ఆ అదృష్టం నాది కాదు: సల్మాన్‌

‘ఏ సినిమా అయినా సవాలే. కానీ నటించడం కంటే కూడా చిత్రాన్ని నిర్మించడంలోనే ఎక్కువ కష్టనష్టాలు ఉంటాయి. ప్రేక్షకులు మళ్లీ మళ్లీ సినిమా చూసేలా ఓ సినిమాని తీర్చిదిద్దడం అంటే అంత సులువేం కాదు’’ అంటున్నారు సల్మాన్‌ఖాన్‌. ఆయన చిత్రాలు హిట్‌ అయితే బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీయే. తాజాగా ఆయన నుంచి రాబోతున్న చిత్రం ‘భారత్‌’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో సల్మాన్‌ వివిధ గెటప్పుల్లో కనిపించనున్నారు. ఈ నెల 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘భారత్‌’ విశేషాలతో పాటు చెప్పిన మరిన్ని ఆసక్తికర సంగతులు...


* ‘భారత్‌’లో యువకుడి నుంచి డైభ్భై ఏళ్ల వయసున్న వృద్ధుడి వరకూ వివిధ గెటప్పులో కనిపిస్తాను. వాటిల్లో నా వయసుకు మించి తెరపై కనిపించాల్సి వచ్చినప్పుడు, నేను దాటివచ్చిన వయసున్న పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడే కష్టపడాల్సి వచ్చింది. రెండూ పూర్తి భిన్నంగా ఉండే గెటప్పులు. మాట, నడక, దేహాకృతి పూర్తి భిన్నంగా ఉంటాయి. ‘మైనే ప్యార్‌ కియా’లో కనిపించినట్లు ఇప్పుడు కనిపించాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోండి. నటించినట్టు ఉండకూడదు అంతా చాలా సహజంగా ఉండాలి. ఈ సినిమా కోసం నా గత చిత్రాలను పూర్తి స్థాయిలో చూడలేదు కానీ కొన్ని సన్నివేశాలను ఒక్కసారి చూశాను. మొత్తానికి నా అసలు వయసు కంటే ఎక్కువ, తక్కువ ఉన్న గెటప్పుల్లో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నంలో విజయం సాధించానే అనుకుంటున్నాను.


* కత్రినాకైఫ్, నేను కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి కాబట్టి ఆమె నా అదృష్టం అంటున్నారు కొందరు. అలాగైతే 2008లో వచ్చిన ‘యువరాజ్‌’ కూడా విజయం సాధించాలి కదా. నేను అదృష్టవంతుణ్ని కాబట్టే నా సినిమాలు ఆడుతున్నాయి. ‘భారత్‌’లో కత్రినా చాలా సహజంగా నటించింది. ఈ చిత్రంలో ఓ కొత్త కత్రినాను చూస్తారు ప్రేక్షకులు. ఆమె కూడా వివిధ వయసులున్న గెటప్పుల్లో తెరపై కనిపిస్తుంది.


* నా సినిమా విడుదలవుతుందంటే కాస్త కంగారు ఉంటుంది. గత చిత్రాన్ని మించి సూపర్‌ హిట్‌ కావాలనే కోరుకుంటాను. నేను సినిమా రివ్యూలు చదవను. ప్రేక్షకుల స్పందన తెలుసుకుంటాను. అది బాగుంటే చాలు నాకు సంతోషమే.

* హిందీ చిత్రాలకు చైనాలో మంచి మార్కెట్‌ ఉంది. భవిష్యత్తుల్లో ఈ విషయంపై మరింత దృష్టిసారిస్తాను. చైనా కూడా వెళ్లాలనుకుంటున్నాను. చైనా చిత్రాలు ఎక్కువగానే చూస్తుంటాను. ముఖ్యంగా జాకీచాన్‌ చిత్రాలు అస్సలు వదిలిపెట్టను.

* ‘ఇన్‌షా అల్లా’లో ఆలియా నటిస్తోంది. ఆమె చాలా సహజమైన నటి. అంతకంటే మంచి అమ్మాయి. ఈతరం కథానాయకుల్లో భవిష్యత్తులో మంచి స్టార్‌డమ్‌ తెచ్చుకునే అవకాశం ఉన్నవాళ్లలో వరుణ్‌ధావన్‌ ముందువరసలో ఉంటాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.