శ్రీదేవి పాత్రలో నటించడం ఆనందంగా ఉంది: శ్రద్ధా కపూర్‌

‘సాహో’ చిత్ర కథానాయిక శ్రద్ధా కపూర్‌ అలనాటి నటి శ్రీదేవి నటించిన పాత్రలో కనిపించనుంది. ‘లుకా చుప్పీ’ దర్శకుడు విశాల్‌ ఫ్యూరియా దర్శకత్వంలో ‘నాగిన్‌’ అనే చిత్రం రూపొందుతోంది. చిత్రాన్ని నిఖిల్‌ ద్వివేది నిర్మిస్తున్నారు. 1986లో హర్మేష్‌ మల్హోత్రా దర్శకత్వంలో వచ్చిన ‘నాగిన’ చిత్రంలో శ్రీదేవి అలరించింది. అంతకు ముందు నాగిన్‌ పాత్రల్లో రీనారాయ్‌, రేఖాలాంటి తారలు కూడా నటించారు. ప్రస్తుతం విశాల్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం గురించి శ్రద్ధా కపూర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘తెరపై నాగిన్ పాత్రలో కనిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాటి నటి శ్రీదేవి మేడమ్‌ నటించిన ‘నాగిన’ చిత్రాన్ని చూస్తూ పెరిగాను. అంతేకాదు ఆ పాత్రపట్ల ఎంత మమకారం కూడా ఉంది. భారతీయ సాంప్రదాయ జానపదకథల్లోని, ఇలాంటి గొప్ప పాత్రను పోషించాలి అనుకుంటున్నాను. ప్రేక్షకులకు ఇలాంటి పాత్రలు ఎల్లప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని..’’ పేర్కొంది. శ్రద్ధా ఈ ఏడాది ఆరంభంలో రెమో డిసౌజా దర్శకత్వంలో వచ్చిన ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డి’ వరుణ్‌ ధావన్, ప్రభుదేవాలతో కలిసి నటించి అలరించింది. చివరగా టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి ‘భాఘి 3’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర ఘనమైన వసూళ్లు సాధించింది. లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండిపోయిన శ్రద్ధా కపూర్‌ ఆ మధ్య తన ప్రియుడైన
రోహాన్‌ శ్రేష్టతో కలిసి స్కూటీపై షికార్లు చేస్తున్న ఫోటో నెట్టింట హల్‌చల్‌ చేసింది. ఫోటోగ్రాఫర్‌ రోహన్‌ శ్రేష్టతో సంవత్సర కాలం నుంచి డేటింగ్‌లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు బహిరంగంగా తమ బంధాన్ని మాత్రం ఎక్కడా చెప్పిన దాఖాలాలు కనిపించలేదు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.