అక్కినేని, అంజలీల రజతోత్సవ సినిమా ‘సువర్ణసుందరి’

ప్రేమ పరవశింపజేస్తుంది... పరవళ్లు తొక్కిస్తుంది... అరిషడ్వర్గాలకు ఆలవాలమై అలమటింపజేస్తుంది. అవసరమైతే త్రిలోకాలనూ తల్లక్రిందులు చేస్తుంది. ప్రేమ అడుగడుగునా శోధించి బాధించే అగ్నిపరీక్షలాంటిది. దానికి ఎదురు నిలిచి నిలబడినవారికే ఆ ప్రేమ ఫలించి, సర్వేశ్వరుని ఆశీస్సులు లభిస్తాయి. అలాంటి ప్రేమజీవుల ప్రణయ విచిత్ర చిత్రీకరణమే అంజలీ పిక్చర్స్‌ వారి ‘సువర్ణసుందరి’ సినిమా. అంజలీదేవి భర్త ఆదినారాయణరావు నిర్మాణ సారధ్యంలో ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన సువర్ణసుందరి సినిమా 1957 మే 10న విడుదలై రికార్డులు సృష్టించింది. ఈ సినిమా 36 కేంద్రాలలో విడుదలైతే, 27 కేంద్రాలలో శతదినోత్సవాలు, 6 కేంద్రాలలో రజోత్సవాలు జరుపుకొని తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.  63 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఈ అద్భుత చిత్ర విశేషాలు...* తెర వెనుక ‘సువర్ణసుందరి’

అంజలీదేవి భర్త పెనుపాత్రుని ఆదినారాయణరావు 1951లో మేకప్‌ ఆర్టిస్టు అక్కినేని గోపాలరావును భాగస్వామిగా చేర్చుకొని అశ్విని పిక్చర్స్‌ పేరిట శ్రీధర్‌ దర్శకత్వంలో ‘మాయలమారి’ (తమిళం ‘మాయక్కారె’ౖ) అనే సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. తరువాత 1952లో అంజలీ పిక్చర్స్‌ పేరిట సొంత సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో ‘పరదేశి’ (1953) అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. అందులో శివాజీ గణేశన్‌ను తెలుగు చిత్ర రంగానికి పరచయం చేశారు. హిందీ చలనచిత్ర దర్శక నిర్మాత వి.శాంతారాం వద్ద ఉన్న ప్రత్యేక కెమెరాను తెప్పించి ఛాయాగ్రాహకుడు కమల్‌ఘోష్‌ చేత టెక్నికల్‌ హంగులు జొప్పించి, స్లోమోషన్‌ ప్రయోగం చేయించారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో నిర్మించిన రెండవ చిత్రం ‘అనార్కలి’ (1955) అనూహ్యమైన రికార్డును సృష్టించింది. ముఖ్యంగా ‘రాజశేఖరా నీపై మోజు తీరలేదురా’, ‘రావోయి సఖా’లాంటి పాటలు ఇంటింటా మారుమ్రోగాయి. అంజలీదేవి నటనకు ప్రేక్షకులు ముగ్దులయ్యారు. మూడవ చిత్రంగా జానపద చిత్రం నిర్మిస్తే బాగుంటుందని భావించి ఆదినారాయణరావు సొంతంగా ఒక కథ అల్లారు. ప్రతిభా వారి ‘బాలరాజు’ (1948), ‘స్వప్నసుందరి’ (1950) సినిమాలు ఈ రచనకు స్ఫూర్తి. స్వప్నసుందరిలో దేవలోకం నుంచి అందాలు చిందించే ఒక దేవకన్య (అంజలీదేవి) భూలోకానికి వచ్చి ఒక రాకుమారుణ్ని ప్రేమించి పెళ్లాడటం ముఖ్యకథ. అందులో ప్రవేశపెట్టిన మాయలు, మంత్రాలు, యుద్ధాలు, ప్రేమగీతాలు ప్రేక్షకలోకాన్ని అలరించాయి. తను అల్లిన కథను వెంపటి సదాశివ (కథాశివ) బ్రహ్మంకు వినిపించి, ఆ కథకు సినిమా రూపమిచ్చేరకంగా స్క్రిప్టును రూపొందించారు. కథ తనదే అయినా ఆదినారాయణరావు ‘ఆదిత్యన్‌’ అనే కలం పేరును పెట్టుకున్నారు. సదాశివబ్రహ్మం స్క్రిప్టుకు సముద్రాల, కొసరాజు పాటలు సమకూర్చారు. ఎం.ఎ.రహమాన్‌ ఛాయాగ్రహణం నిర్వహించారు. వెంపటి పెద సత్యం కూర్చిన నృత్యరీతులు ఈ సినిమాకు హైలట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, రాజసులోచన, రేలంగి, గుమ్మడి, రమణారెడ్డి, పేకేటి, సియ్యస్సార్, గిరిజ, సూర్యకళ, ఇ.వి.సరోజ, మాస్టర్‌ బాబ్జి ప్రధాన తారాగణం.

* కథాకమామీషు...

జయవంతుడు (అక్కినేని) మాళవ దేశపు మహారాజు (ఎ.ఎల్‌.నారాయణ) కుమారుడు. మిత్రుడు వసంతుడు (పేకటి)తో కలిసి గురుకుల విద్యాభ్యాసం పూర్తిచేస్తాడు. గురువు కూతురు సరళ (సూర్యకళ) జయవంతుని ప్రేమిస్తే అతడు తిరస్కరిస్తాడు. జయవంతుడిపై ఉక్రోషంతో తనను బలాత్కారం చేశాడని తండ్రి (కె.వి.ఎస్‌.శర్మ)కి చెప్పి మహారాజు వద్ద ఫిర్యాదు చేయగా, వసంతుడి సలహా మేరకు జయంతుడు దేశాంతరం వెళ్తాడు. మార్గమధ్యంలో జయవంతుడికి ముగ్గురు పాదచారులు కైలాసం (రేలంగి), ఉల్లాసం (రమణారెడ్డి), చాదస్తం (బాలకృష్ణ) కలిసి సవాలు విసురుతారు. ఆ సవాలు స్వీకరించిన జయవంతుడు ఒక గుహలోకి ప్రవేశిస్తాడు. అక్కడ శాపగ్రస్తుడైవున్న ఒక గంధర్వుడికి సాయపడి విమోచనం కలిగిస్తాడు. ఆ గంధర్వుడు జయవంతుడికి మూడు వస్తువులు బహుకరిస్తాడు. ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే తివాచి, కోరింది ఇచ్చే కమండలం, ఎవరినైనా దండించే దండం అవి. ముగ్గురు మిత్రులూ కలిసి జయవంతుని గాయపరచి ఆ మూడు వస్తువుల్ని తస్కరిస్తారు. గాయపడిన జయవంతుడు ఒక నీరులేని మడుగులోకి జారుతాడు. అది కార్తీక పున్నమి రోజు కావడంతో ఆ మడుగులోకి గంగ ప్రవహించి గుహలోవున్న శివుని అభిషేకానికి నీటిని సిద్ధం చేస్తుంది. అదే సమయంలో సువర్ణసుందరి (అంజలీదేవి) తన ఇష్టసఖులతో శివార్చన చేసేందుకు దేవలోకం నుంచి వచ్చి జయవంతుని చూసి మోహిస్తుంది. జయవంతుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. తరచూ భూలోకానికి వచ్చి జయవంతుని కలుస్తున్న సుందరి గర్భవతి అని గ్రహించిన దేవేంద్రుడు (రాజారెడ్డి) ఆమెకు దైవత్వం రద్దుచేసి భూలోకం వెళ్లమని శపిస్తాడు. అంతే కాకుండా జయవంతుడు ఆమెను మర్చిపోతాడని, ఆమెను ముట్టుకుంటే పాషాణమౌతాడని శాపమిస్తాడు. ఆమెకు బిడ్డ (మాస్టర్‌ బాబ్జి) పుడతాడు. ప్రమాదవశాత్తు సుందరి నదిలోపడి బిడ్డకు దూరమై మగవేషంలో సంచరిస్తూ అదృష్టవశాత్తు అవంతి రాజ్యానికి మహామంత్రి అవుతుంది. సుందరి బిడ్డడు ఒక యాదవ పెద్ద ఎల్లడు (గుమ్మడి)కు దొరికి పెరుగుతాడు. ఒక నాగకన్య శాపకారణంగా జయవంతుడు పగలు స్త్రీగా రాత్రి వేళల్లో పురుషునిగా కాలం గడుపుతుంటాడు. తరువాత రాక్షసుని వద్దకు చేరి అమృత ధారలో తడిసి పూర్వ రూపం పొందుతాడు. సుందరిని తాకి పాషణంగా మారుతాడు. కుమారుడు స్వర్ణకమలం తెచ్చి తండ్రి శిరస్సుపైనుంచడంతో నిజరూపం సిద్ధించి భార్యాబిడ్డలతో రాజ్యం చేరుకొని రాకుమారిని కూడా వివాహమాడతాడు.


* సంగీతం... అజరామరం
‘సువర్ణసుందరి’ సినిమా తెలుగులోనే కాకుండా తమిళంలో, హిందీలో కూడా సూపర్‌హిట్‌గా నిలిచేందుకు సంగీతం దోహదపడిందని చెప్పవచ్చు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వం నిర్వహించగా, తదనంతర కాలంలో ప్రసిద్ధ సంగీత దర్శకులుగా పేరు సంపాదించిన టి.వి.రాజు, చెళ్లపిళ్ల సత్యం సహకారం అందించారు. ప్రసాదరావు ఆర్కెస్ట్రా నిర్వహించారు. ఈ చిత్రంలోని తొలిపాట ‘బంగారు వన్నెల రంగారు సంజా రంగేళి ఏతెంచెనే’ పాటను లీల బృందం పాడగా సూర్యకళ బృందంపై చిత్రీకరించారు. ఇందులో ఘటం ఉపయోగించిన తీరు ఓ అద్భుతం. బీంపలాస్‌ రాగం ఆధారంగా బాణీ కూర్చిన ‘జగదీశ్వరా పాహి పరమేశ్వరా దేవా పురసంహరా’ పాటను సుశీల బృందం పాడగా అంజలీదేవి బృందం మీద చిత్రీకరణ జరిపారు. అయితే ఈ పాటను మొదటి జిక్కి చేత పాడించి రికార్డు విడుదల చేశారు. తరువాత సుశీల చేత పాడించి సినిమాలో ఉంచారు. మరొక అద్భుతమైన పాట హిందోళ రాగంలో స్వరపరచగా, సుశీల బృందం ఆలపించిన ‘పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా’ పాట ఇంటర్లూడ్‌లో వేణువు వినిపిస్తుంది. ఈ పాట మూడు భాషల్లోనూ జనాదరణ పొందింది. ఇక అతి గొప్ప పాటగా గుర్తుచేసుకోవలసింది ఘంటసాల, జిక్కి పాడిన ‘హాయి హాయిగా ఆమని సాగే’ రాగమాలిక. ఇందులో పల్లవి, తొలి చరణం (లీలగా పూవులు గాలికి వూగా) హంసానంది రాగంలోనూ, రెండవచరణం (ఏమో తటిల్లతిక మే మెరుపూ) దర్బారీ కానడ రాగంలోను, మూడవ చరణం (చూడుమా చందమామ కనుమా వయారీ) బహార్‌ రాగంలోను, నాలుగవ చరణం (కనుగవా తనియగా ప్రియతమా) కల్యాణి రాగంలోను స్వరపరచి వన్నెతెచ్చారు. ఇందులో వాడిన ‘మొయిలురాజు’, ‘తటిల్లతిక’, ‘చెలువము’ పదాలు, అలాగే ‘పిలువకురా’ పాటలో వాడిన ‘మనసున బాళీ’, ‘చలమున మోడీ’ పదాలను గమనిస్తే సముద్రాల ఆత్మ మల్లాది రామకృష్ణశాస్త్రి ఈ పాటలను రాసినట్లు గోచరించక మానదు. సుశీల బృందం పాడిన మరొక పాట ‘నీ నీడలోన నిలిచేనురా యువతీ మనోజా’ను ఆదినారాయణరావు రాగేశ్రీ, కమాచ్‌ రాగాలు మేళవించి స్వరపరచారు. ఈ పాటను అంజలీదేవి మీద చిత్రీకరించారు. అంజలీదేవి బొమ్మలమ్ముతూ పాడే ‘బొమ్మాలమ్మా బొమ్మలూ చూడండీ బలే బొమ్మలూ’ పాటను సుశీల ఆలపించారు. ఈ పాట మధ్యలో బాగా విజయవంతమైన ‘గొల్లభామ’, ‘పల్లెటూరిపిల’్ల, ‘కీలుగుర్రం’, ‘బాలరాజు’, ‘చంద్రలేఖ’, ‘బాలనాగమ్మ’ సినిమా పేర్లతో బొమ్మలు అమ్మడం ఒక ప్రత్యేకత. మాధవపెద్ది, పిఠాపురం బృందం పాడిన ‘ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా, రణశూరులెవ్వరురా’ పాట సరదాగా ఉంటుంది. మోహనరాగ ఛాయలు గోచరించే ఈ పాటను రేలంగి, రమణారెడ్డి, బాలకృష్ణ మీద చిత్రీకరించారు. చివరగా ఘంటసాల శుభపంతురావళి రాగ ఛాయల్లో పాడిన నేపథ్య సంగీతం ‘అమ్మా అని అడిగేవు బాబూ మీ అమ్మ ఎటనున్నదో’ను మాస్టర్‌ బాబ్జీ, రాజసులోచన, అంజలీదేవి మీద చిత్రీకరించారు. ఇందులో మరికొన్ని పాటలు ‘శంభో నా మొర వినవా’, ‘కొమ్మనురా విరుల రెమ్మనురా’, ‘రారే వసంతుడు ఏతెంచే మళ్లీ’, ‘ఈ వసుధలో నీకు సాటి దైవం’ (తిల్లాన) సాధారణ స్థాయివే!
* మరిన్ని విశేషాలు

* తమిళంలో ఈ చిత్రం పేరు ‘మనలనే మంగయిన్‌ బాగ్యమ్‌’. ఇందులో హీరో పాత్రను జెమినీగణేశన్‌ పోషించారు. హిందీలో అక్కినేని, అంజలీదేవి ముఖ్యపాత్రలు పోషించారు. వీరిద్దరూ నటించిన ఒకే ఒక హిందీ చిత్రం ‘సువర్ణసుందరి’. ఈ సినిమా మూడు భాషల్లోనూ విజయవంతమై అంజలీ పిక్చర్స్‌ సంస్థకు కాసులు రాల్చింది. ‘సువర్ణసుందరి’ విడుదలకు కేవలం ఒక నెలముందే విజయావారి ‘మాయాబజార్‌’ సినిమా విడుదలై ప్రభంజనం సృష్టిస్తున్న రోజుల్లో ‘సువర్ణసుందరి’ సినిమా 27 కేంద్రాలలో శతదినోత్సవం, ఆరు కేంద్రాలో రజోత్సవం జరుపుకోవడం చిన్న విషయం కాదు. (‘మాయాబజార్‌’ 24 కేంద్రాల్లో శతదినోత్సవాలు, నాలుగు కేంద్రాలలో రజతోత్సవాలు జరుపుకుంది). సదాశివపేట వంటి చిన్న గ్రామంలో కూడా వందరోజులు ఆడిన సందర్భంగా నాటి మంత్రివర్యులు వి.బి.రాజు సమక్షంలో శతదినోత్సవ వేడుకలు జరిపారు. విజయవాడలో నాటి విద్యాశాఖ మంత్రి పట్టాభి రామారావు విజయోత్సవ సభలో పాల•్గన్నారు. ఈ సినిమా నటీనట బృందం అనేక చోట్ల శతదినోత్సవ వేడుకల్లో  విశేషం.

* ఈ సినిమా సింహభాగం షూటింగు వీనస్‌ స్టూడియోలోనే జరిగింది. ఒకప్పుడు అది శోభనాచల స్టూడియోగా చలామణి అయ్యింది. ఆ స్టూడియోలోనే అంజలీదేవి తొలి సినిమా ‘గొల్లభామ’ షూటింగు జరిగింది. అందుకే వీనస్‌ స్టూడియో అంటే అంజలీదేవికి గొప్ప సెంటిమెంట్‌ ఉండేది. ఈ సినిమా అవుట్‌డోర్‌ సన్నివేశాలను మైసూర్‌కు దగ్గరలోని షింష ఫాల్స్‌ వద్ద చిత్రీకరించారు.

* ఈ సినిమాను తొలుత హిందీలోకి డబ్‌ చేయాలనుకొని పాట పాడేందుకు లతాజీని మద్రాసుకు ఆహ్వానించారు. రికార్డింగ్‌కు ముందు తెలుగు వెర్షన్‌ ‘సువర్ణసుందరి’ సినిమాను తిలకించిన లతాజీ, ఆదినారాయణరావుతో ‘ఇంత మంచి సినిమాను డబ్బింగ్‌ ఎందుకు చేస్తారు? హిందీలో రీమేక్‌ చేస్తే విజయవంతమవుతుంది’ అని సలహా ఇచ్చారు. దానితో ఆలస్యం చేయకుండా లతాజీ సలహా మేరకు హిందీలో పునర్నిర్మించేందుకు వెంటనే నిర్ణయం తీసుకొని రంగంలోకి దిగారు. హిందీ చిత్రం 1958లో విడుదలైంది.

* ఈ చిత్రంలో కోయవాళ్లతో ఒక పోరాట దృశ్యం ఉంది. ఆ దృశ్యంలో నటిస్తూ అక్కినేని పైనుంచి దూకినప్పుడు కాలు మడతపడి ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. దానితో ‘మాయాబజార్‌’ షూటింగు కూడా మూడు నెలలు వాయిదాపడింది. నాగేశ్వరరావు కోలుకున్నప్పటికీ కుడివైపు వేగంగా మలుపు తిరగలేక పోయారు. అందుకే అక్కినేని వేసే స్టెప్పుల్లో ‘రైట్‌ అబౌట్‌ టర్న్‌ ఉండదు’.

* అక్కినేని తొలుత ఈ సినిమాలో నటించేందుకు విముఖత చూపారు. కారణం అతని పాత్ర పగలు స్త్రీగా (రాజసులోచన) మారుతూ ఉండే అప్రధానపాత్ర అని. ‘దేవదాసు’ వంటి హిట్‌ అందించిన వేదాంతం రాఘవయ్య, అంజలీదేవి, ఆదినారాయణరావు మాటను తోసివేయలేక అక్కినేని నటించేందుకు ఒప్పుకున్నారు. హిందీ సినిమాలో కూడా ఆయనే హీరోగా నటించారు. అక్కినేని చిన్నతనంలోనే హిందీ విశారద పరీక్ష ప్యాసవడం చేత డబ్బింగు తనే చెప్పుకున్నారు.

* లతాజీ ఆ రోజుల్లో పాటకు నలభైవేలు పారితోషికం తీసుకునేవారు. ఆదినారాయణరావు సంగీతానికి ముగ్దురాలై ఆమె పాడిన పాటలకు కేవలం పాటకు రెండువేల చొప్పున తీసుకున్నారు. ‘హాయి హాయిగా ఆమని సాగే’ పాటను తెలుగులో ఘంటసాలతో కలిసి జిక్కి పాడగా, తమిళంలో సుశీల పాడింది. హిందీలో ఆ పాటను (కుహూకుహూ బోలె కోయలియా) రఫీ, లతాజీ పాడారు. అఖిల భారత సంగీత విమర్శకుల సంఘం ఆదినారాయణరావుకు ఉత్తమ సంగీత దర్శకుని పురస్కారం అందించింది.

* ఇందులో శివుడుగా వెంపటి పెదసత్యం, పార్వతిగా ఇ.వి.సరోజ అద్భుతంగా శివతాండవం చేశారు.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.