నటించాలని ఉంది... కానీ అవకాశాలు అడగను!

మీటూ ఉద్యమానికి బాలీవుడ్‌లో నాంది పలికిన నటి తనుశ్రీ దత్తా. కొన్ని సంవత్సరాల కిత్రం ఓ సినిమా షూటింగ్‌లో నటుడు నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడని కేసు కూడా పెట్టింది. గత సంవత్సరం కిత్రం చిత్రసీమలో ‘మీటూ’ ఉద్యమం ద్వారా మీడియా ముందొకొచ్చి సినిమాల్లో నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసింది. ప్రస్తుతం తనుశ్రీ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టాలని భావిస్తోందట. ఈ సందర్భంగా తనుశ్రీ మాట్లాడుతూ.. ‘‘నాకు ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీతో కలిసి పనిచేయాలని ఉంది. కానీ ఆయనేమో అగ్రతారలతోనో, లేకపోతే నచ్చిన నాయికానాయకులతోనో సినిమాలు చేస్తుంటారు. ఆయన చేసేది కళతో కూడిన వ్యాపారమే కదా. భన్సాలీ నన్ను నటించమని అడగడు. ఆత్మాభిమానం చంపుకొని నేను ఆయను అవకాశం ఇవ్వమని అడగలేను. ఈ మధ్య కాలంలో భన్సాలి తెరకెక్కించిన కొత్త సినిమాలను చూశాను. చాలా బాగున్నాయి. నేను చిత్రసీమకు దూరమై ఇప్పటికే పదిసంవత్సరాలు గడిచిపోయింది. మళ్లీ అవకాశాలు కావాలంటే నేను ఎవరినైనా అడగాల్సిందే. నాకు మేనేజర్లు లేరు కానీ, నాకోసం పనిచేసే మనుషులు ఉన్నారు. ఏం చేయాలన్నా నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు వస్తే ఖచ్చితంగా మరోసారి నేనేంటో నిరూపించుకుంటాను’’ అంటూ చెబుతోంది. గత కొంతకాలంగా తనుశ్రీ యుఎస్‌ నుంచి ఇండియాకి రాకపోకలు సాగిస్తుంది. సమయం అంతా రెండు దేశాల మధ్య తిరిగడానికే సరిపోతుందని కొంతమంది సినీ జనాలు చెప్పుకుంటున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.