మరోసారి ట్వీట్‌తో గుండె తడి చేసింది!
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మా ఇంట్లో గణేష్‌ చతుర్థి పూజ జరిగింది. కాని ఈసారి నేను అక్కడ లేను’’ అంటూ ట్విట్టర్‌ వేదికగా అభిమానుల ముందు భావోద్వేగానికి గురైంది నటి సోనాలి బింద్రే. తెలుగు, హిందీ చిత్రసీమల్లో అనేక హిట్‌ చిత్రాల్లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకున్న సోనాలి బింద్రే.. కొంత కాలంగా హైగ్రేడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె క్యాన్సర్‌ వ్యాధి చికిత్సలో భాగంగా న్యూయార్క్‌లో కీమో థెరపీ చేయించుకుంటున్నారు. ఎంతో ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు సోనాలి. అయితే వినాయక చవితి సందర్భంగా సోనాలి చేసిన ఓ భావోద్వేగపు ట్వీట్‌.. అభిమానుల హృదయాలను ద్రవింపజేసింది. ‘‘నాకు ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చతుర్థి. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా మా ఇంట్లో గణేష్‌ చతుర్థి పూజ జరిగింది. కాని, నేను ఈసారి అక్కడ లేను. ఈసారి వినాయక చవితి వేడుకలను మిస్‌ అవుతున్నా. అయినా పర్వాలేదు.. నాకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, సంతోషాలతో మీ జీవితాలు సాగాలని కోరకుంటున్నా’’ అంటూ ట్వీట్‌లో భావోద్వేగానికి గురయ్యారు. ఈ పోస్ట్‌తో పాటు తన కొడుకు రణ్‌వీర్‌ వినాయక చవితి జరుపుకుంటున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దీనికి నెటిజన్ల నుంచి భారీగా స్పందన వచ్చింది. సోనాలి త్వరగా కోలుకోవాలని.. వచ్చే ఏడాది ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చతుర్థిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆమెకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.