‘దూకుడు’న్న దర్శకుడు..

తె
లుగు చిత్ర పరిశ్రమలో హాస్యంపై పట్టున్న దర్శకులు అరుదుగానే కనిపిస్తుంటారు. ఇటు నవతరం ప్రేక్షకులకు నచ్చేలా హీరోయిజాన్ని చూపిస్తూనే... అటు తన మార్క్‌ హాస్యంతో  ఇంటిల్లిపాదినీ అలరించేలా సినిమాలు తీసే దర్శకుడు శ్రీనువైట్ల. బాక్సాఫీసుకూ ‘దూకుడు’ నేర్పించిన ఘనత ఆయనది. శ్రీను వైట్ల సినిమా అంటే ఆ ప్రభావం అమలాపురం నుంచి అమెరికా వరకు కనిపిస్తుంటుంది. హాయిగా నవ్వుకోవచ్చంటూ థియేటర్ల వైపు కదులుతుంటారు ప్రేక్షకులు. కొంతకాలంగా పరాజయాలతో ఇబ్బంది  పడుతున్నప్పటికీ... ఇప్పటికీ ఆయన అగ్ర దర్శకుల జాబితాలో కొనసాగుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా, కందులపాలెంలో 1972 సెప్టెంబరు 24న జన్మించిన ఆయన, సినిమాలపై ప్రేమతో మద్రాసు వెళ్లారు. సహాయ దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన శ్రీను వైట్ల 1999లో ‘నీకోసం’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. పర్వాలేదనిపించిన ఆ చిత్రం తర్వాత, ఉషాకిరణ్‌ మూవీస్‌లో ‘ఆనందం’ తెరకెక్కించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో శ్రీను వైట్ల పేరు మార్మోగిపోయింది. కామెడీపై పట్టున్న దర్శకుడనే పేరు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత ‘సొంతం’, ‘ఆనందమానందమాయే’, ‘వెంకీ’, ‘అందరివాడు’, ‘ఢీ’, ‘దుబాయ్‌ శీను’ తదితర చిత్రాలు చేశారు. అవన్నీ ఒకెత్తైతే, ఆ తర్వాత చేసిన ‘రెడీ’ మరో ఎత్తు. శ్రీను వైట్ల కామెడీ మార్క్‌ ఎంత బలంగా ఉంటుందో ఆ చిత్రంతో మరోమారు రుజువైంది. ఆ తర్వాత మహేష్‌బాబుతో ‘దూకుడు’ తెరకెక్కించి సంచలన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. ఆ చిత్రం పలు రికార్డుల్ని సొంతం చేసుకొంది. వెంకటేష్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన ‘నమో వెంకటేశాయ’, నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కించిన ‘కింగ్‌’, ఎన్టీఆర్‌తో తీసిన ‘బాద్‌షా’ చిత్రాలు శ్రీను వైట్లకి మంచి పేరు తీసుకొచ్చాయి. ‘ఆగడు’ నుంచి ఆయనకి పరాజయాలు ఎదురవుతున్నాయి. ‘బ్రూస్‌లీ’, ‘మిస్టర్‌’ తదితర చిత్రాలు నిరాశకు గురిచేశాయి. విజయమే లక్ష్యంగా రవితేజతో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాన్ని తెరకెక్కించారు. జంధ్యాల, ఈవీవీ తర్వాత కామెడీ పరంగా అంత ప్రభావం చూపించిన ఘనత శ్రీనువైట్లకే దక్కుతుంది. అందుకే ఆయన సినిమాల్ని కుటుంబమంతా ఇష్టపడుతుంటుంది. అగ్ర కథానాయకులతో సినిమాలు చేసిన శ్రీను వైట్లకి భార్య రూప వైట్లతోపాటు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ రోజు శ్రీను వైట్ల పుట్టినరోజు.

                               


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.