రౌడీ హీరోపై మనసు పారేసుకున్న ఆలియా

తెలుగు చిత్రసీమ రౌడీ కథానాయకుడు విజయ్‌ దేవరకొండకు ఇటు దక్షిణాదిలోనే కాక అటు ఉత్తరాదిలోనూ మంచి క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేయన్నప్పటికీ అతనిపై క్రేజ్‌ మాత్రం అక్కడ ఆకాశమంత ఎత్తుకు చేరుకుంటోంది. ఈ అభిమానం అక్కడి సినీప్రియులకి మాత్రమే పరిమితం కాదు.. బాలీవుడ్‌లోని స్టార్‌ కథానాయికలు సైతం దేవరకొండ మత్తులో ఊగిపోతున్నారు. ఆయనతో కలిసి పని చేసే అవకాశం కోసం జాన్వీ కపూర్‌, సారా అలీఖాన్ వంటి యువ తారకలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే విజయ్‌పై మనసు పారేసుకున్న బాలీవుడ్‌ కథానాయికల జాబితాలో ఇప్పుడు ఆలియా భట్‌ కూడా చేరిపోయింది. తాజాగా ఈ భామ ముంబయిలో జరిగిన ఫిలిం ఫేర్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనగా అక్కడ ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. ‘‘2019లో మీ ఫేవరెట్‌ స్టార్‌ ఎవరు’’ అంటూ వేదికపైనున్న యాంకర్‌ ఆలియాను ప్రశ్నించగా.. ఆమె ఏ మాత్రం తడుముకోకుండా ‘‘నా దృష్టిలో విజయ్‌ దేవరకొండ మోస్ట్‌ గ్లామరస్‌ యాక్టర్‌’’ అని బదులిచ్చి బాలీవుడ్‌ సినీ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఏదేమైనా ఆలియా చెప్పిన దాన్ని బట్టి చూస్తే రౌడీతో చేసే అవకాశం రావాలే కానీ, ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేస్తుందని అర్థమైపోతుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.