ఈ సినిమా ఓ అందమైన అనుభవం

ఈమధ్య హాలీవుడ్‌పై దృష్టిసారించిన ప్రియాంక చోప్రా మూడేళ్ల విరామం తర్వాత ‘ది స్కై ఈజ్‌ పింక్‌’తో మళ్లీ బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రధాన పాత్రలో నటించడంతో పాటు ఈ సినిమా నిర్మాణంలోనూ పాలుపంచుకుందామె. సోనాలి బోస్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌లతో కలసి నిర్మించింది ప్రియాంక. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి హిందీ చిత్రమిది. అరుదైన వ్యాధితో బాధపడుతున్నా 15 ఏళ్లకే రచయిత్రిగా, మోటివేషనల్‌ స్పీకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌధరీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఫర్హాన్‌ అక్తర్, జైరా వాసిం కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నిర్మాణనంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రియాంక ఓ భావోద్వేగభరితమైన పోస్ట్‌ను ఆన్‌లైన్‌లో పంచుకుంది. ‘‘ఈ సినిమా నాకు ఎన్నో విధాలుగా ప్రత్యేకమైంది. అందరికీ తెలియాల్సిన ఓ కథకు, పాత్రకు జీవం పోయడానికి నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ సినిమా సవాల్‌తో కూడిన ఓ అందమైన అనుభవం. సోనాలి బోస్‌ నా మీద నమ్మకం ఉంచినందుకు గర్వంగా ఉంది. పది నెలల పాటు శ్రమించి ఇంతటి అందమైన సినిమాను అందించిన చిత్రబృందానికి కృతజ్ఞతల’’ని తెలిపింది ప్రియాంక. అక్టోబరు 11న ఈ చిత్రం విడుదల కానుంది. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.