బాల్‌ తగిలింది.. 13 కుట్లు పడ్డాయట!!

గతేడాది ‘కబీర్‌ సింగ్‌’గా ప్రేక్షకుల మనసు దోచిన షాహిద్‌ కపూర్‌.. ఇప్పుడు ‘జెర్సీ’ రీమేక్‌తో బిజీగా మారిన సంగతి తెలిసిందే. తెలుగు మాతృకను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరే ఈ బాలీవుడ్‌ వెర్షన్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ కూడా మొదలైపోయింది. కానీ, అనుకోకుండా సెట్స్‌లో షాహిద్‌ గాయపడటంతో ఇప్పుడీ చిత్రీకరణ ఆగిపోయినట్లు బాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ చండీగఢ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర సెట్స్‌లో షాహిద్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా.. అనుకోకుండా ఓ బంతి ఆయన నోటికి వచ్చి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడని, ఆయన కింద పెదానికి దాదాపు 13 కుట్లు పడ్డాయని సమాచారం. ఈ గాయం నుంచి కోలుకోవడానికి షాహిద్‌కు నెల రోజుల సమయం పట్టే అవకాశముందని వైద్యులు తెలిపారట. దీంతో ప్రస్తుతానికి చిత్రీకరణను వాయిదా వేసిందట చిత్ర బృందం. తెలుగులోనూ ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో హీరో నానికి ఇదే తరహాలో బంతి తగిలి ముక్కుకు తీవ్ర గాయమైంది. దీంతో అప్పుడు కూడా ఇలాగే చిత్రీకరణకు కాస్త గ్యాప్‌ వచ్చింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.