జక్కన్నను ఒక్క ఛాన్స్‌ ఇమ్మని అడిగా


బా
లీవుడ్‌లో ఇప్పుడు ఆలియా భట్‌ హవా నడుస్తోంది. ఓ పక్క విజయాలు... మరో పక్క భారీ చిత్రాల్లో అవకాశాలతో ఆలియా జోరు మీదుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘బ్రహ్మాస్త్ర’, ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’, ‘ఇన్‌షా అల్లా’ చిత్రాలున్నాయి. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’, సల్మాన్‌ కథా నాయకుడిగా సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘ఇన్‌షా అల్లా’ చిత్రాల్లో నటించే అవకాశం తనకు వస్తుందని ఆలియా అస్సలు ఊహించలేదట. ‘‘ఇద్దరూ గొప్ప దర్శకులే. వాళ్లు చేసే పనిమీద ఎంతో ముందు చూపు ఉన్న దర్శకులు వాళ్లు.  సృజనాత్మకత విషయంలో వాళ్లిద్దరి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేద’’ని ప్రశంసించింది ఆలియా. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’తో తొలిసారి తెలుగు తెరపై కనిపించనుంది ఆలియా. అందుకోసం తెలుగు కూడా నేర్చుకుంటోంది. ‘‘తెలుగు పాఠాలు కష్టంగానే ఉన్నా త్వరగానే నేర్చుకుంటున్నాన’’ని చెప్పిందామె. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అవకాశం తనకు ఎలా వచ్చిందో చెబుతూ.. ‘‘ఓ రోజు ఎయిర్‌పోర్ట్‌లో రాజమౌళి సార్‌ను కలిశాను. ‘మీరు తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ఎలాంటి పాత్ర ఇచ్చినా నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓ అవకాశం ఇవ్వండి’ అని ఆయన్ని అడిగాను. అప్పటికి ఇంకా కథానాయికల ఎంపిక కూడా పూర్తి కాలేదు. నాకు కాల్షీట్లకు ఇబ్బంది ఉండదు. అన్నింటినీ సర్దుబాటు చేసుకుంటా అని ఆయనతో చెప్పాను’’అంది ఆలియా.


చిన్ననాటి కల... భన్సాలీ సినిమా

లియాకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు భన్సాలీ ‘బ్లాక్‌’ సినిమా ఆడిషన్స్‌లో పాల్గొని తిరస్కరణకు గురైంది. ‘‘భన్సాలీ సార్‌తో పనిచేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ‘భన్సాలీ ఓ సినిమా చేస్తున్నారు. అందులో నటించమని నన్ను అడుగుతారు’ అంటూ కలలు కనేదాన్ని. నిజంగా ఆయన నా దగ్గరకు వచ్చి ‘ఇన్‌షా అల్లా’లో నటించమని అడగ్గానే ఆనందానికి అవధుల్లేవు’’అని చెప్పింది ఆలియా. సల్మాన్‌తో తొలిసారి ఆడిపాడనుంది ఆలియా. ‘‘సల్మాన్‌..నా కాంబినేషన్‌ ఎలా ఉండబోతోందనే విషయం ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. భన్సాలీ తనదైన శైలి ప్రపంచాన్ని  ఈ చిత్రంలో చూపిస్తారు. అన్ని రకాలుగానూ ఇద పర్‌ఫెక్ట్‌ చిత్రం’’అంది ఆలియా. 

ఆమీర్‌ సినిమా... చర్చలో దశలో

ధ్యాత్మిక గురువు రజనీష్‌ ఓషో కథతో ఓ చిత్రం తెరకెక్కబోతోందని....అందులో ఆమీర్‌ ఖాన్‌ సరసన ఆలియా నటిస్తుందని వార్తలొస్తున్నాయి. దాని గురించి చెబుతూ ‘‘ప్రస్తుతం అది చర్చల దశలో ఉంది. ఇంకా ఏదీ ఖరారు కాలేదు’’అంది ఆలియా.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.