ఒక్క చిత్రానికి రూ.120 కోట్ల పారితోషికమా!!

ప్రస్తుతం భారతీయ చిత్రసీమలో అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న సినీతారల్లో అగ్ర స్థానంలో ఉంటారు యాక్షన్‌ హీరో అక్షయ్‌కుమార్‌. గతేడాది ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న సినీప్రముఖుల జాబితాలోనూ అక్కీ దాదాపు రూ.450కోట్ల పై చిలుకు సంపాదన ఆర్జిస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. నిజానికి బాలీవుడ్‌లో ఆయన పారితోషికం ఖాన్‌ల త్రయంతో పోల్చితే తక్కువే అని చెప్పొచ్చు. కానీ, వాళ్లు ఏడాదికి ఒక్క చిత్రంతో నెట్టుకొస్తుంటే.. అక్షయ్‌ మాత్రం సంవత్సరానికి నాలుగు చిత్రాలకు తక్కువ కాకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో అక్కీ చిత్రాల సక్సెస్‌ రేటు కూడా బాగా ఉండటంతో ఆయన ఆదాయం మిగతా సినీతారలతో పోల్చితే ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో మిగతా హీరోలతో పోల్చితే ఎక్కువ వాణిజ్య ప్రకటనలకు బ్రాండింగ్‌ వ్యవహరిస్తోంది ఆయనే. ఇప్పుడీ హీరో ఖాతాలో పారితోషికం పరంగానూ ఓ అరుదైన రికార్డు చేరబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. త్వరలో ఆనంద్‌ ఎల్‌.రాయ్‌తో ఆయన చేయబోయే కొత్త చిత్రం కోసం దాదాపు రూ.120 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అక్షయ్‌తో పాటు ధనుష్, సారా అలీఖాన్‌లు కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లబోయే ఈ సినిమా కోసం అక్షయ్‌కు ఇంత భారీ మొత్తాన్ని ముట్టుజెప్పబోతుంది చిత్ర బృందం. అయితే ఇదంతా ఒకే మొత్తంలో ఉండదని, కొంత పారితోషికంగా ఇవ్వనుండగా.. మిగిలినది డిజిటల్, శాటిలైట్‌ రైట్స్‌ రూపంలోనూ, లాభాల్లో వాట కింద ఇవ్వబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో అక్షయ్‌ నుంచి వచ్చిన ప్రతి చిత్రం దాదాపు రూ.200కోట్ల మార్కును దాటిన నేపథ్యంలో ఈ లాభాల్లో వాట వల్ల ఆయన పారితోషికం రూ.120కోట్ల కన్నా ఎక్కువే అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఒక్క చిత్రం కోసం ఆయన అందుకోబోతున్న పారితోషికం ఇప్పుడు ఉత్తరాదిలోనే కాక దక్షిణాదిలోనూ చర్చనీయాంశంగా మారింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.