ఆ సమయంలో ఎన్నో బాధలు అనుభవించాను


ప్రతి మనిషి జీవితంలో సినిమా అనేది ఒక వినోదం అయితే. కొంతమందికి ఆ సినిమాల్లో నటీనటులుగా ప్రేక్షకులను అలరించాలని కలలు కంటుంటారు. అయితే వెండితెర తారలుగా అవకాశాలు పొందడం చాలా కష్టం. అలా కష్టాలన్నీ దాటుకొని నటిగా ఎదిగింది తాప్సీ. బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం చిత్రసీమను కుదిపేసినట్లైయింది. అయితే సినిమాల్లో బంధుప్రీతి కారణంగానే సుశాంత్‌ చనిపోయాడనే వార్తపై సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చలు నడుస్తున్నాయి. ఈ అంశంపై నటి తాప్సీ మాట్లాడుతూ..‘‘చిత్రసీమలో నేను కూడా ఒక బాధితురాలినే. నా కుటుంబంలో సినిమాకి సంబంధించిన వారెవ్వరూ లేరు. మామూలుగా చిత్రసీమకు సంబంధించిన వారసులకు సినీరంగ ప్రేవేశం తొందరగా లభిస్తాయి. కానీ చిత్రసీమతో ఎటువంటి సంబంధాలు లేనివారికి నటించే అవకాశం అంతా ఈజీగా రాదు. వచ్చినా చాలా సమయం పడుతోంది. దర్శకులు కూడా కొత్తవారికి అవకాశాలు ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపరు. సినీ వారసులతో తీయడానికే వాళ్లు మొగ్గుచూపుతుంటారు. దాంతో నాకు చిత్రసీమలో తొలినాళ్లలో నటించే అవకాశం రావడానికి చాలా సమయం పట్టింది. ఆ సందర్భంలోనే ఎన్నో బాధలు కూడా అనుభవించాను. అవి మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా ప్రేక్షకులు కూడా కొత్తవారి కంటే వారసత్వానికే ఎక్కువగా పట్టం కడుతుంటారు. ఇది కూడా ఓ కారణం కావచ్చునని..’’ చెబుతోంది. తాప్సి గత ఏడాది తెలుగు, తమిళంలో వచ్చిన ‘గేమ్‌ ఓవర్‌’ చిత్రంలో నటించింది. హిందీలో ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రంలో క్రితికా అగర్వాల్‌గా మెప్పించింది. తాప్సి ప్రస్తుతం ‘హసీన్‌ దిల్‌రుబా’లో విక్రాంత్‌ మాస్సేతో కలిసి నటిస్తోంది. తమిళంలో ‘జన గణ మన’ చిత్రంలో నటిస్తోంది. 




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.