ఎంత కష్టపడి నటించినా అంతే!

‘‘మహిళలు మగవారికేమీ తీసిపోరంటూ ఉంటారు. కానీ చిత్రసీమ దగ్గరకు వచ్చేసరికి హీరోహీరోయిన్ల పారితోషికంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుది’’ అని చెబుతోంది నటి తాప్సి. ప్రస్తుతం తాప్సి ‘శాండ్‌ కి ఆంఖ్‌’ చిత్రంలో భూమి ఫెడ్నేకర్‌తో కలిసి నటిస్తోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ముంబైలో జరిగిన ఓ ముఖాముఖీలో మాట్లాడుతూ..‘‘మేం ఎంత కష్టపడి నటించినా హీరోలకు ఇచ్చే పారితోషికంలో పదోవంతు మాత్రమే మాకు అందుతుంది. అందుకే నేను అడుగుతున్నా. హీరోల చిత్రాలు మాత్రమే కాదు మహిళా నేపథ్యంలో వచ్చే సినిమాలు చూసి ఆదరించండి. అప్పుడు మేము కూడా వారితో సమానంగా ముందుకు నడిచే అవకాశం ఉంటుంది. అమ్మాయిలు ఎందులోనూ తీసిపోరు. బాగా చదవండి. పెద్ద కలలు కనండి. నేను నా పన్నెండో ఏటనే నటిని అవ్వాలని నిశ్చయించుకున్నాను. కానీ మా ఇంట్లో అందరూ డాక్టర్లు, న్యాయవాదులు, ఐఐఎమ్‌ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. నేను నటిని అవుతానని ఎవరూ అనుకోలేదు. నా మొదటి చిత్రం ‘దమ్‌ లగా కే హైసా’లో నటించే నాటికి నా బరువు తొంభై కేజీలపై మాటే. అప్పుడు చాలామంది నన్ను అదోలా చూశారు. ఆ తరువాత నేను చాలా మారిపోయా. ఇప్పుడు ఇలా మీ ముందుకొచ్చి నిల్చున్నానంటే, నా మీద నాకున్న నమ్మకం’’ అంటూ చెప్పింది. ప్రముఖ మహిళా షార్ప్‌ షూటర్స్, తోడికోడళ్లైయిన చంద్రూ తోమర్, ప్రకాశీ తోమర్ల జీవితాధరంగా వస్తున్న ‘శాండ్‌ కీ ఆంఖ్‌’ చిత్రంలో తాప్సీ, భూమి ఫెడ్నేకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తుషార్‌ హీరానందిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ - నిధి పర్మార్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనురాగ్‌ కశ్యప్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం అక్టోబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.