స్వర్గంలో ఉన్నానా? ఓ వైపు ‘సాహో’ మరోవైపు ‘చిచ్చోరే’

'సాహో' ఫలితం విషయంలో చాలా సంతోషంగా ఉన్నానంటుంది బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధా కపూర్‌. ప్రభాస్‌కు జోడీగా ఆమె నటించి మెప్పించింది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 30న విడుదలై, మిశ్రమ రివ్యూలు అందుకుంది. కానీ, బాక్సాఫీసు వద్ద మాత్రం విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.424 కోట్ల కంటే ఎక్కువ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. తాజాగా ఈ చిత్రం గురించి శ్రద్ధా మీడియాతో మాట్లాడారు. ''సాహో' నా సినీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. కేవలం హిందీలోనే రూ.150 కోట్లకంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఇందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరోవైపు నేను నటించిన 'చిచ్చోరే' కూడా బాక్సాఫీసు వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. నేను స్వర్గంలో విహరిస్తున్నట్లు ఉంద'ని అభివర్ణించారు. 'చిచ్చోరే'లో బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కథానాయకుడిగా నటించారు. నితీశ్‌ తివారీ దర్శకుడు. స్నేహితులు, కాలేజీ చుట్టూ సాగే కథాంశం ఇది. సెప్టెంబరు 6న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.