నటినని తెలిసి నాకు ఇల్లు ఇచ్చేవారు కాదు!

‘‘ప్రజలకు నటులన్నా, వారు చేసే వృత్తి అన్నా సరైన నమ్మకం లేదు’’ అంటోంది కథానాయిక తాప్సి. తెలుగు చిత్రసీమ ద్వారా వెండితెరకు పరిచయమై.. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్‌ నాయికగా వెలుగులీనుతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ భామ హైదరాబాద్‌ నుంచి ముంబయికి మకాం మార్చిన కొత్తలో అనేక సమస్యల్ని ఎదుర్కోవల్సి వచ్చిందని ఓ ముఖాముఖీలో చెప్పుకొచ్చింది. ‘‘ముంబయికి వెళ్లిన కొత్తలో నాకంటూ ఓ అద్దె ఇంటిని వెతుక్కోవడానికి చాలా శ్రమించా. నేను ఒంటరిగా ఉండే నటిని కావడంతో ఎవరూ నాకు ఇల్లు ఇవ్వడానికి ముందుకొచ్చేవారు కాదు. దీనికి కారణమేంటంటే ప్రజలకు నటన వృత్తిపై మంచి నమ్మకం లేకపోవడమే. వారు నటీనటుల్ని చూడటానికి రూ.500 ఖర్చు చేసి థియేటర్‌కు వెళ్తారు. మమ్మల్ని నేరుగా చూడటానికి ఈవెంట్స్‌కు వస్తారు. కానీ, వారున్న సమాజంలో మేం జీవించడానికి మాత్రం ఒప్పుకోరు. మొదట్లో ఈ విషయం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. నేను దిల్లీకి చెందిన అమ్మాయిని. భౌగోళికంగా దిల్లీ, హైదరాబాద్‌ రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ, ముంబయిలో అంతా ఇరుకుగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో ఉండటం నాకు కొత్త. కాబట్టి మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు నాకంటూ ఓ ఇల్లు ఉంది. నా సోదరితో కలిసి సంతోషంగా ఉంటున్నా. నా తల్లిదండ్రులు మాత్రం ఇంకా దిల్లీలోనే ఉంటున్నారు’’ అని చెప్పుకొచ్చింది తాప్సి. ప్రస్తుతం ఈ భామ నటించిన ‘గేమ్‌ ఓవర్‌’ విడుదలకు ముస్తాబవుతోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.