అద్భుత పాత్రల్లో మెరి‌సిన డేవిడ్‌
article image
హిందీ చలన చిత్రరంగం ఉచ్ఛ‌ద‌శలో ఉన్న‌ప్పుడు ఓ వెలుగు వెలి‌గిన నటీ‌న‌టు‌లను అప్పు‌డ‌ప్పుడు గుర్తు‌చే‌సు‌కుం‌టుం‌డాలి.‌ ఎందు‌కంటే వారు చిత్ర సీమకు చేసిన సేవ‌లకు విలువ కట్టలేం కనుక.‌ ప్రకాష్‌ అరోరా దర్శ‌క‌త్వంలో రాజ్‌క‌పూర్‌ నటించి నిర్మిం‌చిన ‌‘బూట్‌ పాలిష్‌’‌ (1954).‌ ఆ సినిమా పాటలు ఎక్కడో ఒక్క‌చోట రోజూ విన‌వ‌స్తూనే ఉంటాయి.‌ ఇంకాస్త ముందుకు జరి‌గితే ‌‘గోల్‌మాల్‌’‌ (1979), ‌‘బాతోం‌బాతోం మే’‌ (1979) సిని‌మాలు కూడా గుర్తుం‌డేవే.‌ ఈ సిని‌మా‌లలో అద్భు‌తంగా అల‌రిం‌చిన నటుడు డేవిడ్‌.‌ అతన్ని గుర్తు పట్టడం తేలికే.‌ డేవిడ్‌ అసలు పేరు డేవిడ్‌ అబ్రహాం చెవు‌ల్కర్‌.‌ జ్యువిష్‌ సంత‌తికి చెందిన నటుడు డేవిడ్‌ 1941లో వచ్చిన ‌‘నయా సంసార్‌’‌ సినిమా నుంచి ‌‘సంబంద్‌’‌ (1981) వరకు వందకు పైగా సిని‌మాల్లో సహాయ పాత్రలు పోషిం‌చారు.‌ డేవిడ్‌ బొంబాయి యూని‌వ‌ర్శిటీ పట్ట‌భ‌ద్రుడే కాక న్యాయ‌శా‌స్త్రంలో పట్టా పుచ్చు‌కు‌న్న‌వాడు.‌ మోహన్‌ భవ‌నాని ప్రోత్సా‌హంతో మొదట జంబో (1937) సిని‌మాలో నటిం‌చారు.‌ క్వాజా అహ‌మ్మద్‌ అబ్బాస్‌ నిర్మిం‌చిన షెహర్‌ అవుర్‌ సాప్నా, పర‌దేశి వంటి చిత్రాల్లో సహా‌యక పాత్రలు పోషిం‌చారు.‌ రాజ్‌క‌పూర్‌ చిత్రం బూట్‌ పాలి‌ష్‌లో జాన్‌ చాచా పాత్ర పోష‌ణకు డేవిడ్‌ ఫిలిం‌ఫే‌ర్‌వారి ఉత్తమ సహా‌య‌న‌టుడు బహు‌మతి అందు‌కు‌న్నారు.‌ అందులో ‌‘నన్హే మున్నె బచ్చే’‌ డేవిడ్‌ మీద చిత్రీ‌క‌రిం‌చారు.‌ డేవిడ్‌ మంచి వక్త కూడా.‌ పండిట్‌ జవ‌హ‌ర్లాల్‌ నెహ్రూ ఒకా‌నొక సంద‌ర్భంలో మాట్లా‌డుతూ, ‌‘డేవిడ్‌ ప్రసంగం లేనిదే ఆ సభ సంపూ‌ర్ణ‌మై‌నట్టు భావిం‌చ‌రాదు’‌’‌ అని వ్యాఖ్యా‌నిం‌చా‌రంటే, డేవిడ్‌ ప్రతిభ ఎలాం‌టిదో బేరీజు వెయ్యొచ్చు.‌ డేవి‌డ్‌కు భారత ప్రభుత్వం 1969లో పద్మశ్రీ పుర‌స్కారం అంద‌జే‌సింది.‌ డేవిడ్‌ ఆజన్మ బ్రహ్మ‌చారి.‌ సత్యం శివం సుందరం సిని‌మాలో డేవిడ్‌ బడే‌బాబు పాత్రలో మంచి గుర్తింపు తెచ్చు‌కు‌న్నారు.‌ హిందీ సిని‌మాకు ఉత్తమ సేవలు అందిం‌చిన డేవిడ్, కెన‌డాలో మర‌ణిం‌చారు.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.