షారుఖ్‌ చూశారు.. ఇక చాలు అనిపించింది

తెలుగు చిత్రసీమతో పోల్చితే వారసత్వ పోకడలు బాలీవుడ్‌లోనే కాస్త ఎక్కువని చెప్పాలి. అక్కడ ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా హీరో, హీరోయిన్లుగా నిలదొక్కుకోవడమంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇలాంటి దారిలో నుంచి నడిచొచ్చే కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కార్తీక్‌ ఆర్యన్‌. ‘ప్యార్‌ కా పంచ్‌నామా’ చిత్రంతో బాలీవుడ్‌ తెరపై మెరిసిన ఈ యువ హీరో.. ‘ప్యార్‌ కా పంచ్‌నామా 2’ చిత్రంతో తొలిసారి విజయపు రుచి చూశారు. ఇక అక్కడి నుంచి ‘సోను కే టిటు కి స్వీటీ’, ‘లూకా చుప్పి’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటూ బాలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్‌ హీరోల జాబితాలో చేరిపోయారు. అయితే తాను ముంబయిలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఇంతటి స్థాయికి వస్తానని ఏనాడు అనుకోలేదట. అంతేకాదు.. ఆరోజుల్లో బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఖాన్‌ను చూడటానికి ఆయన ఇంటికెళ్లినప్పుడు జరిగిన ఓ ఆసక్తికర సంఘటనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘‘ముంబయిలో అడుగుపెట్టగానే ముందు నా కలల హీరో షారుఖ్‌ను చూడటానికి బాంద్రాలోని ఆయన స్వగృహానికి వెళ్లా. ఆయన్ని చూడటానికి అక్కడికి రోజూ వేలాది మంది అభిమానులు వస్తుంటారు. నేను వెళ్లిన ఆరోజు అలాంటి వాతావరణమే ఉంది. నేను ఆ గుంపులో నుంచే షారుఖ్‌ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నా. అంతలోనే ఆయన ఇంటి గేట్లు తెరచుకున్నాయి. షారుఖ్‌ తన కారులో బయటకొస్తూ.. అక్కడే ఉన్న అభిమానులందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న నాపై కూడా ఆయన చూపులు నిలిచాయి. నన్ను చూసి ఓ చిన్నచిరు నవ్వి వెళ్లిపోయారు. ఆ క్షణం నన్ను నేను మర్చిపోయాను. నా అభిమాన సూపర్‌స్టార్‌ అంతమందిలో నన్ను గుర్తించారు. నావైపు చూశారు. ఇక ఈ జీవితానికి చాలు అనిపించింది’’ అంటూ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు కార్తీక్‌.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.