కరోనా మంచి చేస్తోంది

కరోనా వైరస్‌.. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు గజగజలాడిపోతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్‌ సోకి లక్షలాది మంది ప్రజలు ఆస్పత్రుల పాలవ్వగా.. వేల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. దీని ప్రభావానికి అనేక దేశాల ఆర్థిక రంగాలు కుదేలైపోతున్నాయి. అయితే ఈ మహమ్మారి వల్ల ప్రపంచ మానవాళికి నష్టాలే కాకుండా.. ఎవరూ గుర్తించనంతటి మంచి జరుగుతోంది. ఇప్పుడు దీన్ని ప్రతిఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు బాలీవుడ్‌ యువ కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌. తాజాగా కరోనా వల్ల ఈ భూమండలంపై జరుగుతున్న కొన్ని సానుకూల పరిణామాలకు సంబంధించి ఓ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లో పంచుకున్నారు టైగర్‌. ‘‘కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన మార్పులు మొదలయ్యాయి. చైనా, జపాన్‌లలో కాలుష్య స్థాయి గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా జింకలు ఆయా దేశ వీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఇదే తరహాలో థాయ్‌లాండ్‌ వీధుల్లో కోతులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వెనిస్‌లో నదీ జలాలు అత్యంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. ఫలితంగా అక్కడ డాల్ఫిన్ల సందడి పెరుగుతోంది. మానవ కాలుష్యం చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోన్న ఈ మార్పులను మనం అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన సమయం. పచ్చని ప్రకృతి మధ్య మన జీవితాల్ని సరికొత్తగా ప్రారంభించుకుందాం. ప్రకృతిని కాపాడుకునే దిశగా ఇకపై పూర్తి స్పృహతో ముందడుగు వేద్దాం’’ అంటూ ఆ పోస్ట్‌లో రాసుంది. టైగర్‌ షేర్‌ చేసిన ఇదే ఫొటోను ఇంత వరకు 20 మిలియన్ల మంది తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం విశేషం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.