.jpg)
చిత్రసీమకు చెందిన 24 విభాగాలపైనా పట్టున్న సృజనశీలి... కరణ్ జోహార్. తన అసలు పేరు రాహుల్ కుమార్ జోహార్. దర్శకుడు, నటుడు, నిర్మాత, రచయిత, కాస్ట్యూమ్ డిజైనర్, వ్యాఖ్యాత... ఇలా ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేశారు. తండ్రి యష్ జోహార్ వేసిన బాటలో నడుస్తూ, ధర్మా ప్రొడక్షన్ బాధ్యతల్ని మోస్తూనే తన విభిన్నతనూ, విలక్షణతనూ చాటుకున్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. దర్శకుడిగా తొలి ప్రయత్నం ‘కుచ్ కుచ్ హోతా హై’. 1998లో విడుదలైన ఈ చిత్రం ఓ సంచలనం. ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ‘కుచ్ కుచ్ హోతాహై’ జాతీయ అవార్డుని సైతం అందుకుంది. పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. అప్పటి నుంచీ బాలీవుడ్లో కరణ్ హవా కొనసాగుతూనే ఉంది. ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ (2001), ‘కభి అల్విదా న కెహనా’ (2006), ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ (2010), ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ (2012), ‘ఏ దిల్ హై ముష్కిల్’ (2016) ఇలా దర్శకుడిగా విజయవంతమైన చిత్రాల్ని అందిస్తూ బాలీవుడ్లో కాసుల వర్షం కురిపించారు. నిర్మాతగా ‘రాజీ’, ‘ధడక్’, ‘సింబా’ లాంటి కమర్షియల్ విజయాలతో తన బ్రాండ్ ఇమేజ్‌ని కొనసాగించారు. ‘కె’ అక్షరంతో మొదలయ్యేలా సినిమా టైటిల్స్ నిర్ణయించడం ఆయనకు కొంతకాలం సెంటిమెంట్‌గా మారింది. ఆ తరవాత ఆ సెంటిమెంట్‌ని పక్కన పెట్టారు. మరోవైపు వెబ్ సిరీస్ రంగంలోనూ కాలు మోపారు. ‘లస్ట్ స్టోరీస్’తో సంచలనం సృష్టించారు. ‘కాఫీ విత్ కరణ్’తో బుల్లి తెర వ్యాఖ్యాతగా ఖ్యాతినార్జించారు. ‘బాహుబలి’ని బాలీవుడ్లో విడుదల చేశారు కరణ్ జోహార్. ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘కల్ హో నా హో’, ‘ఫ్యాషన్’, ‘లక్ బై ఛాన్స్’ తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు.
.jpg)