వారి మెంటల్‌ టార్చర్‌ వల్లే హృతిక్‌ వెనక్కు!!

బాలీవుడ్‌ అగ్రతారలు హృతిక్‌ రోషన్‌ - కంగనా రనౌత్‌ల మధ్య విభేదాలు అప్పట్లో జాతీయ, ప్రాంతీయ మీడియాల్లో పతాక శీర్షికలపై దర్శనమిచ్చాయి. ఒకానొక దశలో వీరిద్దరి వ్యవహారం కోర్టు మెట్ల వరకు చేరుకోని తర్వాత చల్లబడింది. అయితే అది నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉందని తాజాగా మరోసారి నిరూపితమైంది. కంగనా నటించిన ‘మెంటల్‌ హై క్యా’, హృతిక్‌ రోషన్‌ ‘సూపర్‌ 30’ ఒకేసారి బాక్సాఫీస్‌ ముందుకొస్తున్న నేపథ్యంలో తాజాగా ఫైర్‌బ్రాండ్‌ సోదరి రంగోలి హృతిక్‌పై బెదిరింపు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ వ్యాఖ్యలపై ఆయన హృతిక్‌ రోషన్‌ స్పందించారు. ట్విటర్‌ ద్వారా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. ‘‘ఈ మీడియా సర్కస్‌ వల్ల నేను అనుభవిస్తున్న మెంటల్‌ టార్చర్‌ తట్టుకోలేకపోతున్నా. అందుకే నా ‘సూపర్‌ 30’ చిత్రానికి ఎలాంటి నష్టం కలుగకూడదని భావించి విడుదల తేదీలో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నా. రిలీజ్‌కు రెడీగా ఉన్నప్పటికీ చిత్రాన్ని మరో రోజున తీసుకొస్తే బాగుంటుందని నా నిర్మాతలను కోరాను. గత కొన్నేళ్లుగా పరోక్షంగా వేధిస్తున్న కొందరిని చూసి చప్పట్లు కొడుతున్న వారిని, ప్రోత్సహిస్తున్న వారిని నేను చూశాను. సమాజం పట్ల నమ్మకం కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి విషయాలపై అందరికీ అవగాహన రావాలి. అలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అని ఇప్పటికీ ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నా. ఇలాంటి నిస్సహాయ పరిస్థితులకు ఇకనైనా ముగింపు పలకాలి’’ అంటూ తన లేఖ ద్వారా కంగన, రంగోలీలకు చురకలంటించారు హృతిక్‌. ప్రస్తుతం ఈ లేఖ బాలీవుడ్‌లో, హృతిక్‌ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ‘సూపర్‌ 30’ విడుదల తేదీ మారుతున్న నేపథ్యంలో ఇకనైనా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఆగుతుందా? లేక కంగనా సిస్టర్స్‌ మరోసారి రెచ్చిపోతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.