యన్టీఆర్, ఆదుర్తిల విజయం... ‘తోడూ నీడా’

తోడూ నీడా లేని జీవితం వ్యర్థం. పోయినవారు ఎంతటి ఉత్తములైనా, ఉన్నవారి జీవితం పోయిన వారితో ముగిసిపోదు.. పోకూడదు. ఉన్నవారికి జీవితంలో తగిన తోడూ నీడా అవరసరమే. తోడు లేనిరోజు ఆవేదన చెందక పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నప్పుడే జీవితం సుఖమయవుతుంది. జీవిత భాగస్వామి మరణించినప్పుడు తీర్చలేని విషాదం వెంటాడుతుంది. వారికి స్వాంతన కావాలంటే తోడు ఉండాల్సిందే.. అది కూడా జీవిత భాగస్వామినే! ఈ నేపథ్యంలో దిగ్దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు నిర్దేశకత్వంలో విజయభట్‌ మూవీస్‌ నిర్మాతలు యస్‌.యస్‌.భట్, ఎ.రామిరెడ్డి సంయుక్తంగా నిర్మించగా శతదినోత్సవం జరుపుకున్న గ్రామీణ కుటుంబ కథా చిత్రం ‘తోడూ నీడా’. యన్టీఆర్, ఆదుర్తితో పనిచేసిన మలి చిత్రం.. ఆఖరి చిత్రం కూడా ఇదే! 1965 మే 12న విడుదలై 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ స్వర్ణోత్సవ చిత్ర విశేషాలు కొన్ని మీ కోసం...


* తమిళ ‘కర్పగం’ తెలుగులో..

ప్రముఖ తమిళ నిర్మాత, రచయిత కె.ఎస్‌.గోపాలకృష్ణన్‌ 1963లో అమరజ్యోతి మూవీస్‌ పతాకం కింద ‘కర్పగం’ అనే తమిళ సినిమా నిర్మించారు. ఆ సినిమాలో యస్వీ రంగరావు, జెమినీ గణేశన్, ముత్తురామన్, వి.కె.రామస్వామి, సావిత్రి ముఖ్యపాత్రలు పోషించారు. ‘కల్యాణమండపం’ అనే తమిళ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించిన కె.ఆర్‌.విజయను తొలిసారి హీరోయిన్‌గా పరిచయం చేస్తూ, ఆమె చేత ఇందులో టైటిల్‌ పాత్రను పోషింపజేశారు. నవంబర్‌ 15న తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించి గోపాలకృష్ణన్‌కు కాసులు రాల్చింది. ఆ విజయానికి గుర్తుగా ‘కర్పగం’ పేరుతోనే మద్రాసు ఆర్కాట్‌ రోడ్లో ఒక స్టూడియో నిర్మించి తన సినిమాలన్నింటినీ గోపాలకృష్ణన్‌ అందులోనే తీశారు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్ర మెరిట్‌ సర్టిఫికేట్‌ లభించింది. ఆ రోజుల్లో నిత్యానంద్‌ భట్‌ (యన్‌.యన్‌.భట్‌) అనే వ్యక్తి చమ్రియా పంపిణీ సంస్థ వారి ఢిల్లీ శాఖలో పనిచేస్తూ, మద్రాసు వచ్చి సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. అతనికి నెల్లూరు జిల్లాలో మోతుబరి రైతు, విజయా టాకీస్‌ అధినేత ఎ.రామిరెడ్డితో పరిచయమైంది. ఇద్దరూ కలిసి ‘కర్పగం’ హక్కులు కొని తెలుగులో ‘తోడూ నీడా’ పేరుతో పునర్నిర్మించేందుకు ఉద్యుక్తులయ్యారు. అంతకుముందు ఆదుర్తి సుబ్బారావు యన్టీఆర్‌తో ‘దాగుడుమూతలు’ సినిమాకు దర్శకత్వం వహించి ఉండడంతో దర్శకత్వం బాధ్యతల్ని వారు ఆయనకే అప్పజెప్పారు. సముద్రాల జూనియర్‌ మాటలు సమకూర్చగా, ఆచార్య ఆత్రేయ పాటలు రాశారు. తమిళ మాతృకకు వాలి పాటలు రాశారు. ‘కర్పగం’కు విశ్వనాథన్‌ రామ్మూర్తి సంగీతం అందించగా, ‘తోడూ-నీడా’ సంగీత బాధ్యతలను కె.వి.మహదేవన్‌ స్వీకరించారు. ఇందులో యస్వీ రంగారావు పాత్రను ఆయనే పోషించగా, జెమిని గణేశన్‌ పాత్రను ఎన్టీఆర్, కె.ఆర్‌.విజయ పాత్రను జమున, సావిత్రి పాత్రను భానుమతి, ముత్తు రామన్‌ పాత్రను రామకృష్ణ పోషించారు. ఇతర పాత్రల్లో నాగయ్య, నాగభూషణం, రమణారెడ్డి, గీతాంజలి నటించారు.

* పల్లెటూరి కుటుంబ కథ
ఆ ఊళ్లో ధర్మారావు (యస్వీఆర్‌) కోటికి పడగెత్తిన భూస్వామి. అతనికి రాధ (జమున), రాజా (రామకృష్ణ) ఇద్దరు సంతానం. రాధ ఇంట్లోనే ఉంటూ తండ్రికి సహాయకారిగా ఉంటుంది. రాజా చదువుల కోసం బస్తీకి వెళ్లి అక్కడ రాణి (గీతాంజలి)ని ప్రేమిస్తాడు. ఆ రాణి తండ్రి నాగరాజు (నాగభూషణం)కు ధర్మారావు ఆస్తిమీద కన్నుపడుతుంది. ఎలాగైనా రాణిని ఆ ఇంటి కోడలిగాజేసి ఆస్తిని తన హస్తగతం చేసుకోవాలని పన్నాగం పన్నుతాడు. విషయం తెలిసిన ధర్మారావు పెళ్లికి ఒప్పుకోడు. కానీ, రాధ జోక్యంతో రాజా-రాణిల వివాహం జరిగింది. ఆ వివాహంతోబాటే అదే ఊర్లో ఒక యోగ్యుడైన యువకుడు గోపి (యన్టీఆర్‌)తో రాధ వివాహం కూడా జరుగుతుంది. రాజాకు పాప పుడుతుంది. పట్నవాసపు రాణి ఆ పాపను గురించి అంతగా పట్టించుకోదు. పాపకు రాధవద్దే మాలిమి. రాధను అమ్మగా గోపిని నాన్నగా భావిస్తూ పెరుగుతంది. రాణి తండ్రికి ఇది ప్రతిబంధకమైంది. కోర్టులు, దావాలు అంటూ తోక జాడిస్తే ధర్మారావు కీలెరిగి వాత పెట్టి రాజాను, రాణిని ఇల్లు వదిలి వెళ్లమని ఆజ్ఞాపిస్తాడు. రాణి పాపను తనవెంట తీసుకెళ్తే అక్కడ నుంచి ఆ పాప పారిపోయి అత్త ఒడి చేరుతుంది. ఒకసారి ఎద్దు పాపను పొడవబోతే ఆమెను రక్షించబోయి రాధ మరణిస్తుంది. బోసిపోయిన అల్లుడి బతుకును చిగురింపజేయాలని పునర్వివాహానికి ధర్మారావు ప్రయత్నిస్తాడు. ధర్మారావును పరామర్శించేందుకు తన కూతురు లక్ష్మి (భానుమతి)తో వచ్చిన అతని బాల్య స్నేహితుడు ఆనందరావు (నాగయ్య) ఆ ఇంటి పరిస్థితి చూసి చలించిపోయి, లక్ష్మిని గోపీకి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధపడతాడు. లక్ష్మి కూడా పరిస్థితులు అర్థం చేసుకొని గోపిని పెళ్లాడుతుంది. ఎన్నో విపరీత విషమ పరిస్థితులను ఎదుర్కొని సంయమనంతో ఇంటిని చక్కదిద్దుతుంది. టూకీగా ఇదీ చిత్ర కథ.


* చిత్ర నిర్మాణంలో సరిగమలు

జూనియర్‌ సముద్రాల ఆదుర్తితో కలిసి పనిచేయడం ఈ సినిమాతోనే మొదలైంది. స్క్రిప్టు పూర్తిగా చదివిన తరువాతే షూటింగ్‌ మొదలుపెట్టడం ఆదుర్తికి అలవాటు. అది తెలిసిన సముద్రాల పూర్తి స్క్రిప్టు రెడీ చేసి ఆదుర్తికి అందచేజేశారు. ఆదుర్తికి కొన్ని సన్నివేశాలకు మార్పులు చెయ్యాలనిపించి, కవి బాధపడతారేమోననుకుని సహాయదర్శకుడు గోపాలకృష్ణను సముద్రాల ఇంటికి పంపించారు. ఆదుర్తి సూచనలను ఆహ్వానించిన సముద్రాల స్క్రిప్టులో తగిన మార్పులు చేశాక షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. ‘కర్పగం’లో నటించిన బేబీ షకీలాను ఇందులో కూడా నటింపజేశారు. భానుమతి జోలపాట చిత్రీకరణ సమయంలో షకీలా యమ్జీఆర్‌ నటిస్తున్న ఒక తమిళ సినిమాలో షూటింగ్‌లో ఉంది. సమయానికి షూటింగ్‌కి రాలేకపోయింది. భానుమతితో పాటు యస్వీఆర్‌ కూడా సన్నివేశంలో నటించాల్సి ఉంది. రాత్రి పదకొండు గంçలైనా షకీలా రాలేదు. ఆ సమయంలో వైద్యపరీక్షలు చేసుకొని స్టూడియోలో అడుగుపెట్టిన ఆదుర్తికి యస్వీఆర్, భానుమతి వెయిట్‌చేస్తూ ఉండడం చూసి బాధనిపించి, వారికి క్షమార్పణ చెప్పి సంయుక్త దర్శకుడు కె.వి.రావుతో పేకప్‌ చెయ్యమని సలహా ఇచ్చారు. కానీ యస్వీఆర్, భానుమతి అందుకు ఒప్పుకోలేదు. ఇంతలో షకీలా రావడం, షూటింగ్‌ ఉదయం ఆరుగంటల దాకా జరగడంతో పాట చిత్రీకరణ పూర్తయింది. యన్టీఆర్, జమునల మీద వచ్చే ‘‘మళ్లున్నా మన్యాలున్నా మంచెమీద మగువుండాలి’’ అనే యుగళ గీతాన్ని నెల్లూరు సమీపంలో ఉండే నిర్మాత సొంత పొలంలో చిత్రించారు. ఈ పాట చిత్రీకరణ ఒకేరోజులో పూర్తిచేయడం ఆదుర్తి గొప్పతనం. తరువాత కొంత సమయం మిగిలితే కొన్ని మ్యూజిక్‌ బిట్లు కూడా అక్కడే చిత్రీకరించారు. పనిలో పనిగా పల్లె వాతావరణానికి అవసరమయ్యే పొలాలు, చెట్టూ, చేమా, పశువులు, పక్షుల కిలకిలా రావాలు, పంటకోత పనులు వంటి షాట్స్‌ కూడా చిత్రీకరించేశారు. ఆదుర్తికి పనిమీద ఉండే శ్రద్ధ అలాంటిది. ఈ సినిమా టేకింగ్‌ అంతా ‘నమ్మినబంటు’, ‘తోడికోడళ్లు’, సినిమాలను తలపిస్తుంది. ఎందుకంటే ఆ రెంటికీ ఆదుర్తే దర్శకుడు కనుక! ఇక నటన విషయానికొస్తే జమున గురించే ఎక్కువగా చెప్పాలి. మేనకోడలిని సొంత కూతురులా అపురూపంగా పెంచే సన్నివేశాల్లో చూపిన తల్లిప్రేమ, పల్లెటూరి యువతిగా అమాయకపు నడవడి, పాప దూరమైనప్పుడు కనబరిచిన ఆవేదనాభరిత నటన జమునకు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఇక భానుమతి రెండవ భార్య పాత్రలో భానుమతి, ఎన్టీఆర్‌కు దగ్గరయ్యే ప్రయత్నంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లో చూపిన సహనం, పరిణితి అద్వితీయం. జమున జ్ఞాపకాలను మరిచిపోలేని పాత్రలో ఎన్టీఆర్‌ నటన ‘రాము’ సినిమాలో పాత్రను మరిపిస్తుంది. యస్వీఆర్‌ అటు తమిళంలో నల్లశివంగా ఇటు తెలుగులో ధర్మారావుగా జీవించారు. ఇతర పాత్రల నటన సమయోచితంగా ఉంది.

* సంగీత సౌరభాలు

విశ్వనాథన్‌-రామమూర్తి సంగీతానికి ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు సినిమాకు కె.వి.మహదేవన్‌ సంగీతం సమకూర్చారు. సుశీల పాడిన ‘‘అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా.. ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా’’ అనే జోలపాట తమిళ సినిమాలో మూడుసార్లు వస్తుంది. అక్కడక్కడా విశ్వనాథన్‌ నడకలు తెలుగు పాటలో కనిపించినా మహదేవన్‌ బాణీలు చాలా అందంగా అమరాయి. అలాగే ‘‘ఎందులకీ కన్నీరు.. ఎందుకిలా ఉన్నారు.. నేనేమైపోయాను?..ఉన్నాను..నీడై ఉన్నాను.. మీ నీడై ఉన్నాను’’ పాట చక్కగా కుదిరింది. ‘‘మళ్లున్నా మన్యాలున్నా మంచెమీద మగువ ఉండాలీ - పాడి ఉన్నా పంటలు ఉన్నా పంచుకునే మనిషుండాలి’’ అచ్చం పల్లెటూరి పొలం పనుల పాట. భానుమతి పాడిన ‘‘ఎన్నోరాత్రుల వస్తాయి కానీ ఇదియే తొలిరేయి.. ఎన్నో బంధాలున్నాయి కానీ ఇది శాశ్వత మోయి’’ పాటను జమున - ఎన్టీఆర్‌ తొలిరేయి పాటగా చిత్రీకరించారు. ఇద్దరినీ ఉద్దేశించి భానుమతి పాడే పాట ఇది. ‘‘వస్తాడమ్మా నీరేడు.. ఏమిస్తాడో రుచి చూడు - మల్లెల మంచం పిలిచింది.. ఉయ్యల త్వరలో రానుంది’’ వంటి అలతి పదాలతో అనంతార్థాన్ని అల్లెయ్యడం ఆత్రేయకు వెన్నతో పెట్టిన విద్య. రామకృష్ణ - గీతాంజలి యుగళ గీతం ‘‘వలపులోని చిలిపితనం ఇదేలే.. నీ చెలిమిలోని గట్టి చిక్కు అదేలే’’ను పి.బి.శ్రీనివాస్, జానకి పాడారు. ఈ పాట ప్రశ్న - జవాబు రూపంలో వస్తుంది. ‘సుమంగళి’ సినిమాలో ‘‘కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి?’’లాగే పాటను రాశారు ఆత్రేయ. అంతే శ్రావ్యంగా పీబీ, జానకి ఆలపించారు. ఈ సినిమాలో పాపకోసం భానుమతి ఒక ఇంగ్లీషు పాట పాడుతుంది.. ‘‘వెన్‌ ఐ వాజ్‌ జెస్ట్‌ ఎ లిటిల్‌ గర్ల్, ఐ ఆస్డ్క్‌ మై మదర్‌.. వాట్‌ విల్‌ ఐ బి’’ అనే పాట అది. ‘‘క్యూ సేరా, సేరా’’ పాటగా ఇది చాలా పాపులర్‌ అయిన ఇంగ్లీషు ఆల్బంలోనిది. 1956లో ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ ‘ది మ్యాన్‌ హూ న్యూ టూ మచ్‌’’ సినిమాలో తొలిసారి దీనిని వాడారు. బ్రిటన్‌ సింగర్స్‌ చార్టులో ఈ ఆల్బం సూపర్‌ హిట్‌. 1956లో ఆస్కార్‌ అవార్డును కూడా గెలుచుకుంది. జేలివింగ్ట్సన్, రే ఈవాన్స్‌ రైటింగ్‌ టీం తయారు చేసిన ఆల్బంలో పల్లవిని, తొలి చరణాన్ని మాత్రమే ‘తోడూ నీడా’లో తీసుకొని చివరి చరణాన్ని మాత్రమే అదే మూసలో సన్నివేశానికి అనుగుణంగా రాయించారు ఆదుర్తి. ‘‘వెన్‌ ఐ వాజ్‌ జస్ట్‌ ఏ చైల్డ్‌ ఇన్‌ స్కూల్, ఐ ఆస్క్‌డ్‌ మై టీజర్‌.. వాట్‌ విల్‌ బి.. షుడ్‌ ఐ పెయింట్‌ పిక్చర్స్‌... షుడ్‌ ఐ సింగ్‌ సాంగ్స్‌.. ఈజ్‌ వాట్‌ షి సెడ్‌ టు మి.. క్యూ సేరా సేరా’’ అనేది ఈ చరణం. భానుమతి ఈ పాటను అద్భుతంగా పాడింది. ఇంగ్లీషు ఆల్బంలో ఉండే ట్యూనులోనే ఆమె ఈ పాటను పాడడం విశేషం. ‘‘జ్యో అత్యుతానంద జోజో ముకుందా’’ చరణాలు ఈ పాటకు కొనసాగింపు. ఆదుర్తి సుబ్బారావు - యన్టీఆర్‌ తొలి చిత్రం ‘దాగుడుమూతలు’ తరువాత వరుసగా శతదినోత్సవం జరుపుకున్న ఈ మలి చిత్రం.. వారిద్దరికీ ఆఖరి కాంబినేషన్‌ చిత్రం కూడా!

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.