కష్టమైనా ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’ పూర్తి చేశా!

ఆమీర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’. హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ రీమేక్‌ ఇది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కరీనా కపూర్‌ నాయిక. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆగిపోయిన ఈ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ప్రస్తుతం దిల్లీలో చిత్రీకరణ జరుగుతుంది. ఈ మధ్యే కరీనా మరో బిడ్డకు జన్మనివ్వబోతుందన్న విషయం తెలిసింది. ముందు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం చిత్రీకరణ జరిగితే కరీనాకు ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఆమెకు నెలలు పెరిగే కొద్దీ షూటింగ్‌లో పాల్గొనడం కష్టమవుతుంది. అందుకే ఆమీర్‌ సలహా మేరకు కరీనా ఉండే సన్నివేశాలను ముందు పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. తాజాగా కరీనాకు సంబంధించిన షెడ్యూల్‌ పూర్తయింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. ‘‘ప్రతి ప్రయాణం ముగియాల్సిందే. ఓ విధంగా కష్టమే అయినా మా ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’లో నాకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. కరోనా ప్రభావం..నా ప్రెగ్నెన్సీ...భయం ఇవేవీ సినిమాపై నాకున్న అభిరుచిని, షూటింగ్‌ను అడ్డుకోలేక పోయాయి.’’అని ఆ పోస్ట్‌లో రాసి, ఆమీర్‌తో ఉన్న ఫొటోను పంచుకుంది కరీనా.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.