మా అమ్మ కథానాయిక కాకున్నా..

‘‘మా అమ్మ కథానాయిక కాకపోయినప్పటికీ ఇంతకాలం మీ ప్రేమాభిమానాలతో నన్ను ఎంతో ఆదరించినందుకు ధన్యవాదాలు’’ అంటోంది నటి అదా శర్మ. ‘1920’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ‘హర్ట్‌ ఎటాక్‌’, ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’, ‘క్షణం’ వంటి హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఇప్పుడీ మద్దుగుమ్మ ‘మోహ్‌’ అనే బాలీవుడ్‌ మూవీలో నటించేందుకు పచ్చజెండా ఊపిందట. కబీర్‌ థాపర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కెవిన్‌ కైలాశ్‌ ముత్తయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది అదా. ‘‘నేను నటించిన ‘1920’, ‘హర్ట్‌ఎటాక్‌’, ‘క్షణం’ సినిమాల్లో నా పాత్ర నచ్చినవారందరికీ ఇప్పుడు నేను నటిస్తున్న ‘మోహ్‌’ చిత్రం కూడా తప్పకుండా నచ్చుతుంది. మా అమ్మ హీరోయిన్‌ కాకపోయినా ఇంత కాలంగా నన్ను మీరు ఎంతగానో ఆదరించారు. కేవలం మీ వల్లే నేను నా కలల్ని సాకారం చేసుకుంటూ ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశాలు అందుకోగలుగుతున్నా’’ అని ప్రచార చిత్రానికి ఓ వ్యాఖ్యను కూడా జత చేశారు. అయితే ఇందులో అదా ‘‘మా మమ్మీ హీరోయిన్‌ కాకపోయినా’’ అని ప్రత్యేకంగా ప్రస్తావించడం నెట్టింట అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఒక రకంగా బాలీవుడ్‌లో వేళ్లూనుకుపోయినా బంధుప్రీతి అంశాన్ని పరోక్షంగా ఇలా ప్రస్తావించింది అదా. ఈ ట్వీట్‌ విషయంలో నెటిజన్ల నుంచి ఆమెకు మంచి మద్దతు లభిస్తోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.