దీపిక మనసు చదివేసింది..

‘‘దీపిక ఎంత అందంగా కనిపిస్తుందో.. ఆమె మనసు కూడా అంతే అందమైనది’’ అంటోంది బాలీవుడ్‌ బబ్లీ గర్ల్‌ ఆలియా భట్‌. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు నచ్చిన నటి దీపిక పదుకొణె అని చెప్పింది. ‘‘దేవుడు ఎంతో ప్రేమ, సహనాలతో మరింత సమయం వెచ్చించి మరీ దీపిక పదుకొణెను సృష్టించాడు. ఆమె ఎంత అందంగా కనిపిస్తుందో.. ఆమె మనసు కూడా అంతే అందమైనది’’ అంటూ దీపికపై ప్రేమ కురిపించింది. ప్రస్తుతం ఆలియా దీపిక భర్త రణవీర్‌ సింగ్‌తో కలిసి ‘గల్లీబాయ్స్‌’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జºయ అక్తర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇదే సమయంలో అలియా తన ప్రియుడు రణ్‌బీర్‌ సింగ్‌తో కలిసి ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తోంది. ఇలా ఒకే సమయంలో అటు రణ్‌వీర్‌ ఇటు రణ్‌బీర్‌లతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది అని ఆలియాను ప్రశ్నించగా.. ‘‘వారిద్దరి మధ్య చాలా పోలికలున్నాయి. కానీ, ఒక తేడా ఉంది. అందేంటంటే.. నేను ఒకరితో ‘గల్లీబాయ్‌’లో మరొకరితో ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తుండటమే’’ అని సరదాగా వ్యాఖ్యానించింది. ఆ మధ్య రణ్‌వీర్‌.. తనకు ఇష్టమైన నటుడు రణ్‌బీర్‌ అంటూ తన సతీమణి మాజీ ప్రియుడిపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రణబీర్‌ ప్రియురాలు ఆలియా కూడా తనకు నచ్చిన నటి దీపిక అంటూ ప్రశంసల్లో ముంచెత్తడం సినీప్రియులను ఆకట్టుకుంటోంది. త్వరలోనే రణ్‌వీర్‌ - దీపిక జంటగా ‘83’లో నటించబోతున్నారు. పెళ్లి తర్వాత వారిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. ఇదిలా ఉండగా.. దీపిక ప్రధాన పాత్రలో ‘ఛపాక్‌’ అనే సినిమా చేస్తోంది. యాసీడ్‌ దాడిలో గాయపడి లక్ష్మీ అగర్వాల్‌ జీవితకథతో ఈ చిత్రం రూపొందుతోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.