శ్రీశ్రీ రాసిన ‘హరికథ’ కథ!
కథాబలం కలిగిన కొన్ని గొప్ప సినిమాలు బాక్సాఫీసువద్ద ఎందుకు విఫలమవుతాయో అంతుతెలియని ప్రశ్న. ఆ కోవకి చెందిన సినిమా కవితా చిత్ర నిర్మాణతలో వచ్చిన ‘వాగ్దానం’(1961). కె.సత్యనారాయణ, డి.శ్రీరామమూర్తి నిర్మాతలుగా మనసు కవి ఆచార్య ఆత్రేయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా, ప్రముఖ బెంగాలీ రచయిత శరత్‌ బాబు 1918లో రచించిన ‘దత్త’ నవలకు తెరరూపం. హేమాహేమీలైన అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, రేలంగి, చలం, కృష్ణకుమారి, సూర్యకాంతం, గిరిజ వంటి నటీనటవర్గంతో నిర్మించిన ఈ సినిమాలో పెండ్యాల స్వరపరచిన పాటలన్నీ హిట్లే. అయితే ఎందుకు ఈ సినిమా విజయవంతంగా ఆడలేకపోయింది? అనే ప్రశ్నకు ఎంత వెదకినా జవాబు దొరకదు. ఈ చిత్రానికి ఇది ఒక పార్శ్వమైతే, ఇందులో దర్శకుడిగా ఆచార్య ఆత్రేయ చేసిన ప్రయోగాలు అమోఘాలు. తన సొంత సినిమా అయినా సహచర సినీకవులకు ప్రాధాన్యమిస్తూ, దాశరథి వంటి గొప్ప కవిని వెండితెరకు పరిచయం చేస్తూ ఆత్రేయ చేసిన ప్రయోగం మెచ్చుకోవలసిన అంశం. ‘వాగ్దానం’ చిత్రంలో మొత్తం 8 పాటలుండగా, ‘నాకంటి పాపలో నిలిచిపోరా’ అనే పాటను దాశరథి చేత రాయించారు. నాలుగు పాటలను ఆత్రేయ, ‘తప్పెట్లో తాళాలో’ అనే ఒక పాటను నార్ల చిరంజీవి చేత, మిగిలిన రెండు పాటలను మహాకవి శ్రీశ్రీ చేత ఆత్రేయ రాయించారు. శ్రీశ్రీ రాసిన రెండుపాటల్లో ఒకటి ‘సీతాకళ్యాణ సత్కథ’. గతంలో వచ్చిన సినిమాలలో శ్రీరాముని మీద అనేక పాటలైతే వచ్చాయిగాని, హరికథకు సంబంధించి వచ్చిన తొలి పాటగా ఈ సీతాకల్యాణాన్ని చెప్పుకోవాలి. మకుటాయమానమైన ఈ హరికథను రచించేందుకు మహాకవి శ్రీశ్రీ ఎంతో పరిశోధన చేశారు. వామపక్ష భావాలు కలిగిన శ్రీశ్రీ ఈ హరికథను అక్షరబద్ధం చేసిన తీరు అనితరసాధ్యం. అలాగే ఆ హరికథకు సమ్మోహనమైన సంగీతాన్ని సమకూర్చిన పెండ్యాల నాగేశ్వరరావు, గంగా ప్రవాహంలా మాటకు, పాటకు, పద్యాలకు సమానంగా భావోద్వేగాలకు తన గళంలో స్వరవిన్యాసాలు పలికించిన ఘంటసాల, తెరమీద తనదైన శైలిలో రక్తికట్టించిన రేలంగి, పద్మనాభం, సూర్యకాంతం ఈ హరికథను అజరామరం చేశారు. శ్రీశ్రీ నాస్తికుడు కావచ్చు... కానీ పురాణ ఇతిహాసాలను కూలంకషంగా చదివి వాటిని ఆపోసన పట్టిన మహా పండితుడు అనే విషయం కొందరికి మాత్రమే తెలుసు.శ్రీశ్రీ కలానికి ఎంతటి పదునుందో ‘తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా’, ‘పాడవోయి భారతీయుడా’, ‘కలకానిది విలువైనది’, ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై’, ‘ఓ రంగయ్యో పూల రంగయ్యో’, తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం’, ‘ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే’, ‘ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం’, ‘నందుని చరితము వినుమా’, ‘నినుచూడ మనసాయేరా’ (జావళి)వంటి కొన్ని పాటలు గుర్తు చేసుకుంటే చాలు. కానీ ఈ హరికథలో శ్రీశ్రీ, నలుగురు మహానుభావులను స్మరిస్తూ వారు రచించిన పద్యాలను, కీర్తనను వాడి ఆ హరికథకు వన్నె తెచ్చారు. ఆ మహనీయుల్లో మొదటివారు బమ్మెర పోతనామాత్యుడైతే, రెండవవారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. తరువాత వరసగా హరికథా భాగవతార్‌ పెద్దింటి దీక్షిత దాసు, తిరుపతి వేంకట కవుల సమకాలీనులులైన దాసు రామారావు. శ్రీశ్రీ ఉపయోగించుకున్న పద్యాలను తను రాయలేక కాదు....కానీ ఆ మహనీయులు ఎంత హృద్యంగా సీతాకల్యాణసత్కథలో వర్ణన చేశారన్నది ముఖ్యం. శ్రీశ్రీ ఈ హరికథ కోసం ఎన్ని గ్రంధాలను, సాంప్రదాయాలను ఆశ్రయించారో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది.


రాత్రివేళ పెట్రోమాక్స్‌ దీపకాంతుల్లో అమర్చిన వేదికవద్ద ఈ హరికథ ‘’శ్రీనగజా తనయం సహృదయం... చింతయామి సదయం, త్రిజగన్మహోదయం’’ అంటూ కానడ రాగంలో మొదలవుతుంది. ఈ ప్రారంభ కీర్తనను శ్రీశ్రీ ఒకప్పటి ప్రముఖ హరికథా విద్వాంసులు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాస్తవ్యులైన పెద్దింటి దీక్షితదాసు రచించి, ఆలపించిన కీర్తన నుంచి సేకరించి ఉపయోగించుకున్నారు. వెంటనే ‘’శ్రీరామభక్తులారా! ఇది సీతాకల్యాణ సత్కథ’’ అంటూ వచన వర్ణనతో హరికథ ప్రారంభమౌతుంది. సీతాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి వచ్చిన వీరాధివీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి రఘురాముడు... అంటూ తిన్నగా విషయానికి వచ్చేస్తారు శ్రీశ్రీ. ఇక్కడ రఘురాముడు ముల్లోకాల నుంచి వచ్చిన వీరాధివీరులకన్నా ఎందుకు దివ్యసుందరుడో వివరిస్తారు. రాముడు నెలరేడుకు సరిజోడు అని, అతని కనులు మగమీలను ఏలుతాయని, అతను నవ్వితే రతనాలు రాలుతాయని.... అన్నిటికన్నా ఆ రఘురాముని చూచిన మగవారు కూడా మైమరచి మరులుగొనేటంతటి మనోహరుడు అని వర్ణిస్తారు. ఇక సీతాదేవి ఆ మనోహర విగ్రహాన్ని అంతఃపుర గవాక్షం నుంచి ఓరకంట చూసి, చెలికత్తెలతో ‘ఎంతసొగసుగాడే, మనసు ఇంతలోనే దోచినాడే’ అంటుంది. అంటే స్వయంవర సంరభం ఎలావున్నా రఘురాముని ఆ సీతమ్మ తొలిచూపులోనే మనసు దోచేసుకుకున్నదని, తన నోము ఫలమతడేనని నిర్ణయించుకున్నదని ఒక్క వాక్యంలోనే శ్రీశ్రీ చెప్పేశారు. సీతాదేవి అలా పరవశయై వుండగా, మరొక సన్నివేశానికి శ్రీశ్రీ వేగంగా వెళ్లిపోతారు. అక్కడ సభామంటపంలో జనక మహీపతి సభాసధులకు సీతాదేవిని పరోక్షంలో పరిచయం చేస్తారు. ఆమె వినయవిధేయతలు కలిగిన సద్గుణవతి అంటూ ముఖవిజిత లలిత జలజాత అని, శివధనుస్సును అవలీలగా కదిల్చిన ఆమెకు, ఆ శివధనస్సును ఎక్కుపెట్టగలవీరుడే సరిజోడు అవుతాడని, అట్టివీరునికే సీతమ్మ మాల వేసి పెళ్లాడుతుందని నిబంధన విధిస్తూ స్వయంవర ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటన వినగానే ఎక్కడివారు అక్కడ చల్లబడిపోయారని, చివరకు స్వయంవరంలో పాల్గొన వచ్చిన రావణాసురుడు కూడా ‘ఇది నా ఆరాధ్య దైవమైన పరమేశ్వరుని చాపము, దానిని తాకడమంటే మహాపాపము’ అని భావించి వెనుతిరిగి పోయాడని చెబుతారు. ఈ సంభాషణాలంకార వర్ణన అవగానే శ్రీశ్రీ ఒక అద్భుతమైన పద్యాన్ని రచించారు. తనరచనకు తోడుగా శ్రీదేవీ భాగవతాన్ని తెలుగులో రచించిన దాసు రామారావు (తిరుపతి వేంకటకవుల సమకాలికులు) పద్యంలోని కొంత భాగాన్ని కూడా ఉపయోగించుకున్నారు. ‘‘ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి, తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి’’ అనే పద్య పాదాలవరకు తాను రచించి, దాసు రామారావు రచించిన ‘‘సదమల మదగజ గమనముతోడ స్వయంవర వేదిక చెంత...మదనవిరోధి (శివుడు) శరాసనమును తన కరమును బూనినయంత’’ అనే రెండు వాక్యాలను తన పద్యానికి అనుసంధానించి అద్భుత ఫలప్రయోజనాన్ని చేకూర్చారు. ఇంకాస్త ముందుకెళితే...ఈ పద్యానికి అనుసంధానమైన పద్యాన్ని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి 1959లో రచించిన ‘ఉదయశ్రీ’ అనే కావ్య ఖండికలో వచ్చే ‘ధనుర్భగం’ లోని ఒక పద్యాన్ని ఈ పద్యానికి అనుసంధానించి, ఆ హరికథ నడకతీరును వేగిరపరుస్తూ గొప్ప లయ (టెంపో)ను సమకూర్చారు. కరుణశ్రీ రాసిన పద్యం ఇక్కడి సన్నివేశానికి ఎంత చక్కగా అమరిందంటే... ‘‘ఫెళ్ళు’’ మనె విల్లు గంటలు ‘‘ఘల్లు’’మనె, ‘‘గుభిల్లు’’మనె గుండె నృపులకు ... ‘‘ఝల్లు’’మనియె జానకీ దేహ మొక నిమేషమ్ము నందె నయము జయమును భయము విస్మయము గదుర’’ అంటూ సమయస్ఫూర్తితో ‘’శ్రీమద్రమారమణ గోవిందో హరి’’ అనిపించారు. ఈ పద్య మాధుర్యాన్ని గమనిస్తే... శ్రీరాముడు ఎక్కుపెట్టగానే శివధనుస్సు ఫెళ్ళుమని విరిగింది. ఆ వింటికి కట్టివున్న చిరుగంటలు ఘల్లుమని మ్రోగాయి. సభలో ఆసీనులైవున్న రాజకుమారులందరి గుండెలు ఆ భీకరనాదానికి గుభిల్లుమన్నాయి. ఇక, సీతాదేవి శరీరము ఝల్లుమని పులకరించిపోయింది... ఎంత అందమైన, మనోహరమైన వర్ణన! ఈ చిన్నిపద్యంలోనే అక్కడి వాతావరణాన్ని కరుణశ్రీ ఎంత మనోజ్ఞంగా మన కనుల ముందర నిలిపారో అనే విషయం శ్రీశ్రీకి తెలుసు కనుకనే వారి పద్యాన్ని ఇక్కడ వాడుకున్నారు. ఆవిధంగా శ్రీరామచంద్రమూర్తి శివ ధనుర్భంగం కావించగానే జరిగిన తదుపరి తంతు కోసం బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీమద్భాగవతంలో నవమస్కందంలోని ‘శ్రీరామచరిత్ర’లో వుదహరించిన కందపద్యంలో రెండు పంక్తులను శ్రీశ్రీ వాడుకున్నారు. ‘‘భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెళ్ళి యాడె... బృథుగుణమణి సంఘాతన్‌ భాగ్యోపేతన్‌ సీతన్‌... అనే వాక్యం వరకే ఈ పాటకు వాడుకొని ‘‘ముఖకాంతి విజిత సితఖద్యోతన్‌’’ అనే వాక్యాన్ని వదిలేశారు. లోకనాయకుడైన రాముడు గొప్ప గుణవంతురాలు, అదృష్టవంతురాలు, చంద్రుణ్ణి అతిశయించిన ముఖకాంతిగల సౌందర్యవతి సీతను ప్రీతితో పెండ్లాడినాడు అని ముగించడం ఒక శ్రీశ్రీ మహాకవికే దక్కింది... ఇంతమంది మహనీయుల వర్ణనలను శ్రీశ్రీ అనుసంధానించినా ఎక్కడా అలంకార భేదం గోచరించదు సరికదా, వైలక్షణ్యాభావం కూడా చెడదు. అదే శ్రీశ్రీ రచనా చమత్కృతి!

                               

* శ్రీశ్రీ ఒప్పుకున్న తప్పు
నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి, తప్పును అంతే దైర్యంగా ఒప్పుకోవడానికి శ్రీశ్రీ ఎప్పుడూ వెనుకాడలేదు. నటుడు కృష్ణ నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు’ (1974) చిత్రంలో శ్రీశ్రీ రచించిన ‘’తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా’’ అనే పాటకు జాతీయస్థాయిలో ఉత్తమ గేయరచన బహుమతి లభించింది. ఆ సందర్భంగా జరిగిన ఒక సన్మాన సభలో శ్రీశ్రీ మాట్లాడుతూ ఆ పాటలో సాంకేతికంగా ఒక తప్పుదొర్లిందని చెప్పారు. ఆ పాట మూడవ చరణంలో ‘’ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగులగొట్టి, చురకత్తులు పదునుపెట్టి తుదిసమరం మొదలుపెట్టి, ‘సింహాలై’గర్జించాలి, సంహారం సాగించాలి’’ అంటూ రాశారు. ‘‘ప్రతి మనిషి’’ అన్నప్పుడు ‘‘సింహంలా గర్జించాలి’’ అని వుండాలి కానీ సింహాలై గర్జించాలి అని తప్పు దొర్లినట్టు చెప్పి తన తప్పును ఒప్పేసుకున్నారు. మరొక సంఘటనలో హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన తొలి చిత్రం ‘దేవత’ (1965) సినిమాకు ‘‘బొమ్మను చేసి ప్రాణము పోసి’’ అనే క్లైమాక్స్‌ పాట కోసం వీటూరి తొలుత రెండు పల్లవులు రాశారు. మొదటిది ‘‘నవ్వలేవు ఏడ్వలేవు ఓడిపోయావోయ్‌ మేధావి.. నవ్వించువాడు, యేడ్పించువాడు వున్నాడు వేరే మాయావి’’; రెండవది ‘‘బొమ్మనుచేసి ప్రాణముపోసి ఆడేవు నీకిది వేడుకా’’ అనేది. మొదటి పల్లవిలో డబ్బింగు ఛాయలు ఉండడంతో రెండవ పల్లవినే అందరూ ‘‘ఓకే’’ చేశారు. కానీ ఇరవై రోజులు గడచినా ఈ పాటకు చరణాలు కుదరలేదు. ఒకవైపు సావిత్రి గర్భవతి కావడంతో త్వరగా సినిమా పూర్తి చేయాలని, అప్పుడు పద్మనాభం మహాకవి శ్రీశ్రీని కలిశారు. పల్లవిని మార్చకుండా శ్రీశ్రీ రెండు చరణాలను వెనువెంటనే రాసి ఇచ్చేశారు. వీటూరి రాసిన పల్లవిని మార్చకుండా చరణాలు రాసి తన గొప్పమనసును చాటుకున్న నిజమైన మహాకవి శ్రీశ్రీ.

 - ఆచారం షణ్ముఖాచారి 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.