అప్పటికే కోమాలో సావిత్రి.. గొంతు పెగలక విజయనిర్మల
విజయ నిర్మల, సావిత్రి.. ఇద్దరూ చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అగ్ర నటీమణులు. దర్శకత్వంలోనూ ఇద్దరిదీ అందెవేసిన చేయి. ఇద్దరూ ఈ ఇండస్ట్రీని శోక సంద్రంలోకి నెట్టి వెళ్లిపోయారు. బుధవారం అర్ధరాత్రి విజయ నిర్మల గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మలకు సావిత్రి అంటే ఎంతో అభిమానం. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘కవిత’లో సావిత్రి.. విజయ నిర్మలకు తల్లి పాత్రలో నటించారు. తనకు సావిత్రి అంటే ఎంత ఇష్టమో ఒకానొక సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు.


‘నేను తెరకెక్కించిన తొలి సినిమా ‘కవిత’. ఇందులో సావిత్రి నాకు అమ్మ పాత్రలో నటించారు. సినిమాకు నేను దర్శకత్వం వహిస్తున్నానని తెలియగానే నటించడానికి వెంటనే ఒప్పుకొన్నారావిడ. ‘విచిత్ర కుటుంబం’ సినిమా ద్వారా సావిత్రి అక్కకు చెల్లెలిగా నటించే అవకాశమూ దక్కింది. ఇందులో ఎన్టీఆర్‌ నాకు బావ. ఓ సన్నివేశంలో ఆయన మారువేషంలో ఇంటికొస్తారు. మరదల్ని కాబట్టి నన్ను ఆటపట్టిస్తూ.. ‘ఏం పిల్లా..’ అంటూ వీపు మీద తడతారు. పాత్రలో లీనమైవపోవడం వల్ల కావచ్చు.. కాస్త గట్టిగా తట్టారు. దాంతో నేను కిందపడిపోయారు. అప్పుడు సావిత్రి అక్క వచ్చి నన్ను పైకి లేపారు. ‘అంత బలహీనంగా ఉంటే ఎలాగమ్మా.. కాస్త తిను. నాలాగా ఉండాలి’ అంటూ బుజ్జగించారు’

‘సావిత్రక్కను అయినవారే మోసం చేశారు. చివరి రోజుల్లో చిన్నా చితకా పాత్రల్లో నటించారు. ‘నువ్వు ఇప్పటికీ మంచి పాత్రల్లో నటించగలవక్కా’ అని ధైర్యం చెప్పాను. అప్పటికే ఆమెకు షుగర్‌ ఉంది. ‘ఇక నేను సినిమాలు చేయలేనురా..’ అనేవారు. బెంగళూరులో అనారోగ్యంతో కుప్పకూలిపోతే మద్రాసుకి తరలించారు. అప్పుడు సావిత్రక్కను చూద్దామని వెళ్లాను. ఆమెను ఆ స్థితిలో చూసి నా హృదయం తల్లడిల్లిపోయింది. అప్పటికే కోమా స్టేజ్‌లో ఉన్నారు. నాకు గొంతు పెగల్లేదు. సినీ పరిశ్రమలో ఆమె అనుభవించిన కష్టాలు ఏ నటీ అనుభవించలేదు’ అని బాధపడ్డారు విజయనిర్మల.

దిష్టి తీయించిన ఎన్టీఆర్‌!
‘‘భూకైలాస్‌’ చేస్తుండగా, ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు వస్తారని అనుకున్నాను కానీ, రాలేదు. ఆ తర్వాత ‘పాండురంగ మహత్మ్యం’ చేశాం. ‘కృష్ణా! ముకుందా మురారి’ పాటలో నేను కృష్ణుడిగా కనిపిస్తా. ఆ పాటను 12 రోజుల పాటు రాత్రీ పగలూ తీశారు. చివరి ఒకరోజు నీరసం వచ్చేసి కళ్లు తిరిగి పడిపోయా. ఏమైందో నాకూ తెలియదు. ఆ తర్వాత రెండు రోజులు విశ్రాంతి తీసుకుని, మళ్లీ షూటింగ్‌కు వచ్చా. రామారావుగారు పెద్ద గుమ్మడికాయ తీసుకొచ్చి కృష్ణుడికి దిష్టి తగిలిందంటూ దాన్ని నా చుట్టూ తిప్పి పగలగొట్టారు. ఆ తర్వాత సెట్‌లోకి ఎవరినీ రావద్దని చెప్పారు. కేవలం నలుగురైదుగురు మాత్రమే ఉండి మిగిలిన సన్నివేశాలను పూర్తి చేశారు. ఆయనే స్వయంగా అన్ని దగ్గరుండి మేకప్‌ కూడా చేయించేవారు’’ అని ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని చెప్పేవారు విజయ నిర్మల. 

విజయ నిర్మలకు సినీ ప్రముఖ నివాళి
చిత్రమాలిక కోసం క్లిక్‌ చేయండిసంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.