అలా ఆలోచించడం వ్యర్థం

‘సినిమాలు ఆడకపోయినా, చేతుల్లోని చిత్రాలు ఆగిపోయినా నేను పెద్దగా కుంగిపోను’ అని చెబుతోంది కృతిసనన్‌. ‘వన్‌ నేనొక్కడినే’లో మహేష్‌బాబు సరసన అందాలు ఒలకబోసిన ఈ కథానాయిక... తర్వాత బాలీవుడ్‌లో బాగా బిజీ అయింది. ‘హౌస్‌ఫుల్‌4’, ‘పానిపట్‌’, ‘లుకా చుప్పి’ చిత్రాల్లో అందంతో పాటు అభినయం చూపి ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన ఈ చిన్నదాని షెడ్యూలు ఖాళీలేనంతగా మారిపోయింది. అయితే కరోనా పరిస్థితులు అందర్నీ ప్రభావితం చేస్తున్నట్లే ఈ ముద్దుగుమ్మనూ తాకాయి. దినేష్‌ విజన్‌ నిర్మిస్తున్న చిత్రంలో కృతి రాజ్‌కుమార్‌రావ్‌తో జోడి కట్టాలి. వృద్ధ జంటను దత్తత తీసుకొనే యువ దంపతుల నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. ఈ చిత్రం మార్చిలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. లాక్‌డౌన్‌తో ఆగిపోయింది. ప్రస్తుతం దీన్ని తెరకెక్కించడానికి దినేష్‌ సుముఖంగా లేరట. ఆయన చేతిలోని మూడు చిత్రాలు రిలీజ్‌ అయ్యాకే... ఈ సినిమా గురించి ఆలోచిస్తారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై కృతిసనన్‌ను ప్రశ్నిస్తే... పై విధంగా స్పందించింది. ‘ఎప్పుడూ ముందుకు వెళుతుండాలే తప్ప.. జరగని విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చోవడం వ్యర్థమ’ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి నటించిన ‘మిమి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అక్షయ్‌కుమార్‌ సరసన ‘బచ్చన్‌ పాండే’ సినిమాలోనూ నటిస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.