ఆ లిప్‌లాక్‌లన్నీ చాలా సింపుల్‌గా చేసేశా!

‘‘ముద్దు సన్నివేశాలు చేసే సమయంలో తప్ప.. దానికి ముందు ఆ తర్వాత వాటి గురించిన ఆలోచనే ఉండదు’’ అంటోంది కియారా అడ్వాణీ. త్వరలో ఈ భామ ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. షాహిద్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. తన తెలుగు హిట్‌ మూవీ ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌గా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దీన్ని హిందీలో తెరకెక్కిస్తున్నారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఈ చిత్రంలో తెలుగు వెర్షన్‌ను తలదన్నేలా ముద్దు సన్నివేశాలను దట్టించిందట చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటల్లో.. షాహిద్‌ - కియారా మధ్య వచ్చే ఘాటైన అదరచుంబనాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలోని లిప్‌లాక్‌ల ముచ్చట గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకుంది కియారా. ‘‘చిత్ర ప్రచార వీడియోల్లో ఘాటైన ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి సీన్స్‌ ఈ చిత్రంలో లెక్కకు మించి ఉంటాయి. అయినా కూడా వాటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చాలా సింపుల్‌గా పూర్తి చేసేశాము. ఎందుకంటే ఆ ముద్దు సీన్స్‌ కూడా కథలో ఒక భాగంగానే ఉంటాయి. కాబట్టి వాటికి ఎక్కువ కష్టపడాల్సింది ఏముంటుంది. లిప్‌లాక్‌ సీన్స్‌ చిత్రీకరణ సమయంలో తప్ప.. దానికి ముందు ఆ తర్వాత నాకు వాటి గురించిన ఆలోచనే ఉండదు. మరో విషయమేంటంటే అలాంటి సన్నివేశాలను చాలా తేలికగా షూట్‌ చేసేయడం వల్ల ఆ తర్వాత వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం రాలేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్‌ 21న థియేటర్లలోకి రాబోతుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.