కథ... మాటలు... పాటలు... సదాశివబ్రహ్మం!

article image
(రచ‌యిత సదా‌శి‌వ‌బ్రహ్మం జన్మ‌దినం ఫిబ్రవరి 18వ తేదీ)

1943−‌44 ప్రపంచ యుద్ధం సంద‌ర్భంగా మన‌దే‌శంలో కర‌వు‌కా‌ట‌కాలు వచ్చాయి.‌ కిర‌స‌నా‌యిలు, బియ్యం, బట్ట, పంచ‌దార−‌ ఏదీ దొరి‌కే‌ది‌కాదు.‌ యుద్ధ‌భయం వల్ల ప్రభుత్వం ప్రజల దగ్గ‌ర్నుంచి డబ్బు వసూలు చెయ్యడం మొద‌లు‌పె‌ట్టింది.‌ బ్రిటిష్‌ పాలన, యుద్ధ‌నిధి పేరుతో కార్య‌క్రమాలు ఏర్పాటు చేసి టిక్కెట్లు అమ్మింది.‌ ఆ సంద‌ర్భంగా శ్రీకా‌కుళం జిల్లా‌లోని ఒక ఊళ్లో ‌‘‌‘విజ‌య‌దుం‌దుభి’‌’‌ అని నాటక ప్రద‌ర్శన.‌ కలె‌క్టర్లు, తాసి‌ల్దార్లు, ఇతర ప్రభుత్వ ఉద్యో‌గులు పూను‌కొని అందరి చేత టిక్కెట్లు కొని‌పిం‌చారు.‌ ఆ నాట‌కంలో మా అన్నయ్య ఆర్‌.‌కె.‌రావు నటి‌స్తు‌న్నా‌డని, నేను శ్రీకా‌కుళం నుంచి ఆ ఊరికి (పేరు గుర్తు‌లేదు) వెళ్లాను−‌ నాటకం చూడ్డా‌నికి.‌ ఆ నాటకం రాసి‌నది వెంపటి సదా‌శి‌వ‌బ్రహ్మం.‌ అప్ప‌టికే ‌‘చుడా‌మణి’, ‌‘తెనాలి రామ‌కృష్ణ’‌ (1941) చిత్రా‌లకు రచ‌యి‌తగా పేరు తెచ్చు‌కు‌న్నారు.‌ ఆయన పాటలు, పద్యాలు, సంభా‌ష‌ణలు అన్నీ రాస్తారు.‌ విశేషం ఏమి‌టంటే ఆ నాట‌కం‌లోని ప్రధాన పాత్రని అంజ‌లీ‌దేవి ధరిం‌చడం! అంజనీ కుమారి పేరుతో నాట‌కాల్లో నటి‌స్తు‌న్నారు.‌ అప్ప‌టికే ఆమెకి ఒక బిడ్డ.‌ ‌‘గొల్ల‌భామ’‌ (1947)తో చిత్రరం‌గంలో ప్రవే‌శిం‌చారు.‌ మా అన్నయ్య నన్ను అంజనీ కుమా‌రికి, సదా‌శి‌వ ‌బ్రహ్మంకీ పరి‌చయం చేశారు.‌ ‌‘‌‘నాటకం చూడ్డా‌ని‌కని ప్రత్యే‌కంగా వచ్చాడు’‌’‌ అని చెప్పాడు.‌ నేను పన్నెం‌డేళ్ల చిన్న‌వా‌డిని.‌
article image
సదా‌శి‌వ‌బ్రహ్మం హాస్యం కూడా బాగా రాస్తారు గనక, ‌‘మంగ‌ళ‌సూత్రం’‌ (1946) అనే సిని‌మాకి రాయించారు నిర్మాత, దర్శ‌కుడు కోన ప్రభా‌క‌ర‌రావు.‌ పాటలు, మాటలూ ఆయనే రాశారు.‌ 1950లో ‌‘సంసారం’‌ సినిమా వచ్చింది. ‌అది సావి‌త్రికి తొలి సినిమా, అక్కి‌నే‌నికి తొలి సాంఘికం.‌ అయితే, ముందుగా ‌‘సంసారం’‌ సిని‌మాని ముది‌గొండ లింగ‌మూర్తి డైరక్టు చేశారు.‌ సదా‌శి‌వ‌బ్రహ్మం ‌‘‌‘సంసారం సంసారం ప్రేమ‌సు‌ధా‌సారం’‌’‌ అనే గీతం రాశారు.‌ మల్లిక్‌ పాడగా రికార్డు చేశారు.‌ ఏదో కొంత షూటింగ్‌ ఎవ‌రి‌వ‌రి‌తోనో జరి‌గింది కానీ ఆగింది.‌ కథ బాగుం‌దని, (కథ వెంప‌టి‌వా‌రిదే) దాన్ని సరైన విధా‌నంలో మారిస్తే జనాన్ని ఆక‌ర్శిం‌స్తుం‌దని సాధనా ఫిలింస్‌ వారు తీసు‌కొని, యల్‌.‌వి.‌ప్రసా‌ద్‌ని దర్శ‌కు‌డిగా నియ‌మిం‌చారు.‌ ఆయన కథలో చాలా మార్పులు చేసి, సదా‌శి‌వ‌బ్రహ్మం చేతనే రాయిం‌చారు.‌ ఆ రాయిం‌చ‌డంలో ‌‘సంసారం’‌ పాటని కూడా మార్పించి, ఘంట‌సాల చేత పాడించి రికార్డు చేశారు.‌ ఎన్‌.‌టి.‌ఆర్, ఎ.‌ఎన్‌.‌ఆర్‌లు నటు‌లుగా ప్రవే‌శిం‌చారు.‌ శ్రీధ‌ర్‌రావు, లక్ష్మీ‌రాజ్యం భాగ‌స్వా‌ము‌లుగా చేరారు.‌ ఈ సినిమా అనూ‌హ్య‌మైన విజయం సాధిం‌చ‌డంతో సదా‌శి‌వ‌బ్రహ్మం పేరు చిత్రసీ‌మలో గణ‌న‌కె‌క్కింది.‌ సదా‌శి‌వ‌బ్రహ్మం రచ‌యితే అయినా, ప్రధా‌నంగా కథ‌కుడు.‌ కథని అల్లు‌కుంటూ పోవ‌డంలో ఘటి‌కుడు.‌ అందుకే, ముళ్ల‌పూడి వెంక‌ట‌ర‌మణ ఆయన పేరుని ‌‘కథా‌శి‌వ‌బ్రహ్మం’‌గా మార్చారు.‌ సిని‌మాల కథా‌చ‌ర్చల్లో, కథ సరిగ్గా నడ‌వ‌క‌పోతే, బ్రహ్మంని పిలిచి కూచో‌బె‌ట్టే‌వారు.‌ ఆయన పరి‌ష్కారం సూచిం‌చే‌వారు.‌ ‌‘కీలు‌గుర్రం’‌ (1949) సిని‌మాకి రచ‌యి‌తగా ఆయన పేరు లేదు‌గాని, కథ‌ని‌ర్మా‌ణంలో ఆయన పాత్రే ఎక్కువ −‌అని అంజ‌లీ‌దేవి చెప్పారు.‌ ఆయన కథ‌లతో తమిళ చిత్రాలు కూడా వచ్చాయి.‌ అయితే, ఆయన గురించి పరి‌శ్రమలో చెప్పు‌కు‌నే‌వారు.‌ ఏమి‌టంటే, ఒకే కథని నలు‌గు‌రై‌దు‌గు‌రికి చెప్తా‌రని.‌ అలా చెప్ప‌డంతో ఒకే కథతో రెండు తమిళ సిని‌మాలు మొద‌లై‌నాయి.‌ తర్వాత తెలు‌సు‌కుని, ఒకరు కథను మార్చు‌కు‌న్నారు.‌

article image
ఆయన 1905లో తూర్పు‌గో‌దా‌వరి జిల్లాలో పుట్టి‌నట్టు చరిత్ర.‌ శ్రీకా‌కుళం జిల్లా‌లోని పెద్ద‌పాడు అనే గ్రామంలో చాలా కాలం ఉన్నట్టు చెప్పే‌వారు.‌ సంస్కృ‌తాం‌ధ్రాలు బాగా అభ్య‌సిం‌చారు.‌ ఎన్నో కావ్యాలు, ప్రబం‌ధాలు, నాట‌కాలూ చది‌వారు.‌ హెచ్‌.‌ఎమ్‌.‌రెడ్డి తీసిన ‘సత్యమే జయం’ (ఘరా‌నా‌దొంగ), ‌‘కన్యా‌శుల్కం’, (అద‌నపు సంభా‌ష‌ణలు) ‌‘భలే‌రా‌ముడు’, ‌‘చర‌ణ‌దాసి’, ‌‘సువ‌ర్ణ‌సుం‌దరి’, ‌‘చెంచు‌లక్ష్మి’, ‌‘అప్పు‌చేసి పప్పు‌కూడు’, ‌‘పెంపుడు కొడుకు’, ‌‘ఇల్ల‌రికం’, ‌‘కృష్ణ‌లీ‌లలు’, ‌‘ఇల‌వేల్పు’, ‌‘పెళ్లి కాని పిల్లలు’, ‌‘లవ‌కుశ’, ‌‘పర‌మా‌నం‌దయ్య శిష్యుల కథ’‌ (ఎన్‌.‌టి.‌ఆర్, సి.‌పుల్లయ్య) ‌‘భామా‌వి‌జయం’, ‌‘భావన’, ‌‘సుంద‌రి‌కథ’‌ మొద‌లై‌నవి సదాశివ‌బ్రహ్మం రచ‌నలు చేసిన చిత్రాలు.‌ కొన్ని చిత్రాల్లో పాటలు కూడా రాశారు.‌

article image
1956 తర్వాత నేను మద్రా‌సులో ఉండగా, ఎవ‌రి‌తోనో సదా‌శి‌వ‌బ్రహ్మం ఇంటికి వెళ్లాను.‌ రాయ‌పే‌టకి దగ్గర్లో ఉన్న గౌడి‌యా‌మఠం అనే ప్రాంతంలో మేడ‌మీద అద్దెకి ఉన్నారు.‌
‌‘‌‘సినిమా వాళ్లు నా చేత వాగించి కథలు చెప్పిం‌చు‌కుం‌టారు గాని, డబ్బులు ఇవ్వరు.‌ ఒక నిర్మాత కథ కావా‌లంటే చెప్పాను.‌ సాంఘికం.‌ అంతా విని, ‌‘‌‘బాగానే ఉంది.‌ చూద్దాం.‌ నా భాగ‌స్వా‌ము‌లకి కూడా చెప్పి చూస్తాను.‌ అంద‌రికీ నచ్చితే మళ్లీ వచ్చి కలు‌స్తాను’‌’‌ అని వెళ్లాడు.‌ రాలేదు.‌ కొన్ని రోజుల తర్వాత, ఆ కథనే సినిమా తీస్తు‌న్నట్టు విన్నాను.‌ వెళ్లి అడి‌గితే, ‌‘‌‘ఆ కథ కాదే.‌ వేరే కథ.‌ మేమే అల్లు‌కున్నాం’‌’‌ అని దబా‌యిం‌చాడు.‌ అలా ఉంటాయి చౌర్యాలు, అంచేత ముందు‌గానే డబ్బు అడు‌గు‌తు‌న్నాను.‌ ‌‘‌‘కథ నచ్చితే కదా డబ్బులు ఇవ్వడం’‌’‌ అంటారు వాళ్లు.‌ అంచేత, నమ్మకం ఉన్న వాళ్లకే కథ చెబు‌తు‌న్నా‌ను‌గాని, ఎవ‌రి‌కి‌ప‌డితే వాళ్లకి చెప్పడం లేదు’‌’‌ అని చెప్పారు, నన్ను వెంట బెట్టు‌కొని వెళ్లిన పెద్దా‌య‌నతో.‌ మేము ఉన్న అర‌గం‌ట‌లోనూ దాదాపు ఆరు, ఏడు సిగ‌రెట్లు వెలి‌గిం‌చి‌న‌ట్టు‌న్నారు ఆయన.‌
article imageపిఠా‌పురం నాగే‌శ్వ‌ర‌రావు తొలి సినిమా పాట ‌‘మంగ‌ళ‌సూత్రం’‌లో, జిక్కితో కలి‌సి‌పా‌డారు.‌ బ్రహ్మం‌గారు రాసి‌న‌పాట ‌‘మామ‌య్యొ‌చ్చాడే’‌.‌ మును‌స్వామి సంగీతం.‌ ‌‘గొల్ల‌భామ’‌ సిని‌మాలో కృష్ణ‌వేణి, రఘు‌రా‌మయ్య పాడిన ‌‘చంద‌మామ’‌ పాట, మరి‌కొన్ని పాటలూ రాశారు.‌ ‌‘ఇల‌వేల్పు’‌లో ‌‘చల్లని రాజా ఓ చంద‌మామ’, ‌‘భలే‌రా‌ముడు’‌లో ‌‘ఓహో మేఘ‌మాల −‌ అందాల మేఘ‌మాల’, ‌‘సంసారం’‌లో ‌‘చిత్రమై‌నది విధి నడక’, ‌‘టక్కు‌టక్కు టము‌కుల బండి’‌ వంటివి తెలి‌సిన పాటలు.‌ పిఠా‌పురం పాడిన తొలి‌పా‌ట సదా‌శి‌వ‌బ్రహ్మం రాసి‌నట్టే పి.‌బి. ‌శ్రీని‌వాస్‌ పాడిన తొలి‌పాట కూడా ఆయన రచనే.‌ ‌‘భయ‌మేలా ఓ మనసా’‌ అన్న‌పాట.‌ ‌‘చెంచు‌లక్ష్మి’‌లో ప్రసిద్ధి చెందిన ‌‘పాల‌క‌డ‌లిపై శేష‌శ‌యన’, ‌‘లవ‌కుశ’‌లోని పద్యాలు ‌‘ఇదె‌మన ఆశ్రమంబు’, ‌‘నవ‌ర‌త్నో‌జ్వల’‌ (ఘంట‌సాల పాడి‌నవి) ‌‘రావ‌ణు‌సం‌హ‌రించి’‌ మొద‌లై‌నవి.‌ ‌‘లవ‌కుశ’‌లోనే పాటలు ‌‘జయ‌జ‌య‌రామా, ‌‘ఒల్ల‌నోయి మామ ఈ పిల్లని’, ‌‘ఊరకె కన్నీ‌రు‌నింప’, ‌‘పెంపుడు కొడుకు’‌లో ‌‘మబ్బులు మబ్బు‌లొ‌చ్చనే’‌ −‌ వంటి పాటలు కొన్ని ఉదా‌హ‌రణ, సదా‌శి‌వ‌బ్రహ్మం అన్ని రకాల పాటలూ రాశారు.‌ భక్తి, శృంగారం, హాస్యం, విషాదం వంటి‌వన్నీ రాశారు.‌

ఆయన 1968లో దివం‌గ‌తు‌ల‌యారు.‌ 1966లో ‌‘విజ‌య‌చిత్ర’‌ ఆరం‌భ‌మ‌యాక, 1967లో ఆయన గురించి రాయా‌లని ప్రయ‌త్నాలు చేస్తే ఆయన మద్రా‌సులో ఉండ‌డం‌లే‌దని తెలి‌సింది.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.