అలియా ఆగమనం ఆలస్యం

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. విప్లవ వీరులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న ఫిక్షనల్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ కనిపించనుండగా.. అల్లూరిగా రామ్‌చరణ్‌ దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక పోరాట ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈనెలలోనే కథానాయిక ఆలియా ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఇప్పుడామె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూబాయ్‌ కథియావాడి’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబయిలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఈనెల తొలి వారంలోనే ముగియాల్సి ఉంది. ఇప్పుడీ షెడ్యూల్‌ను మరో రెండు వారాలు పొడిగించారట భన్సాలీ. ఈ నేపథ్యంలోనే ఆలియా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అడుగుపెట్టడం మరింత ఆలస్యమవుతోందని సమాచారం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.