కరోనాపై పోరాటానికి¨ కంగనా 25 లక్షల విరాళం

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కారణంగా ఇండియా మొత్తం 21రోజులు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఈ సమయంలో ఎంతోమంది అసంఘటిత కార్మికులు రోజుగడవని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారికోసం ఇంకా కరోనా బాధితుల కోసం బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తన వంతుగా 25 లక్షల రూపాయలు విరాళం పీఎమ్‌-కేర్స్ కు ఇచ్చింది. అంతేకాకుండా రోజువారి కూలీల కోసం రేషన్‌ను అందించింది కంగనా. ఈ సందర్భంగా కంగనా సోదరి రంగోళి ట్విట్‌ చేస్తూ..‘‘మా అమ్మ ఆశా రనౌత్‌ తన నెల పెన్షన్‌ కూడా వదులుకుంది. ఈ లాక్‌డౌన్‌ ఎంత కాలం ఉంటుందో చెప్పలేం. మన దగ్గర ఉన్నదానితో జీవించాల్సిన అవసరం ఉంది. కానీ మనం దేశానికి ఎంతోకొంత సాయం చేయాలి. అందరికి ధన్యవాదాలు అంటూ’’ పేర్కొంది. రంగోలికి సోదరి కంగనా రౌనౌత్‌ అంటే ఎనలేని ప్రేమ ఆమెపై ఎవరైనా కామెంట్‌ చేస్తే చాలు వారికి సరైన రీతిలో బదులు సమాధానం చెప్పేవరకు వదిలిపెట్టదు. కంగనా ప్రస్తుతం నటి, మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవితాధారంగా వస్తున్న ‘తలైవి’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇందులో ఎమ్జీఆర్‌గా అరవింద్‌ స్వామి నటిస్తున్నారు. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి విష్ణు వర్థన్‌ ఇందుకూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.