వేదికపైనే ఏడ్చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌‌’ భామ

బాలీవుడ్‌ బబ్లీ గర్ల్‌, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ముద్దుగుమ్మ ఆలియా భట్‌ తాజాగా ఓ కంటతడి పెట్టించే విషయాన్ని పంచుకుంది. ఓ దశలో తన భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక వేదికపైనే వెక్కివెక్కి ఏడ్చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి ఈ సొట్టబుగ్గల చిన్నది అలా కన్నీటి పర్యంతమవడానికి కారణమేంటంటే.. తన సోదరి ఆరోగ్య పరిస్థితే. ఆలియా సోదరి షహీన్‌ కొన్నేళ్ల క్రితం తీవ్ర ఒత్తిడి (డిప్రెషన్‌)తో బాధపడ్డదట. తర్వాత దానికి చికిత్స తీసుకున్నాక కోలుకుందట. ఈ నేపథ్యంలో తాను డిప్రెషన్‌తో ఎలా పోరాడింది.. ఆ సమయంలో తన అనుభవాలేంటి వంటి అంశాలను వివరిస్తూ.. ‘ఐ హావ్‌ నెవర్‌ బీన్‌ హ్యాపీయర్‌’ అనే పుస్తకాన్ని రచించింది షహీన్‌. ఈ పుస్తకాన్ని తాజాగా ఆలియా ముంబయిలో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆమె తన సోదరి ఒత్తిడితో ఎలా బాధపడిందో చెప్తూ తీవ్ర భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఏడ్చేసింది. ‘‘నేనెప్పుడూ ఒత్తిడితో బాధపడలేదు. కానీ, ఏదో తెలియని ఆత్రుతకు గురయ్యేదాన్ని. అయితే అక్క పరిస్థితి చూసి కొన్నాళ్లుగా నేనెంతో బాధపడ్డా. ఎట్టకేలకు తను ఆ ఒత్తిడిని జయించి మామూలు మనిషి అయినందుకు చాలా సంతోషమేసింది. తను రాసిన ఈ పుస్తకం చదివాకే ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది’’ అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్వేగానికి గురైన ఆలియా వేదికపై చిన్నపిల్లలా కన్నీరుమున్నీరైంది. పక్కనే ఉన్న షహీన్‌.. ఆలియాను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ చాలా సేపటి వరకు ఆమె అలాగే ఉండిపోయింది.
View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.