అక్షయ్‌ని బెదిరించిన ట్వింకిల్‌ ఖన్నా

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఇటీవల ఓ భయంకరమైన స్టంట్‌ చేశారు. ఈ స్టంట్‌ చేయడాన్ని ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా వ్యతిరేకించారు. ‘ది ఎండ్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో అక్షయ్‌కుమార్‌ నటించబోతున్నారు. తాను నటించబోయే తొలి వెబ్‌సిరీస్‌ కావడంతో గ్రాండ్‌గా దీని గురించి ప్రకటించాలని నిర్ణయించుకున్నారాయన. ఇప్పటివరకు ఏ హీరో ధైర్యం చేయలేని స్టంట్‌ను అక్షయ్‌ చేశారు. ఒంటికి నిప్పంటించుకుని స్టేజ్‌పై నడిచారు. దీంతో ట్వింకిల్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘‘ఛీ.. నీ ఒంటికి నువ్వే నిప్పటించుకోవడానికి ఈ తీరును ఎంచుకున్నావన్నమాట. ఈ విన్యాసం చేసిన తర్వాత కూడా బతికే ఉంటే ఇంటికిరా.. వచ్చాక నిన్ను నేను చంపేస్తాను’’ అంటూ చిర్రుబుర్రులాడారు. అంతేకాదు ‘దేవుడా నన్ను కాపాడు’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు. ట్వింకిల్‌ ట్వీట్‌కు అక్షయ్‌ స్పందిస్తూ.. ‘‘ఇప్పుడు నాకు ఈ విషయంలో భయంగా ఉంది’’ అని చమత్కరించారు. ‘‘యాక్షన్‌ నా రక్తంలోనే ఉంది. హీరో కంటే ముందు నేను స్టంట్‌మ్యాన్‌ని’’ అని రాశారు. అయితే తాను చేయబోయే వెబ్‌సిరీస్‌ షో గురించి అక్షయ్‌ ఎక్కువ వివరాలను వెల్లడించలేదు. తన కుమారుడు ఆరవ్‌ సూచన మేరకు ఈ వెబ్‌సిరీస్‌లో నటించడానికి ఒప్పుకొన్నట్లు పేర్కొన్నారు. ఈ వెబ్‌ సిరీస్‌తో పాటు అక్షయ్‌ ‘కేసరి’, ‘సూర్యవంశి’ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు. మార్చి 21న ‘కేసరి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.