హృతిక్‌ చెయ్యలేకపోయిన ఛాలెంజింగ్‌ పాత్ర

బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌.. ఇప్పటి వరకు వెండితెరపై అనేక రకాల సాహసోపేతమైన పాత్రల్లో నటించారు. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే యాక్షన్‌ సీక్వెన్స్‌తోనూ అదరగొట్టారు. ‘క్రిష్‌’, ‘ధూమ్‌’, ‘వార్‌’ వంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణ. అయితే తానిప్పటి వరకు ఎన్ని పాత్రలు చేసినా ఓ ఛాలెంజింగ్‌ పాత్రను చెయ్యలేదన్న లోటు ఇంతవరకు అలాగే ఉండిపోయిందంటున్నారు హృతిక్‌. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయనీ విషయాలు పంచుకున్నారు. ఇంతకీ ఆయన చెయ్యలేకపోయినా అంతటి స్పెషల్‌ క్యారెక్టర్‌ ఎంటో తెలుసా.. పోలీస్‌ పాత్ర. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో అదిరిపోయే పోలీస్‌ అధికారి పాత్ర ఒకటి కూడా ఇంతవరకు చెయ్యలేకపోయాడట. అసలిలాంటి పాత్రతో ఏ దర్శక, నిర్మాత తనని సంప్రదించలేదట. ఒకవేళ ఇప్పుడెవరైనా తనకు సరిపడే పోలీస్‌ పాత్రతో ఎలాంటి ఆలోచన లేకుండా ఓకే చెప్పేస్తానని, అర్జెంటుగా బాలీవుడ్‌ ఫిలిం మేకర్లు తన కోసం శక్తిమంతమైన పోలీస్‌ పాత్రలు సృష్టించే ప్రయత్నం చెయ్యాలని వేడుకున్నారు హృతిక్‌. గతేడాది ‘సూపర్‌ 30’, ‘వార్‌’ చిత్రాలతో వరుస హిట్లను ఖాతాలో వేసుకున్న ఆయన.. ప్రస్తుతం ‘కిష్‌ 4’ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.