అమితాబ్‌ కెరీర్‌కి ఊతం ‘జంజీర్‌’

ఆకాశమంత కీర్తి... భూగోళమంత ప్రతిష్ట... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా రెడ్‌ కార్పెట్‌ స్వాగతాలు... బిగ్‌ బి అంటూ ఆత్మీయంగా అక్కున చేర్చుకునే హృదయాలు... ఇవన్నీ ఏ ఒక్కరోజులోనో సిద్ధించలేదు. ఎంతటి విజయానికయినా సోపానాలు కచ్చితంగా ఉండే తీరుతాయి. అప్పుడెప్పుడో... కొన్ని దశాబ్దాల కిందట పొడుగ్గా సన్నగా రివటలా ఉండే ఓ యువకుడు ముంబై వీధుల్లో తిరుగుతూ సినిమాల్లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సందర్భంలో... అసలు సినిమాకే పనికిరావంటూ ఎన్నో అవమానాలు, తిరస్కారాలు ఎదురయిన తొలినాళ్ల జ్ఞాపకాల్లో. పునాదిరాళ్లను వేసి తన అభ్యున్నతికి దోహదపడిన మరో కోణం కూడా ఇవాళ ఈ మహానటుడు మనస్సు పొరల్లో తళుక్కుమంటూనే ఉంటుంది. మొదట్లో అవకాశాలు చేజిక్కించుకోవడం... తరువాత ఉనికిని నిరూపించుకోవడం... ఆ తరువాత పరిశ్రమలో ప్రగాఢ ముద్ర వేయడం... విజయం సాధించిన ఏ కళాకారుడి జీవితంలో తారసపడే దశలు. అలాంటి ఓ దశలో... అతి క్లిష్ట పరిస్థితుల్లో ఇవాళ్టి బిగ్‌బిని ఆదుకున్న చిత్రం అది. ఆ చిత్రం కేవలం ఓ నటుడి భవితవ్యానికి మార్గదర్శిగానే కాదు... అప్పటి వరకూ రొటీన్‌గా సాగిపోతున్న భారతీయ సినిమాని సైతం ఓ కుదుపు కుదిపి అనేకానేక సంచలనాలకు కారణమైన చిత్రం కూడా అదే. ఓ అమ్మాయిని కలుసుకోవడం... ప్రేమలో మునిగి తేలడంలాంటి రొమాంటిక్‌ సినిమాల తాకిడి నుంచి దారి మళ్లించి... సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ని భారతీయ సినిమాకి పరిచయం చేసిన చిత్రం అది. ఆ చిత్రమే...జంజీర్‌. 


‘జంజీర్‌’ లేకుంటే అమితాబ్‌ ఈ స్థాయికి వచ్చేవాడు కాదేమో? అన్న సందేహాల్ని కూడా కొంతమంది విమర్శకులు అభిప్రాయపడుతుంటారు. అంతలా ప్రభావితం చేసిన చిత్రం ‘జంజీర్‌’. 1973 మే 11న ఈ చిత్రం విడుదలైన సందర్భంలో ‘జంజీర్‌’ సినిమాపై విహంగ వీక్షణం.

* ‘జంజీర్‌’ నేపథ్యం

‘జంజీర్‌’ అంటే సంకెళ్లు అని అర్ధం. క్రైం యాక్షన్‌ మూవీగా తెరకెక్కించారు. ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు ప్రకాష్‌ మెహ్రా కాగా సలీం జావేద్‌ రచయితలుగా పనిచేసారు. నాయికా నాయకులుగా జయబాధురి, అమితాబ్‌ బచ్చన్, ప్రతి నాయకుడిగా ప్రాణ్, అజిత్, బిందు, ఓం ప్రకాష్, రాంసేథి తదితరులు ప్రతిభ కనబరిచిన ఈ చిత్రం ఇప్పటికీ నేరమూ పరిశోధన ఇతివృత్తంగా సినిమాలు తీసే ఔత్సాహిక దర్శకులకు సిలబస్‌ లాంటిది. బాలీవుడ్‌ సినిమాకి కొత్త దారిని చూపించిన ఈ సినిమా అమితాబ్‌ బచ్చన్‌కి కూడా సరికొత్త ఇమేజ్‌ తీసుకువచ్చింది. ‘యాంగ్రీ యంగ్‌ మాû’Âగా అమితాబ్‌ ఈ చిత్రం తరువాత నుంచి లబ్దప్రతిష్ఠులయ్యారు.


* సామాన్యుడి ధర్మాగ్రహం


అంతవరకూ ఊహాలోకాల్లో విహరిస్తూ ఆకాశ మార్గాన పయనిస్తున్న సినిమా కధలో పెను మార్పును తీసుకొచ్చిన చిత్రంగా ‘జంజీర్‌’ని పరిగణించవచ్చు. ప్రేమలు, పెళ్లిళ్లు, విరహాలు, వియోగాలు, గాఢ నిట్టూర్పులు, అర్ధరాత్రుల్లో పలవరింతలు, కలవరింతల చుట్టూ తిరిగే సినిమా కథ సామాన్యుడి సణుగుడిని కూడా గుర్తించిందని ఈ చిత్రం ఘంటాపధంగా విడమరిచి చెప్పింది. కుడి ఎడమల దగా ప్రపంచంలో ఇమడలేక, బతకలేక, చావలేక నానా హైరానా పడుతున్న సామాన్యుడి ధర్మాగ్రహాన్ని ఆవిష్కరించిన చిత్రం ఇది. ఎటు చూసినా అవినీతి నిస్సిగ్గుగా రాజ్యమేలుతున్న నేపథ్యంలో ఈ దేశంలోని సామాన్యుడి కోపం, నైరాశ్యంలాంటి భావోద్వేగాలకు కూడా స్థానం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించిన చిత్రం ‘జంజీర్‌’. ‘జంజీర్‌’ సినిమాతో దర్శకత్వంలో కూడా పెను మార్పులు వచ్చాయి. చెప్పాల్సిన విషయాన్ని కాస్త కటువుగా, దూకుడుగా...అంతకు మించి హింసాత్మకంగా కూడా చెప్పొచ్చనే థీరీని ఆవిష్కరించిన చిత్రంగా ‘జంజీర్‌’కి ప్రశంసలు దక్కాయి.


* నటుడిగా అమితాబ్‌లో మరో కోణం

అమితాబ్‌లోని మరో నటుడి విశ్వరూపాన్ని తొలిసారి చూపించిన చిత్రం కూడా ఇదే. అన్యాయాలు, అక్రమాలు సహించలేని ఓ కధానాయకుడిగా అమితాబ్‌ ఇందులో కనిపిస్తారు. తాను నమ్మిన నైతిక విలువలవైపు నిల్చుని... కళ్లెదుట జరిగే అవినీతిని ఆధఃపాతాళానికి తొక్కేసే నైజం ఉన్న హీరో ‘జంజీర్‌’ హీరో. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం వీర విహారం చేసిన ‘జంజీర్‌’ అమితాబ్‌ కెరీర్‌లో ఎప్పటికి ప్రత్యేకత సంతరించుకున్న చిత్రం ఇది. కమర్షియల్‌గా సూపర్‌ డూపర్‌ హిట్‌. ఈ చిత్రం తరువాత అమితాబ్, సలీం జావేద్‌ కాంబినేషన్‌లో పలు చిత్రాలు రూపొందాయి. అలా కొత్త సమీకరణాలకు కూడా ‘జంజీర్‌’ సినిమా తెరలేపింది. వీరి కాంబినేషన్‌లో ఆ తరువాత వచ్చిన చిత్రాలే ‘దీవార్‌’, ‘షోల’ే. ఈ చిత్రాలు సృష్టించిన సంచలన విజయాలు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.


                                   


* దక్షిణాది సినిమాపై ప్రభావం

బాలీవుడ్‌లోనే కాదు...దక్షిణాది సినీ పరిశ్రమపై కూడా ‘జంజీర్‌’ ప్రభావం చూపించింది. తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్, తెలుగులో అగ్ర హీరో ఎన్టీఆర్‌... ఇలా ‘జంజీర్‌’ సినిమా ప్రభావం పడని హీరోలే అప్పట్లో లేరంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్‌ ‘నిప్పులాంటి మనిషి’ పేరుతో ‘జంజీర్‌’ తెలుగు అనువాదంలో నటించారు. ఆ సినిమా కూడా విజయం సాధించింది.* ‘జంజీర్‌’ కథా కమామిషూ

‘జంజీర్‌’ సినిమా ప్రారంభంలోనే జంట హత్యలు జరుగుతాయి. ఈ ఘటనలో చిన్నారి విజయ్‌ ఖన్నా తల్లి తండ్రులను కోల్పోతాడు. అప్పటి నుంచి, మేలుకున్నా, పడుకున్నా ఈ దారుణం గుర్తొచ్చి రగిలిపోతుంటాడు. తోటి పిల్లలతో కలవలేని ఒంటరి తనం. తల్లితండ్రులను కోల్పోయిన బాధాతప్త హృదయం... పీడకలలతో నిదురకు దూరమైన రాత్రులు అతి భారంగా గడుపుతూ పెరిగి పెద్దవాడవుతాడు. తల్లితండ్రుల హత్య జరిగిన సమయంలో... ఓ బ్రాస్లెట్‌ మీద తెల్ల గుర్రం ముద్ర వేసుకున్న అపరిచితుడిని చూస్తాడు. అదే... విజయ్‌ ఖన్నాకు లభించిన ఒకానొక ఆధారం. ఆ ఆధారంతోనే తల్లి తండ్రుల్ని హతమార్చిన విలన్‌పై పగ తీర్చుకోవాలి. ఇరవై సంవత్సరాల తరువాత ...విజయ్‌ ఖన్నా పోలీస్‌ ఆఫీసర్‌గా వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. ఇన్స్‌పెక్టర్‌గా తను పనిచేస్తున్న ప్రాంతంలో అరాచక ముఠా ఆగడాలు నిరోధించడం... వారు నిర్వర్తిస్తున్న జూద గృహాలు మూసివేయించడంలాంటి కార్యక్రమాలు చేస్తుంటాడు. అలాగే... ఎక్కడ ఏ తప్పు జరిగినా అక్కడ ప్రత్యక్షమై తగు చర్యలు తీసుకుంటాడు. ఈ విధుల నిర్వహణలో ఓ అజ్ఞాత వ్యక్తి విజయ్‌ ఖన్నాకు ఫోన్‌ ద్వారా విలువయిన సమాచారం అందిస్తూ ఉంటాడు. ఎక్కడ ఏ నేరం జరుగబోతోందో అతడి వల్ల ముందుగానే తెలుస్తుంటుంది. ఈ నేపథ్యంలో రోడ్‌ ప్రమాదం జరగడం... ఆ ప్రమాదంలో చాలామంది చిన్నారులు బాలి కావడం... ఈ ఘటనకు సాక్షి అయిన నాయిక జయబాధురి విషయాన్ని వివరించేందుకు నిరాకరించడం... తరువాత విజయ్‌ ఖన్నా మనసు అర్ధం చేసుకుని అసలు విషయాలు... ఆ ప్రమాదం వెనుక ఉన్న అజ్ఞాత వ్యక్తుల గురించి చెప్పడం... ఇలా ఉత్కంఠ భరితంగా సాగే కధలో... చివరికి తన తల్లి తండ్రులను హతమార్చిన వ్యక్తి జాడ తెలుసుకుని పగ తీర్చుకోవడం... ఇదీ స్థూలంగా ‘జంజీర్‌’ కథ. చిత్రం ప్రదర్శనాకాలం 147 నిముషాలు. సంగీతం: కళ్యాణ్‌ జీ, ఆనంద్‌ జీ, సినిమాటోగ్రఫీ: ఎన్‌. సత్యన్‌.


- పి.వి.డి.ఎస్‌. ప్రకాష్‌ 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.