25 యేళ్ల సినీ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా: బాబీ డియోల్‌

బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర తనయుడు బాబీ డియోల్ తొలుత ‘ధరమ్‌ వీర్’ చిత్రంలో బాల నటుడిగా కనిపించి సందడి చేశారు. ఆ తరువాత కథానాయకుడిగా ‘బర్సాత్‌’ చిత్రంలో అలరించారు. రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ట్వింకిల్‌ ఖన్నా కథానాయికగా నటించింది. ‘బార్సాత్’‌ చిత్రం అక్టోబర్‌ 6, 1995న విడుదలైంది. తాజాగా ఈ చిత్రం సిల్వర్‌ జూబ్లీ జరుపుకోనుంది. ఈ సందర్బంగా బాబీ డియోల్‌ కథానాయకుడిగా 25 సంవత్సరాలు అయిన సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి స్పందిస్తూ’’..నేను హీరోగా వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది. అక్టోబర్‌ 1995లో ప్రారంభమైన ఈ ప్రయాణం..చాలా ఉద్యేగభరితమైనది అని సగర్వంగా చెప్పగలను. ఎన్నో జయాపజయాలు చూశాను. ఈ ఇరవై అయిదు సంవత్సరాల్లో ఎంతో నేర్చుకున్నా. ఈ సినీ ప్రయాణంలో నేర్చుకున్నది ఏంటంటే ఆశను ఎప్పటికీ వదులుకోవద్దు. ఎల్లప్పుడూ ధైర్యంతో ముందడుగు వేయండి. మీ ప్రేమ, సహకారం ఉన్నంతకాలం నా చివరి వరకు మిమ్మల్ని అలరిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నా సహనటులతో సినిమాలు చేస్తూ మరో 25 సంవత్సరాల కోసం ఎదురుచూస్తుంటానని..’’ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. బాబీ డియోల్‌ ‘గుప్త్’‌, ‘సోల్జర్’‌, ‘అజ్నాబీ’, ‘హుమ్రాజ్‌’, ‘కరీబ్’‌, ‘యామ్లా పాగ్లా దీవానా’ లాంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. 2017లో తన సోదరుడు సన్నీ డియోల్‌తో కలిసి ‘పోస్టర్‌ బాయ్స్ ’ చిత్రంలో నటించారు. తరువాత సల్మాన్ ఖాన్‌, జాక్విలిన్‌ ఫెర్నాండజ్‌ నటించిన ‘రేస్‌ 3’లో యష్‌ పాత్రలో అరించారు. ఈ ఏడాది ‘ది క్లాస్‌ ఆఫ్‌ 83’ అనే చిత్రంలో పోలీస్‌ అకాడమీ డీన్‌గా అలరించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్లో విడుదలైంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.