అర్ధనగ్నంగా మారింది జాన్వి కోసమేనా!!

‘ధడక్‌’ చిత్రంతో సినీప్రియుల్ని మురిపించిన అందమైన జోడీ జాన్వి కపూర్‌ - ఇషాన్‌ కట్టర్‌. ఇందులో ప్రేమికులుగా వీరిద్దరూ పండించిన కెమిస్ట్రీకి విమర్శకుల నుంచీ ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ జోడీ నిజ జీవితంలోనూ ప్రేమ పక్షుల్లాగా మారినట్లు గత కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే తమ మధ్య ప్రేమాగీమా ఏమీ లేదని జాన్వి ఆ మధ్య క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఇషాన్‌ ఆమె పట్ల వ్యవహరిస్తున్న తీరు మాత్రం ప్రేమ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా ఉంది. తాజాగా ఈ యువ హీరో ఓ కార్యక్రమంలో జాన్వి కోసం అర్ధనగ్నంగా మారడం సినీప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇషాన్‌ ఇటీవల నేహాదూపియా నిర్వహించే టాక్‌ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆమె షాహీద్‌ కపూర్‌ మాజీ ప్రేయసిల్లో నీకు ఎక్కువగా ఎవరంటే ఇష్టమని ఇషాన్‌ను ప్రశ్నించగా.. ప్రియాంక చోప్రా పేరును ఠక్కున చెప్పాడు అతను. ఆ తర్వాత కూడా ఆమె అడగిన రకరకాల ప్రశ్నలకు తనదైన శైలిలో ఆసక్తికర జవాబులు చెప్పిన ఇషాన్‌.. ఒకానొక సమయంలో మాత్రాం బాగా ఇరుకున పడ్డట్లుగా కనిపించాడు. ఈ షోలో ఓ ఆసక్తికర రౌండ్‌ ఉంటుంది. ఆ రౌండ్‌లో వ్యాఖ్యాత అడిగే ప్రశ్నలకు కచ్చితంగా నిజం చెప్పాలి.. లేదంటే ఒంటిపైనున్న షర్ట్‌ విప్పేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే నేహా ‘జాన్వి కపూర్, సారా అలీఖాన్, తారా సుతారియా, అనన్య పాండేల్లో ఎవరు ఎక్కువ ప్రతిభావంతులు’ అని ఇషాన్‌ను అడగ్గా.. ‘తార, అనన్య సినిమాలు ఇంకా విడుదల కాలేదు కదా.. కాబట్టి వారి గురించి చెప్పలేను’ అంటూ సమాధానాన్ని దాటవేశాడు. కానీ, నేహా అతన్ని వదలకుండా ‘జాన్వి, సారాల్లో ఎవరు గొప్పో చెప్పాల’ని అడిగింది. అయితే ఇక్కడ కూడా ఇషాన్‌ తన తెలివి చూపించాడు. ‘జాన్వి, సారా ఇద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్‌.. కాబట్టి వారిలో ఎవరి గురించి తక్కువ చెప్పలేను. అందుకే నా షర్టు విప్పేస్తాను’ అని చెప్పి ఆ పని పూర్తిచేశాడు. దీంతో ఇప్పుడిది కాస్తా చర్చనీయాంశంగా మారింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.