ఇన్‌సైడర్స్, అవుట్‌సైడర్స్‌ అని విభజించొద్దు
‘‘నెపోటిజం అనేది ఒక్క చిత్ర పరిశ్రమలోనే కాదు...చాలా చోట్ల ఉంది. అందుకోసం ఎవ్వరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ‘ఇన్‌సైడర్స్‌’, ‘అవుట్‌సైడర్స్‌’ అంటూ విభజించి చూడొద్దు. ఇన్‌సైడర్స్‌ను కించపరిచేలా మాట్లాడొద్దు’’అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి గొప్ప నటుడిగా నిరూపించుకున్నారు నవాజుద్దీన్‌. ‘‘నాకు ఫార్ములా చిత్రాలు చేయడం ఇష్టం ఉండదు. అదే నన్ను నటుడిగా అందరికీ చేరువ చేసింది. ఇన్‌సైడర్స్‌తో పనిచేసే చాలామంది దర్శకులు అవుట్‌సైడర్స్‌తోనూ పనిచేస్తున్నారు. నిజమైన ప్రతిభ ఉంటే ఇన్‌సైడర్స్‌ అయినా గౌరవించాల్సిందే. వాళ్ల డబ్బు వాళ్ల ఇష్టం. వాళ్లకి ఎవరు ఇష్టం ఉంటే వాళ్లనే నటులుగా పెట్టుకుంటారు. సినిమా అనేది వాళ్లకు పూర్తిగా ఓ వ్యాపారం అంతే. లేనిపోని అపోహలతో హిందీ చిత్ర పరిశ్రమను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం మంచిది కాదు అంటున్నారు నవాజుద్దీన్‌. ‘‘చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు, రచయితలు, ఛాయా గ్రాహకులు..ఇలా చాలా విభాగాల్లో బయటనుంచి వచ్చినవారు ఉన్నారు. గొప్పగా జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌ అవుట్‌సైడర్స్‌కు సరిపోదు తరహా కామెంట్లు చేస్తే ఇందులోకి రావాలనుకునేవారు మరింత భయపడతారు. నా వరకూ నేను అయితే నెపోటిజమ్‌ ప్రభావానికి గురి కాలేదు’’ అని చెప్పారు నవాజుద్దీన్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.