`ఆర్‌.ఆర్‌.ఆర్‌`లో ప‌రిణీతి ఉందా లేదా?

చేస్తున్న‌ట్టు చెప్ప‌లేదు... చేయ‌డం లేద‌నీ ఖ‌రారు చేయ‌లేదు. ఈ వారం రోజుల్లో మీకే తెలుస్తుంద‌ని మాత్రం సెల‌విచ్చింది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` గురించి క‌థానాయిక ప‌రిణీతి స్పందించిన విధానం ఇదీ. దేశం మొత్తాన్ని ఆక‌ర్షిస్తున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లో క‌థానాయిక‌లు ఎవ‌ర‌న్న‌ది మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది. రాజ‌మౌళి, ఆయ‌న బృందం మొత్తం మీడియా ముందుకొచ్చి `ఆర్‌.ఆర్‌.ఆర్‌` గురించి ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేయ‌బోతోంది. అందులో తార‌ల వివ‌రాలు మొద‌లుకొని... సినిమా నేప‌థ్యం, క‌థ‌, బిజినెస్‌, విడుద‌ల తేదీ వ‌ర‌కు ప‌లు విష‌యాలు బ‌య‌టికొచ్చే అవకాశాలున్నాయి. క‌థానాయిక‌ల వివ‌రాల్ని రాజ‌మౌళి ప్ర‌క‌టించేలోగానే బ‌య‌ట పెట్టాల‌ని బాలీవుడ్ మీడియా ప్రయ‌త్నించింది. ఎప్ప‌ట్నుంచో ప్ర‌చారంలో ఉన్న భామ ప‌రిణీతి చోప్రా తార‌స‌ప‌డిన‌ప్పుడు `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లో న‌టిస్తున్నారా లేదా అని అడిగింది. ఆ ప్ర‌శ్న‌కి ఆమె అవున‌ని చెప్ప‌లేదు, లేద‌నీ చెప్ప‌లేదు. `నేనేం చేయ‌బోతున్నాన‌నేది ఈ వారంలో తెలుస్తుంది` అని మాత్రం చెప్పింది. రాజ‌మౌళి ప్రెస్‌మీట్ పెడుతున్న విష‌యం తెలిసీ, ఎలాగో ఆయ‌న ప్ర‌క‌టిస్తారు క‌దా అనే ఆమె ఆ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేదా? లేక ఆమె న‌టించ‌డం లేదు కాబ‌ట్టే ఏమీ చెప్ప‌లేదా అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది. ప‌రిణీతి చోప్రాతో పాటు, అలియాభ‌ట్ `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లో న‌టించ‌బోతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముందన్న‌ది రేపు తేల‌నుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.