస్థను నెలకొల్పి ‘వీరభాస్కరుడు’, ‘సతీసావిత్రి’ వంటి మరికొన్ని సినిమాలను నిర్మించారు. అప్పుడు చిత్తజల్లు పుల్లయ్య తనయుడు సి.యస్‌.రావు, నాగభూషణం సంస్థలో పనిచేస్తూ వుండేవారు. సి.యస్‌.రావు పనితనం కార్యదీక్ష నాగభూషణాన్ని బాగా ఆకట్టుకుంది. దైతా గోపాలంతో కూడా అప్పటి నుంచే నాగభూషణానికి పరిచయం. ఆయనే నాగభూషణం సినిమాలకు పాటలు రాస్తుండేవారు. కలకత్తా కాళీ ఫిలిమ్స్‌ వారి ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా వచ్చిన ఇరవయ్యేళ్ల తరువాత కడారు నాగభూషణం అదే సినిమాను ‘శ్రీకృష్ణ తులాభారం’ పేరుతో మరలా నిర్మించారు. ఈ సినిమా డిసెంబరులో 1955న విడుదలైంది. నాగభూషణం స్వయంగా దర్శకుడై వుండి కూడా, ఈ సినిమాకు సి.యస్‌. రావు దర్శకునిగా నియమించారు. కల్యాణం రఘురామయ్య (ఈలపాట) కృష్ణుడుగా, సూరిబాబు నారదుడుగా, రేలంగి వసంతకుడుగా, నారాయణరావు ఇంద్రుడుగా నటించగా యస్‌.వరలక్ష్మి సత్యభామగా, శ్రీరంజిని (జూ) రుక్మిణిగా, సూర్యకళ శచీదేవిగా నటించారు. రావూరి మాటలు సమకూర్చగా నాగభూషణం మిత్రుడు దైతా గోపాలం ఈ సినిమాకు పద్యాలు పాటలు సమకూర్చారు. హెచ్‌.ఆర్‌.పద్మనాభ శాస్త్రి బాబురావు సంయుక్తంగా సంగీతం సమకూర్చారు.


* పారిజాత సుమదళం
శ్రీ కృష్ణదేవరాయులు ఆస్థానంలో కవులలో ఒకరైన నంది తిమ్మన రచించిన ప్రబంధ కావ్యం ‘పారిజాతాపహరణం’లోని ఘట్టాలను శ్రీకృష్ణ తులాభారం కథగా మలిచారు. సత్యభామ పాదంతో శ్రీకృష్ణుని తన్నినట్లు ఈ ప్రబంధంలో తిమ్మన వర్ణించడం జనరంజకమై నిలిచింది. రసికావతంసుడైన కృష్ణుడు ‘‘నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిస్కబూని.... అలకమానవు కదా ఇకనైన అరాళ కుంతలా’’ అంటూ లాలన చేసిన ఈ ఒక్క పద్యంతో సినిమా హిట్టయింది. ఇంద్రసభలో నారదుడు ఆలపించిన ‘శ్రీకృష్ణ నామగానం’ వినిన దేవేంద్రుడు తన్మయుడై తన భార్య శచీదేవికి ప్రీతి పాత్రమైన పారిజాత పుష్పాన్ని అందజేసి తనకు అత్యంత ప్రేమపాత్రురాలైన భార్యకు కానుకగా ఇమ్మని చెబుతాడు. శ్రీకృష్ణుడు తన పక్కనే వున్న రుక్మిణిదేవికి ఆ పారిజాతాన్ని బహుకరిస్తాడు. అది తెలిసిన సత్యభామ కినుక వహిస్తుంది. ఆమె అలుకను తీర్చేందుకు పారిజాత వృక్షాన్ని తెచ్చి ఇచ్చేందుకు శ్రీకృష్ణుడు ఇంద్రలోకానికి పయనమౌతాడు. అతని వెంట సత్యభామ కూడా వెళ్తుంది. ఇంద్రుడు శ్రీకృష్ణుడు పోరాటానికి సిద్ధమౌతారు. ఇంద్రుని తల్లి అదితి అడ్డుపడి పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణునికి ఇప్పిస్తుంది. సత్యభామ గర్వంతో రుక్మిణిదేవిని అవమానికి గురిచేస్తుంది. సత్యభామ గర్వం అణచాలని నారదుడు భర్తదాన వ్రతం చేయమని ప్రోత్సహిస్తాడు. వ్రతానంతరం శ్రీకృష్ణుని బరువుకు సమానమైన ధనధనేతరాలను యిచ్చి భర్తను తిరిగి పొందవచ్చునని నారదుడు నమ్మబలుకుతాడు. సత్యభామ భర్తతో సహా పారిజాత వృక్షాన్ని కూడా నారదునికి దానం చేస్తుంది. కానీ ఎంత ధనం వేసినా శ్రీకృష్ణుడిని తూచలేకపోతుంది. దాంతో నారదుడు శ్రీకృష్ణుడిని నడివీధిలో పెట్టి అమ్మజూపుతాడు. సత్యభామకు తరుణోపాయం తోచక రుక్మిణిదేవిని ఆశ్రయిస్తుంది. రుక్మిణిదేవి తులాభారంలో భక్తితో వేసిన ఒక్క తులసీదళానికి శ్రీకృష్ణుడు సరితూగుతాడు. సత్యభామకు శ్రీకృష్ణుడు భగవంతుడనే సత్యం బోధపడుతుంది. భగవంతుడు భక్త సులభుడనే నీతిని సూచిస్తూ సినిమా పూర్తవుతుంది. స్థానం నరసింహారావు ట్రేడ్‌ మార్కు పాట ‘‘మీరజాల గలడా నాయానతి’ పాటను యస్‌.వరలక్ష్మి తనదైన శైలిలో పాడి, నటించి ఆ పాటకు శోభ చేకూర్చింది. అలాగే పి. సూరిబాబుతో కలిసి ఆమె పాడిన పద్యాలు అజరామరాలు. ఈలపాట రఘురామయ్య పద్యాల సంగతి చెప్పేదేముంది అవన్నీ అమృత గుళికలే. చందాల కేశవదాసు రాసిన ‘బలే మంచి చౌక బేరము’ పాటను సూరిబాబు ఆలపించిన తీరు ప్రేక్షకుల్ని, శ్రోతల్ని ముగ్దుల్ని చేసింది. ఈ సినిమా అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఆ శతదినోత్సవ వేడుకలను మార్చి 17, 1956న విజయవాడ వినోదా టాకీసులో జరిపారు. ఆ వేడుకకు చిత్తూరు వి.నాగయ్య అధ్యక్షత వహించారు.


* ముచ్చటగా మూడోసారి
సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత రామానాయుడు ‘రాముడు - భీముడు’ సినిమాతో నిర్మాతగా విజయం సాధించి మలి చిత్రానికి యన్టీఆర్‌ కాల్సీట్లు దొరకక పోవడంతో కాంతారావుతో ‘ప్రతిజ్ఞాపాలన’ అనే కాశీమజిలీ కథ నిర్మించారు. ఆ తరువాత చిత్రమే ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా. ఇందులో యన్టీఆర్‌ కృష్ణుడుగా, కాంతారావు నారదుడుగా, పద్మనాభం వసంతకుడుగా, రాజనాల ఇంద్రుడుగా, జమున సత్యభామగా, అంజలీదేవి రుక్మిణిగా నటించారు. సత్యభామగా జమున నటన అద్వితీయం. సముద్రాల మాటలు సమకూర్చిన ఈ చిత్రానికి శ్రీశ్రీ, కొసరాజు, దాశరథి పాటల్ని రాయగా సముద్రాల పద్యాలు రాశారు. పెండ్యాల అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. వెరసి ఈ సినిమా ఒక గొప్ప కళాఖండగా సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. 1935, 1955, 1966లో వచ్చిన మూడు సినిమాలు కూడా విజయవంతం కావడం వెనుక గొప్ప కథాబలం వుండడమే ముఖ్య కారణంగా భావించవచ్చు.


- ఆచారం షణ్ముఖచారం


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.