అమితాబ్‌ ఆరోగ్యంగానే ఉన్నారు!

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అనారోగ్యంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ విషయంపై ఆసుపత్రి సిబ్బందిని మీడియా సంప్రదించగా, ఆసుపత్రి ప్రతినిధి ‘‘అమితాబ్‌ బచ్చన్‌ సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం మాత్రమే ఆసుపత్రికి వచ్చారు. ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదని’’ వివరణ ఇచ్చారు. అయితే అమితాబ్‌ అరోగ్య సమస్య ఈనాటి కాదు. ‘కూలీ’ సినిమా షూటింగ్‌ సందర్భంలో ఒక ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన కాలేయం చాలా శాతం పాడైపోయిందని అప్పటి వైద్యులు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తిరిగి మళ్లీ అదే కాలేయ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరారని సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్‌ని కలవడానికి కటుంబ సభ్యలకు మాత్రమే అనుమతి ఇచ్చారట. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశార్జ్‌ చేస్తామని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అమితాబ్‌ ఈనెల అక్టోబర్‌ 11న తన 77వ జన్మదిన వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే. అమితాబ్‌ తెలుగులో ‘సైరా’ చిత్రంలో చిరంజీవి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటించారు. ప్రస్తుతం ‘ఏబీ అని సీడీ’, ‘బ్రహ్మస్త్రా’, ‘గులాబొ సితాబొ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ 2020 నాటికి తెరపైకి రానున్నాయి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.