పిల్లల్ని కనడానికి విరామం అవసరం లేదు

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ గత కొంతకాలంగా కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదు. ఈ విరామ సమయాన్ని ఆమె పిల్లల్ని కనడం కోసమే తీసుకొందని కొన్నాళ్ల నుంచి వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన అనుష్క..‘‘పిల్లల్ని కనాలంటే సినిమాలు చేయకుండా విరామం తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం నాకు నచ్చిన కథలు దొరక్కపోవడం చేతనే ఇలా చేస్తున్నా. నేను తొలి నుంచి డబ్బుకోసమే చిత్రసీమలోకి అడుగుపెట్టలేదు. సినిమా అంటే నాకు పిచ్చి. ఆ పిచ్చితోనే నచ్చిన సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నా. నాకు నచ్చిన కథ వస్తే, నటించడంతో పాటు, చిత్రాలను నిర్మిస్తాను. అయినా వ్యక్తిగత విషయాలను బయటకి చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల్ని ఎప్పుడు కంటాననే విషయంపై మా ఇంట్లో వాళ్లకంటే వేరేవారికి బాగా ఆసక్తి ఉన్నట్లు ఉంది. అయినా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా వారికి వ్యక్తిగత జీవితం, కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోవాలని’’ చెప్పింది. అనుష్కకి క్రికెట్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లితో 2017 డిసెంబర్‌లో పెళ్లైయ్యింది. 2018లో వచ్చిన ‘జీరో’ చిత్రం తరువాత 2019లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ ఏడాది కేవలం ‘అంగ్రేజ్‌ మీడియం’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో మాత్రమే కనిపించింది. ఇర్ఫాన్‌ ఖాన్, కరీనా కపూర్, డింపుల్‌ కపాడియాలు కలిసి నటించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 13న విడుదలైంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.